జంట హత్యల కేసులో భారతీయ టీనేజర్‌ను దోషిగా తేల్చిన ఇంగ్లండ్ న్యాయస్థానం

ABN , First Publish Date - 2022-07-24T02:56:20+05:30 IST

ఇంగ్లండ్‌కు చెందిన భారత సంతతి టీనేజర్ హత్యానేరం కేసులో దోషిగా తేలాడు. అమిత్ ఝాగ్రా అనే యువకుడే ఈ హత్యలు చేసినట్టు షెఫ్పీల్డ్ కౌంటీ న్యాయస్థానం జ్యూరీ గురువారం తీర్పు వెలువరించింది.

జంట హత్యల కేసులో భారతీయ టీనేజర్‌ను దోషిగా తేల్చిన ఇంగ్లండ్ న్యాయస్థానం

ఎన్నారై డెస్క్: ఇంగ్లండ్‌లో జరిగిన జంట హత్యల కేసులో ఓ భారత సంతతి టీనేజర్‌ దోషిగా తేలాడు. అమిత్ ఝాగ్రా(19).. ఈ హత్యలు చేసినట్టు షెఫ్పీల్డ్ కౌంటీ న్యాయస్థానం జ్యూరీ గురువారం తీర్పు వెలువరించింది. వచ్చే నెలలో అతడికి యావజ్జీవకారాగార శిక్ష(Life sentence) విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనవరిలో దక్షిణ యార్క్‌షైర్ ప్రాంతంలోని ఓ బార్ వద్ద జరిగిన గొడవలో జానిస్, రయాన్ మరణించారు. అమిత్ ఝాగ్రా వారిని కత్తితోపొడవడంతోనే మృతి చెందినట్టు పోలీసులు అభియోగాలు దాఖలు చేశారు. అయితే.. తనని తాను రక్షించుకునే క్రమంలోనే కత్తితో వారిపై దాడి చేసినట్టు అమిత్ వాదించారు. అంతకుమునుపే.. అమిత్ కత్తితో బార్ వద్దకు వచ్చాడని పోలీసులు ఆరోపించారు. ‘‘విచారణ మొదలైననాటి నుంచీ తాను నిర్దోషినని అమిత్ వాదిస్తూ వస్తున్నాడు. ఆ సాయంత్రం అమిత్ కత్తి వెంట తీసుకుని బయటకు వచ్చాడు. దానితో ఓ ఇద్దరిని పొడిచాడు. కత్తులు వెంట తీసుకెళ్లడం వల్ల వచ్చే విపరిణామాలను ఈ కేసు మన కళ్లముందుంచింది. ఝాగ్రా అబద్ధాల మాటున్న దాగున్న వాస్తవాన్ని గ్రహించినందుకు జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు’’  సౌత్ యార్క్ షౌర్ పోలీసు శాఖ డిటెక్టివ్ చీఫ్ ఇన్స్‌పెక్టర్ లీ టౌన్లీ వ్యాఖ్యానించారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జానిస్, రయాలు ఆ రోజున బార్ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత.. వారికి, అమిత్ స్నేహితుడికి మధ్య గొడవ మొదలైంది. ఇంతలో అక్కడికి వచ్చిన అమిత్ కూడా వారితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో రయాన్‌ను అమిత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడి నుంచి పారిపోతున్న జానిస్‌ను కూడా అమిత్ వెంబడించి నేలపై పడదోశాడు. ఆ తరువాత పలుమార్లు అతడిని కత్తితో పోడిచి పారిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పారామెడికల్ సిబ్బంది బాధితులిద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. రయాన్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తేల్చారు. జానిస్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది రోజుల తరువాత మరణించాడు. కత్తి పోట్ల కారణంగానే వారు మరణించినట్టు పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. 

Updated Date - 2022-07-24T02:56:20+05:30 IST