వ్యాక్సిన్ తయారీ ప్రాజెక్ట్‌లో భాగమవడం గౌరవంగా భావిస్తున్నా: భారతీయ యువతి

ABN , First Publish Date - 2020-06-01T04:35:15+05:30 IST

కొవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధనలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి ముందు వరుసలో ఉన్న

వ్యాక్సిన్ తయారీ ప్రాజెక్ట్‌లో భాగమవడం గౌరవంగా భావిస్తున్నా: భారతీయ యువతి

లండన్: కొవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధనలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్‌లో భారత సంతతికి చెందిన చంద్రబాలి దత్త(34) కూడా ఉన్నారు. కలకత్తాకు చెందిన చంద్రబాలి.. యూనివర్శిటీకి చెందిన జెన్నర్ ఇన్‌స్టిట్యూట్‌‌లోని క్లినికల్ బయోమ్యాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేస్-2, ఫేస్-3 ట్రయిల్స్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాలి క్వాలిటి అషురెన్స్ మేనేజర్‌గా సేవలందిస్తున్నారు. ప్రపంచం మొత్తం తాము తయారుచేసే వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోందని చంద్రబాలి చెప్పారు. వ్యాక్సిన్ విజయవంతం అయ్యేందుకు నిత్యం తమ బృందం అదనపు సమయం పనిచేస్తోందని.. అప్పుడే మనుషుల ప్రాణాలను కాపాడగలమని అన్నారు. ఒక భారీ బృందం ఈ వ్యాక్సిన్ తయారీలో పాలుపంచుకుంటున్నారని.. అహర్నిశలు వ్యాక్సిన్‌ను విజయవంతం చేసేందుకు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 


ఇలాంటి ప్రాజెక్టులో తాను భాగమవడం గౌరవంగా భావిస్తున్నానని చంద్రబాలి అన్నారు. గతంలో బయోటెక్, ఫార్మా రంగాల్లో అత్యధికంగా మగవారే ఉండేవారని.. కాని ఇప్పుడు మగవారితో సమానంగా ఆడవారు కూడా ఈ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఈ రంగంలో భారీ జీతాలు ఉండవని.. ఈ రంగంలో రాణించాలంటే భౌతిక కోరికలను వదులుకోవాల్సి ఉంటుందన్నారు. తన తల్లిదండ్రులకు తాను ఒక్కతే కూతురిని అని.. తాను భారత్‌ను వదిలి యూకే రావడం తల్లికి ఇష్టం లేదని తెలిపారు. తన తండ్రి మాత్రం లక్ష్యాన్ని సాధించాలంటూ తనను యూకేకు పంపారన్నారు. తన లక్ష్యాలను సాధించే వరకు తాను పోరాడుతూనే ఉంటానని ఈ సందర్భంగా చంద్రబాలి చెప్పారు.

Updated Date - 2020-06-01T04:35:15+05:30 IST