లాభాల స్వీకరణే..!

ABN , First Publish Date - 2021-01-25T07:55:59+05:30 IST

ఈ ఏడాది జనవరి 21 భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో చిరస్థాయిలో నిలిచి పోయే రోజు. ఆ రోజున సెన్సెక్స్‌ 50,184.01 స్థాయికి చేరి కొత్త రికార్డు నమోదు చేసింది.

లాభాల స్వీకరణే..!

బడ్జెట్‌ తర్వాతే మార్కెట్లలో స్పష్టత

జూలై నుంచి మళ్లీ ర్యాలీ ?


న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 21 భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో చిరస్థాయిలో నిలిచి పోయే రోజు. ఆ రోజున సెన్సెక్స్‌ 50,184.01 స్థాయికి చేరి కొత్త రికార్డు నమోదు చేసింది. అయితే ఆ ఆనందం కొద్దిసేపు మాత్రమే ఉంది.  మార్కెట్‌ రికార్డు స్థాయిని తాకిన కొద్దిసేపటి నుంచి లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ తర్వాతే మార్కెట్లో కొంత స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  కాగా బడ్జెట్‌ తర్వాత మార్కెట్లు ఆటుపోట్లలో సాగినప్పటికీ జూలై తర్వాత మళ్లీ ర్యాలీని కనబరచవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ఆటుపోట్లు: గత ఏడాది  (2020) దేశీయ స్టాక్‌ మార్కెట్‌ అనేక ఆటుపోట్లు చవిచూసింది. కరోనా దెబ్బతో మార్చి 23న ఒక్క రోజే సెన్సెక్స్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా 3,934 పాయింట్లు నష్టపోయింది. దీంతో రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరై పోయింది. గత ఏడాది మార్చి మొత్తానికి చూసినా సెన్సెక్స్‌ 23 శాతం (8,828.8 పాయింట్లు) నష్టపోయింది. అదే సెన్సెక్‌ జూన్‌ నుంచి మళ్లీ ర్యాలీ బాట పట్టింది. దీంతో ఏడాది తిరిగే సరికల్లా బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.32.49 లక్షల కోట్లు పెరిగింది.

 

ర్యాలీకి దోహదం చేసిన అంశాలు: ఎఫ్‌పీఐలతో పాటు రిటైల్‌ ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లు పొలోమంటూ పెట్టుబడులకు దిగారు. ప్రభుత్వ చర్యలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇందుకు దోహదం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అనుసరించిన ఈజీ మనీ విధానాలు, కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావటం కూడా ఇందుకు దోహదపడ్డాయి. 


ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మార్కెట్‌ మరింత బలోపేతం అవుతుంది. అక్కడి మరింత ముందుకెళుతుందని భావిస్తున్నాం.

 రస్మిక్‌ ఓజా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌


మార్కెట్‌ మరింత ముందుకే వెళుతుందని మా అంచనా. కంపెనీల ఆర్థిక ఫలితాలు, పుష్కలంగా నిధుల అందుబాటు, తక్కువ స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు, ఆర్థిక రికవరీ, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ఇందుకు దోహదం చేయనున్నాయి. 

 హేమాంగ్‌ జానీ, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌

Updated Date - 2021-01-25T07:55:59+05:30 IST