ఇంద్రచాపవర్ణ శోభితం ఇంద్రగంటి సాహిత్యం

ABN , First Publish Date - 2021-08-23T08:38:41+05:30 IST

ఈయమృతానురాగ కథలే బ్రతుకెల్లెడ పూచి పూవులై తీయని ఎన్ని పద్యముల దిద్దునొ? ఎన్ని కథానికల్‌ ఫల శ్రీయయి లోకమెల్ల మధురించునొ...

ఇంద్రచాపవర్ణ శోభితం ఇంద్రగంటి సాహిత్యం

‘‘ఈయమృతానురాగ కథలే బ్రతుకెల్లెడ పూచి పూవులై

తీయని ఎన్ని పద్యముల దిద్దునొ? ఎన్ని కథానికల్‌ ఫల

శ్రీయయి లోకమెల్ల మధురించునొ? తీరని కాంక్షలెత్తగా

వేయి యుగమ్ములైన ప్రభవింతును కమ్మని తెల్గుతోట లోన్‌ 

- అన్న ఆకాంక్షను బలంగా వ్యక్తీకరించిన నిజమైన తెలుగు వెలుగు ఎవరో కాదు- శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారే! ‘‘ సృష్టిలో తీయనిది స్నేహమేనోయి!’’ అన్న సూక్తిని తరచుగా వింటూ ఉంటాం. ఇది ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు రచించిన ఒక పాటకు పల్లవి- ‘‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి! వ్యష్టి జీవము చేదు పానీయమోయి!’’ ఇది పాటకు ఆరంభ వాక్యం. ఈ గీతం హెచ్‌.ఎం.వి. గ్రామ్‌ఫోన్‌ రికార్డ్‌ కంపెనీ వారి పాటల రచనల పోటీలో ప్రథమ బహుమతిని పొందింది. ఆ పాటను శ్రీ పెండ్యాల నాగేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో శ్రీమతి బాలసరస్వతిగారు తిలకామోద్‌ రాగంలో గానం చేశారు. ఈ గీతం వీరి ‘‘హేమమాలి’’ నాటకంలో కూడా ఉంది. ‘‘పూల దోసిళ్ళెత్తరా! మన పుణ్య వీరుల పాడరా!’’, ‘‘నాదు జన్మభూమి కంటె నాకమెక్కడుంది? సుర లోకమెక్కడుంది?’’ అన్న వీరి దేశభక్తి గీతాలు కూడా ఆకాశవాణి ద్వారా బాగా పేరు పొందాయి.


అసలు- ఇంద్రగంటి పేరు చెప్పగానే సాహిత్యవేత్తలకందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది- ‘దక్షారామ’ పద్య కావ్యం. ఇది ఆధునిక క్షేత్ర పద్య కావ్యం. సుమారుగా 1948-1949 ప్రాంతాల్లో చిత్రకారులైన శ్రీ దశిక సుబ్బరాయశర్మగారితో కలిసి ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇంద్రగంటి వారి నోటి వెంట ‘‘ఇక్కడ కాలు పెట్టగ నదేమి మహత్త్వమొగాని- ఊహకు రెక్కలు వచ్చినట్లు చననేరని పూర్వయుగాల వాలుదున్‌...’’ ఇత్యాదిగా ఆశువుగా ఒక పద్యం వెలువడింది- మొదట. ఆ తర్వాత- ఈ క్షేత్ర పూర్వ వైభవాన్ని ప్రస్తుత దుస్థితిని కళ్ళకు కట్టిస్తూ, భగ్యంతరంగా ఈ దేశ సంస్కృతిని కాపాడుకునే ఆవశ్యకతను బోధిస్తూ ‘దక్షారామము’ అన్న పేరుతో పద్య కావ్యాన్ని వెలువరించారు. శ్రీనాథుడు ‘భీమేశ్వర పురాణం’లో వర్ణించని దేవాలయ శిల్ప వైభవాన్ని ఇంద్రగంటివారు అనుభూతి ప్రధానంగా వర్ణించారు. కవితా రచనా పరంగా చూస్తే- ఈ కావ్యంలో శ్రీనాథుని కవితా పరమైన పంజాపట్టు బాగా కనిపిస్తుంది. అయితే- ఈ దక్షారామ కావ్య రచనకి తర్వాత సుమారు ముప్ఫైయేండ్లకు రాసిన ‘కీర్తి తోరణము’ అన్న పద్య కావ్యంలో మాత్రం శాస్త్రిగారు ఈ పంజాపట్టు నుంచి తప్పుకున్న తీరు కనిపిస్తుంది. కాకతీయ రాజుల కథ ప్రధానంగా నడిచిన ‘కీర్తి తోరణము’ కావ్యంలో శాస్త్రిగారి పద్య రచనలో చిక్కదనం కనిపిస్తుంది. ఈ ముప్ఫైయేండ్ల మధ్య కాలంలో ఇంద్రగంటి సాహిత్య రచనా కృషి అమోఘం. చదువుకున్నది ఉభయ భాషా ప్రవీణ అయినప్పటికినీ సాహిత్య పరంగా ఎక్కడ కొత్త కనిపిస్తే- అక్కడికి దూకే స్వభావం గల శాస్త్రిగారు- ఆనాడు దేశంలో వీస్తున్న సాహిత్య పరమైన భావాభ్యుదయ కవితల ప్రభంజనాలకు గురి అయ్యారు. తత్ఫరంగా అనేక కవితా ఖండిక లను వెలయించారు. విమర్శ వ్యాసా లను వెలయించారు. ‘విజయదశమి’, ‘వివాహమంగళం’, ‘వెలుగు తిప్పితే వింత రంగులు’, ‘నిప్పు నుంచి నీరు’, ‘అందని ఆశలు’, ‘బస్సులో...’ ఇత్యాదిగా కథానికలను వెలయించారు. వీరి యీ రచనా ప్రక్రియలకన్నిటికీ ఆనాటి ‘ప్రతిభ’, ‘భారతి’, ‘ఆంధ్రజ్యోతి’ ఇత్యాది సాహిత్య పత్రికలు వేదికలయ్యాయి. 


ఇంకో విశేషం ఏమిటంటే- 1930 ఆ ప్రాంతాల్లో తెలుగులోని చిన్న కథకు ‘కథానకం’ అనే పేరుండేది. ఆ పేరు ‘భయానకం’లా ఉందని భావించి సంస్కృ తాంధ్ర సాహిత్యాలను విజయనగరం, కొవ్వూరు సంస్కృత కళాశాలల్లో గట్టిగా చదువు కున్న ఇంద్రగంటివారు- ‘కథానిక’ అన్న పేరు పెట్టుకుంటే బాగుంటుందని 1936 అక్టోబరు ‘యుగవాణి’ పత్రికలో వ్యాసం రాశారు. అగ్నిపురాణంలో గద్య కావ్య విభాగంలో కథానికా లక్షణాలు చెప్పబడ్డాయనీ, అవి నేటి చిన్న కథలకు సరిపోతాయనీ నిరూపణ చేశారు. అనేక సాహిత్య సభలలో ఉపన్యాసాలనిచ్చి ‘కథానిక’ అన్న పేరును బాగా వ్యాప్తి చేశారు. 


శ్రీ ఆచంట జానకిరామ్‌ గారి ప్రోత్సాహంతో రేడియోకి అనేక నాటికలను రాశారు. సంక్షిప్త సంభాషణలకు పెట్టింది పేరైన సంస్కృతంలోని భాస మహాకవి రూపకాలను రేడియో రూపకాలుగా మలిచారు. వాటిల్లో ‘వీణా వాసవ దత్తం’, ‘రాక్షస ప్రేమ’, ‘అయిదు రోజులు’ ఇత్యాదులు పేర్కొనదగినవి. రేడియో కోసమే కాక ‘కవి సన్మానం’, ‘రక్త నైవేద్యం’, ‘పిచ్చి గాయకుడు’, ‘శ్రీవేదమూర్తులు’- ఇత్యాదిగా అనేక సాంఘిక రూపకాలు రచించారు. పెళ్ళిళ్ళలో వైదిక కుటుంబాల్లో ఒకప్పుడు కనిపించే దురాచారాలనూ, చాదస్తాలనూ ఎండగడుతూ దక్షయజ్ఞ కథా స్ఫూర్తితో ‘శ్రీవేదమూర్తులు’ అన్న నాటికను అమోఘంగా రాశారు. 


ఇంద్రగంటివారు ‘ఆరు యుగాల ఆంధ్ర కవిత’ అన్న పేరుతో అపూర్వ బృహద్గ్రంథాన్ని రచించారు. మన ఆంధ్ర సాహిత్య చరిత్రను ఆరు ఋతువులుగా సందర్శించారు. నన్నయ యుగాన్ని ‘ఇతిహాస వాసంతి’, శివ కవి యుగాన్ని ‘శైవ గ్రీష్మం’, తిక్కన-ఎఱ్ఱనల యుగాన్ని ‘హరిహర వార్షుకం’, శ్రీనాథ పోతనల యుగాన్ని ‘కావ్యేంద్ర ధనువు’, రాయగ యుగాన్ని ‘ప్రబంధ శరత్తు’, రఘునాథనాయక రాజ యుగాన్ని ‘కవితా హేమంతం’, క్షీణయుగాన్ని ‘రచనా శైశిరం’గా సందర్శించారు. కవుల కాలనిర్ణయాలు, గ్రంథాల పౌర్వాపర్వాల జోలికి పోలేదు. ఆ కవుల వాణిని దర్శించి, తమకు కలిగిన కవితాత్మక విశేష స్పందనలను యువతరానికి అభిరుచి కలిగేలా కొన్ని ప్రసంగాలుగా రచన చేశారు. కథను కళాత్మకంగా, చదివించే ధోరణిలో రుచిమంతంగా చెప్పడమే జీవలక్షణంగా కలిగిన ఇంద్రగంటివారు తమ సాహిత్య జీవితాంతరంగ ఛాయాచిత్రమా అన్నట్లుగా ‘గౌతమి గాథలు’ అన్న గ్రంథాన్ని రచించారు. సర్వశ్రీ దేవులపల్లి, వేదల, మునిమాణిక్యం, అడివి బాపిరాజు, శ్రీపాద, జలసూత్రం- ఇత్యాది మిత్రులతో తామునూ పాల్గొన్న నాటి సాహిత్య సభా వేదికల పరిమళాలను ఈ గ్రంథంలో ఇంద్రగంటివారు వెదజల్లారు. 


సంస్కృతంలో కూడా లఘుస్తోత్రాలను రచించిన శాస్త్రిగారు భవభూతి ఉత్తర రామ చరిత్రంలోని ఉత్తమ దాంపత్య లక్షణాన్ని చాటిన ‘అద్వైతం సుఖదుఃఖయోరనుగతం’ అన్న శ్లోకాన్ని ఉత్తమ సాహిత్య లక్షణపరంగా విశిష్టంగా సమన్వయించారు. భాసుని ‘ప్రతిమ’ కేవలం రూపకం కాదనీ, అది భాసుని ప్రతిభ అనీ చెప్పారు. శ్రీనాథుని సీస పద్యాలు- ఆయన ఆజానుబాహు దర్పత్వాన్నీ, కవి సార్వభౌమత్వాన్ని చాటి చెబుతాయ న్నారు. కంకంటి పాపరాజును తెలుగువారి భవభూతిగా, గురజాడను వాల్మీకిగా, కృష్ణశాస్త్రిని మూడు తరాల మురళీమోహనునిగా సంభావించారు.  


ఆగస్టు 29, 1911న ఉత్తరాంధ్ర ప్రాంతంలో జన్మించి, తెలుగు అధ్యాపకునిగా గోదావరీ (రామచంద్రాపురం), కావలి ప్రాంతాలలో సంచరించి, నవంబరు 14, 1987న వరంగల్లులో కీర్తిశేషులైన ఇంద్రగంటివారి సాహిత్య జీవితం- నిజంగా ఇంద్రచాప వర్ణ శోభితమే!

రామడుగు వేంకటేశ్వరశర్మ

98669 44287

Updated Date - 2021-08-23T08:38:41+05:30 IST