Scotland లో భారత సంతతి డాక్టర్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష.. 35 ఏళ్లుగా అతడు చేస్తున్న నీచాలేంటో బయటపడటంతో..

ABN , First Publish Date - 2022-05-27T02:46:36+05:30 IST

మహిళా పేషెంట్లను లైంగికంగా వేధించిన భారత సంతతి వైద్యుడు కృష్ణ సింగ్‌కు స్కాట్‌ల్యాండ్ న్యాయస్థానం 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Scotland లో భారత సంతతి డాక్టర్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష.. 35 ఏళ్లుగా అతడు చేస్తున్న నీచాలేంటో బయటపడటంతో..

ఎన్నారై డెస్క్: మహిళా పేషెంట్లను లైంగికంగా వేధించిన భారత సంతతి వైద్యుడు కృష్ణ సింగ్‌కు స్కాట్‌ల్యాండ్ న్యాయస్థానం 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 35 ఏళ్లల్లో అతడు ఏకంగా 47 మహిళా పేషెంట్లను  లైంగికంగా వేధించాడన్న ఆరోపణలను రుజువవడంతో కోర్టు ఈ శిక్ష  వేశారు. కృష్ణ సింగ్ నార్త్ లానార్క్‌షైర్‌లో జనరల్ ప్రాక్టీషనర్‌గా సేవలందించారు. ఈ క్రమంలో అతడు తన వద్దకు వచ్చిన మహిళా పేషెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తమను ముద్దాడాడని, అసభ్యకర రీతిలో తాకాడని, శృంగార పూరిత వ్యాఖ్యలు చేశాడని పలువురు బాధితులు ఆరోపించారు. ఈ కేసులో న్యాయస్థానం గతనెలలోనే కృష్ణ సింగ్‌ను దోషిగా తేల్చింది. తాజాగా ఆయనకు విధించాల్సిన శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.  


‘‘నువ్వు.. వైద్య వృత్తి పవిత్రతను దిగజార్చేలా ప్రవర్తించావు. పేషెంట్ల నమ్మకాన్ని వమ్ము చేశావు’’ అంటూ న్యాయమూర్తి ఈ సంద్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తప్పేమీ లేదన్న అతడి వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘‘కృష్ణ సింగ్ తాను చేసిన నేరాలకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు’’ డిటెక్టివ్ స్టీఫెన్ మారిస్ వ్యాఖ్యానించారు.  బాధితుల జీవితాల్లో ఓ చీకటి అధ్యాయానికి ఈ తీర్పు  ముగింపు పలికిందని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణ సింగ్‌పై 2018లో తొలిసారిగా ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. 1983 నుంచి 2018 మధ్య అనేక మందిని ఆయన వేధించినట్టు స్కాట్ వెల్లడించారు. మొత్తం 54 కేసులు  సింగ్‌పై దాఖలవగా.. తొమ్మిది కేసుల్లో పోలీసులకు ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లభించలేదు. రెండు కేసుల్లో మాత్రం ఆయన నిర్దోషిగా తీర్పు వచ్చింది. మిగిలిన కేసుల్లో దోషిగా తేలడంతో 12 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. ఒకప్పుడు సింగ్‌కు స్థానికంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండేవి. వైద్య రంగంలో ఆయన చేసిన కృషికి గాను రాయల్ ఎమ్‌బీఈ సత్కారం కూడా లభించింది. 

Updated Date - 2022-05-27T02:46:36+05:30 IST