ట్రంకు పెట్టెల కేసు నీరుగారిపోతుందా? మనోజ్‌ మేనేజ్ చేశాడా?

ABN , First Publish Date - 2020-09-18T18:08:57+05:30 IST

అనంతపురం జిల్లాలో బయటపడ్డ ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌ కుమార్‌ నిధి కేసు నీరుగారిపోతోందా? కోట్ల రూపాయల సంపద కూడబెట్టిన మనోజ్‌ కుమార్‌ను అటు పోలీసులు, ఇటు ఏసీబీ అధికారులు లైట్‌ తీసుకుంటున్నారా?

ట్రంకు పెట్టెల కేసు నీరుగారిపోతుందా? మనోజ్‌ మేనేజ్ చేశాడా?

అనంతపురం జిల్లాలో బయటపడ్డ ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌ కుమార్‌ నిధి కేసు నీరుగారిపోతోందా? కోట్ల రూపాయల సంపద కూడబెట్టిన మనోజ్‌ కుమార్‌ను అటు పోలీసులు, ఇటు ఏసీబీ అధికారులు లైట్‌ తీసుకుంటున్నారా? నిధి బయటపడ్డ రోజు హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయారా? అవినీతి ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు వెనకడుగు వేస్తున్నారా? రాజకీయ నాయకులు, పోలీస్‌ ఉన్నతాధికారుల ఒత్తిళ్ల వల్లే కేసు విచారణ ముందుకు కదలడం లేదా?


ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది ట్రంకు పెట్టెల్లో నిధులు. దగదగ మెరిసిపోయే బంగారు ఆభరణాలు ఓవైపు, వెండి నగలు మరోవైపు.. లక్షల కొద్దీ నగదు ఇంకోవైపు. మొదట అంతా గుప్తనిధులుగా అనుమానించారు. కానీ ఆ తర్వాతే తెలిసింది కోట్ల విలువైన సంపద కూడబెట్టింది ఓ అవినీతి అధికారి అని.  పోనీ అతడి పూర్వీకులు సంపన్నులా అంటే అదేమీకాదు. తండ్రి ఓ హెడ్‌కానిస్టేబుల్‌.. ఆయన చనిపోతే కారుణ్యం కింద ఇతడు ఉద్యోగం పొందాడు. చిరుద్యోగిగా మొదలుపెట్టి.. 15 ఏళ్లలో కోట్లకు పడగలెత్తాడు. అతడే ఖజానా శాఖ సీనియర్‌ అకౌంటెంట్‌ మనోజ్‌కుమార్‌.


అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ట్రంకు పెట్టెల్లో నాలుగు కోట్లకుపైగా విలువైన నిధి బయటపడటం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నిధి అనంతపురం ఖజానా శాఖలో సీనియర్ అకౌంటెంట్ మనోజ్‌కుమార్‌దే అని విచారణలో తేలింది. మనోజ్‌ విలాసవంతమైన జీవితంపై పోలీసులు నిఘా పెట్టడంతో డొంకంతా కదిలింది. తుపాకీ స్వాధీనం కోసం వెళితే.. ఎనిమిది ట్రంకు పెట్టెల్లో నిధి బయటపడింది. ఈ నగలు తన ఇంట్లో పెట్టుకుంటే భద్రత ఉండదని భావించిన మనోజ్ తన డ్రైవర్ నాగలింగం ఇంట్లో దాచిపెట్టారని గుర్తించారు. ఒక రివాల్వర్, మరొక ఎయిర్ పిస్టల్‌తో పాటు రెండున్నర కిలోల బంగారం, 84 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ, ఆదాయపన్ను శాఖ దృష్టికి వివరాలు పంపుతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. దీంతో ఖజానా శాఖ అధికారులు మనోజ్ కుమార్‌ను విధుల నుంచి తప్పించారు. ఇక్కడి వరకూ అంతా చకచకా సాగిపోయింది. ఆ తర్వాత విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. 


నిధులు స్వాధీనం చేసుకున్న రోజు పోలీసు అధికారులు కేసును ఏసీబీకి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ అవినీతి నిరోధక శాఖ అధికారులు గానీ, విచారణ అధికారులు గానీ మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన దాఖలాలు లేవు. కోట్ల రూపాయల నిధులతో మనోజ్‌ అడ్డంగా బుక్కయినా.. అతడి బంధువుల ఇళ్లలో సోదాలు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల క్రితం ఏసీబీ ఉన్నతాధికారులు కేసు దర్యాప్తు చేపట్టాలని అనంతపురం జిల్లా విభాగ అధికారులకు ఉత్తర్వులు పంపారు. అయితే దర్యాప్తు చేయాల్సిన అధికారులు సెలవులో ఉన్నారంటూ కిందిస్థాయి సిబ్బంది చెప్పుకొస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.


మనోజ్ కేసు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం రాజకీయ అండదండలేనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఓ చిరుద్యోగి కోట్లకు ఎలా పడగలెత్తాడనే విషయంపై విచారణ జరగడం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలోనూ మనోజ్‌పై బదిలీల వేటు పడింది. అయితే అతగాడికి ఉన్న రాజకీయ పలుకుబడి ముందు అవేమీ నిలబడలేకపోయాయి. అనంతపురం నుంచి గుత్తికి బదిలీ చేసినా.. ఆ మరుసటి రోజే ఆ ఉత్తర్వులను రద్దు చేయించుకుని తిరిగివచ్చాడు. గతేడాది మరోసారి ధర్మవరం ట్రెజరీకి సీనియర్‌ అకౌంటెంట్‌గా బదిలీపై వెళ్లినా..అక్కడ ఎంతోకాలం కొనసాగలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరిగి యథాస్థానానికి చేరుకున్నాడు. దీన్నిబట్టే మనోజ్‌ పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. రాజకీయ నేతలు, పోలీసుశాఖలో ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెటిల్‌మెంట్లు చేస్తూ.. అక్రమార్జనకు తెరలేపాడన్న ఆరోపణలున్నాయి. భార్యతో తలెత్తిన విభేదాలతో ఆమెను, బంధువులను మనోజ్‌ గన్‌తో బెదిరించాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు దృష్టిపెట్టారు. రివాల్వర్‌ కోసం మనోజ్‌ డ్రైవర్‌ నాగలింగం మామ ఇంట్లో సోదా చేస్తుండగా నిధి బయటపడటం సంచలనం రేపింది. మొత్తంమీద ట్రంకు పెట్టెల్లో నిధి కేసు నీరుగారిపోయేందుకు మనోజ్ తనకున్న రాజకీయ బలాన్ని, పోలీస్ పవర్‌ను వాడుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

Updated Date - 2020-09-18T18:08:57+05:30 IST