ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తల ఎఫెక్ట్.. ఆందోళన వ్యక్తం చేస్తున్న భారతీయ విద్యార్థులు

ABN , First Publish Date - 2022-02-16T21:20:38+05:30 IST

ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇండియాకు తిరిగొచ్చేందుకు సరిపడ డబ్బులు, విమాన సర్వీ

ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తల ఎఫెక్ట్.. ఆందోళన వ్యక్తం చేస్తున్న భారతీయ విద్యార్థులు

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇండియాకు తిరిగొచ్చేందుకు సరిపడ డబ్బులు, విమాన సర్వీసులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉక్రెయిన్-రష్యా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ వీలైనంత త్వరగా వీడాలని చాలా దేశాలు తమ పౌరులకు సూచించాయి. ఈ జాబితాలో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ, సౌదీ, జపాన్ తదితర దేశాలు ఉన్నాయి. తాజాగా భారత్ కూడా కీలక ప్రకటన చేసింది. ‘అత్యవసరం అయితేనే భారతీయులు ఉక్రెయిన్‌లో ఉండండి. లేదంటే ఈ దేశాన్ని తాత్కాలికంగా వీడండి’ అని ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా.. ఉక్రాయిన్‌లో ఉండాలని నిర్ణయించుకున్న ప్రజలు ఎంబసీతో టచ్‌లో ఉండాలని పేర్కొంది. ఎంబసీ ప్రకటన విడుదల చేసిన వెంటనే చాలా మంది భారత పౌరులు, విద్యార్థులు ఉక్రెయిన్‌ను వీడేందుకు రెడీ అయ్యారు. కానీ తగినన్ని విమాన సర్వీసులు లేకపోవడంతో తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఉక్రెయిన్- రష్యాకు సంబంధించిన వార్తులు చూసి నా తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వెంటనే ఇంటికి వచ్చేయాలని అంటున్నారు. కానీ ఫిబ్రవరి 20 వరకు ఫ్లైట్ టికెట్లు అందుబాటులో లేవు. చాలా వరకు టికెట్లు అన్ని ఇప్పటికే బుక్ అయిపోయాయి. కొన్ని టికెట్లు అందుబాటులో ఉన్నా.. వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంది. ఆ టికెట్లను కొనగలిగే పరిస్థితి లేదు’ అని ఆశిష్ గిరి అనే విద్యార్థి తన బాధను వ్యక్తపర్చాడు. 



విమాన టికెట్ల ధరలు పెరిగిన విషయాన్ని ట్రావెల్ ఏజెట్లు కూడా ధ్రువీకరిస్తున్నారు. ‘ఉక్రెయిన్-ఇండియా మధ్య డైరెక్ట్ ఫ్లైట్ వారానికి ఒకటి మాత్రమే ఉంది. వన్ స్టాప్ ఫ్లైట్‌లకు రద్దీ పెరిగింది. సాధారణంగా ఫ్లైట్ టికెట్ ధర రూ.26వేలు ఉండేది. ఇపుడు ఇది రూ.60వేలకు చేరింది’ అని ఢిల్లీకి చెందిన ట్రావెల్ ఏజెంట్ చెప్పారు. ఇదిలా ఉంటే.. మరికొందరు భారత పౌరులు మాత్రం పరిస్థితి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉంటూ ఉక్రెయిన్‌లోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎంబసీ తమకు సాయం అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విదేశాంగశాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ స్పందించారు. ఉక్రెయిన్‌లోని భారత పౌరులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య పరిస్థితులు చేయి దాటిపోయినట్టు ఉంటే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసైనా భారత పౌరులను స్వదేశానికి తీసుకొస్తామన్నారు. కాగా.. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఉక్రెయిన్ దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. 




Updated Date - 2022-02-16T21:20:38+05:30 IST