కోట్లు పలికే ధీరులెవరో?

ABN , First Publish Date - 2022-02-12T09:45:32+05:30 IST

మరికొద్ది గంటల్లో ఐపీఎల్‌ మెగా వేలానికి తెరలేవనుంది. ఫ్రాంచైజీలన్నీ తమ ప్రణాళికలతో సిద్ధమయ్యాయి.

కోట్లు పలికే ధీరులెవరో?

పాత జట్టుతోనే ఉన్న ఆటగాళ్లు 

చెన్నైజడేజా, ధోనీ, మొయిన్‌ అలీ, రుతురాజ్‌.

ఢిల్లీ రిషభ్‌ పంత్‌, అక్షర్‌, పృథ్వీ షా, నోకియా.

కోల్‌కతా రస్సెల్‌, వరుణ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, నరైన్‌

ముంబై రోహిత్‌, బుమ్రా, సూర్యకుమార్‌, పొలార్డ్‌.

రాజస్థాన్‌ సంజూ శాంసన్‌, బట్లర్‌, యశస్వి జైశ్వాల్‌

బెంగళూరు విరాట్‌ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌, మహ్మద్‌ సిరాజ్‌

హైదరాబాద్‌ కేన్‌ విలియమ్సన్‌, సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

పంజాబ్‌ మయాంక్‌ అగర్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

అహ్మదాబాద్‌ హార్దిక్‌ పాండ్యా, రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌

లఖ్‌నవూ కేఎల్‌ రాహుల్‌, స్టొయినిస్‌, రవి బిష్ణోయ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఎంత మజా పంచుతుందో.. ఆ మెగా టోర్నీకి ముందు జరిగే వేలం కూడా అంతకుమించి ఉత్కంఠ రేపుతుంది. అందునా ఈసారి జరుగుతున్నది మెగా వేలం కావడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తి మరింత పెరిగింది. మరింకేం.. శని, ఆదివారాల్లో  జరిగే ఈ వేలంలో ఏ ఆటగాడు ఎంత ఎక్కువ ధర పలుకుతాడన్నదానిపై మీరూ ఓ కన్నేయండి.

శ్రేయాస్‌, శార్దూల్‌, ఇషాన్‌పై ఫ్రాంచైజీల కన్ను

డికాక్‌, హోల్డర్‌, వార్నర్‌, కమిన్స్‌కూ డిమాండ్‌

నేడు, రేపు ఐపీఎల్‌ మెగా వేలం

బెంగళూరు: మరికొద్ది గంటల్లో ఐపీఎల్‌ మెగా వేలానికి తెరలేవనుంది. ఫ్రాంచైజీలన్నీ తమ ప్రణాళికలతో సిద్ధమయ్యాయి. ఈసారి కొత్తగా గుజరాత్‌ టైటాన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ చేరడంతో జట్ల సంఖ్య పది అయింది. మొత్తం 590 మంది క్రికెటర్లు వేలం బరిలో నిలవగా.. ఇందులో 227 మంది విదేశీ ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. డ్యాషింగ్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌, ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాగూర్‌ వేలంలో అంచనాలను మించి ధర పలికే అవకాశాలున్నాయి. 10మందికిపైగా క్రికెటర్లు రూ. 10 కోట్లకుపైగా, మరికొందరు రూ. 20 కోట్లు పలికే అవకాశాలూ లేకపోలేదు. రూ. 20 కోట్ల రేంజ్‌లో శ్రేయాస్‌ పేరు వినిపిస్తోంది. శార్దూల్‌, ఇషాన్‌ చెరో రూ. 12 నుంచి 15 కోట్లు పలుకుతారని అంచనా. ఇటీవల బ్యాటింగ్‌లోనూ మెరుస్తున్న పేసర్‌ దీపక్‌ చాహర్‌, వెస్టిండీ్‌సతో తొలి వన్డేలో 4 వికెట్లు తీసి మళ్లీ సత్తా చాటిన స్పిన్నర్‌ చాహల్‌ రూ. 15 కోట్ల స్థాయికి చేరొచ్చు. 


సీఎస్‌ కే అదే తీరా?:

ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎప్పటిలానే మ్యాచ్‌ గెలిపించే, చాంపియన్‌షి్‌పలు అందించే నమ్మకస్తులైన క్రికెటర్లపట్లే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అసాధారణమైన ఆటగాళ్లకోసం ఎంత మొత్తమైనా వెచ్చించే అలవాటున్న పంజాబ్‌, రాజస్థాన్‌ జట్లు కూడా అదే పంథా అనుసరించొచ్చు. సమర్థుడైన కెప్టెన్‌ కోసం ఎదురు చూస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ శ్రేయా్‌సపై కన్నేసింది. భారత్‌కు చెందిన క్యాప్డ్‌, అన్‌క్యా్‌ప్డ ఆటగాళ్లకు డిమాండ్‌ ఏర్పడనుంది. అందువల్లే గత ఐపీఎల్‌ పర్పుల్‌ క్యాప్‌ విజేత హర్షల్‌ పటేల్‌ రూ. 2 కోట్ల బేస్‌ ధరతో వేలంలో నిలువగలిగాడు. ఈ మొత్తానికి ఐదు రెట్లు అధిక మొత్తం అతడికి దక్కే చాన్సులేకపోలేదు. గత సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన అవేశ్‌ఖాన్‌ బేస్‌ ధర (రూ. 20 లక్షలు) కంటే 50 రెట్లు ఎక్కువ (రూ. 10 కోట్లు) స్థాయికి చేరొచ్చన్న అంచనాలున్నాయి. అశ్విన్‌ (రూ. 2 కోట్లు), రహానె (రూ. కోటి) కూడా బేస్‌ ధరకంటే ఎక్కువ మొత్తం దక్కించుకోవచ్చు. దీపక్‌ హుడాకు క్యాప్డ్‌ ప్లేయర్‌గా పెద్ద మొత్తమే రావొచ్చు. 


వార్నర్‌, డికాక్‌, హోల్డర్‌ ప్రధాన ఆకర్షణ:

విదేశీ క్రికెటర్లలో రూ. 10 నుంచి 15 కోట్ల ఽధర పలికే చాన్సున్న డేవిడ్‌ వార్నర్‌ కోసం లఖ్‌నవూ ఫ్రాంచైజీ, భారీ సిక్సర్లు బాదే విండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌కు భారీ మొత్తం వెచ్చించేందుకు ఆర్‌సీబీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. డ్వేన్‌ బ్రావో, యువ బౌలర్లు ఓడియన్‌ స్మిత్‌, రొమారియో షెఫర్డ్‌లకూ పెద్ద మొత్తం దక్కే చాన్సుంది. సౌతాఫ్రికా కీపర్‌, బ్యాటర్‌ డికాక్‌తో పాటు రబాడపై ఢిల్లీ క్యాపిటల్స్‌ కన్నేసింది. యువ ఆటగాడు షారుక్‌ ఖాన్‌ రూ. 5 నుంచి 8 కోట్ల మధ్యలో అమ్ముడుపోయే అవకాశముంది. నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి.. అంతర్జాతీయ స్టార్లు స్టీవెన్‌ స్మిత్‌, బెయిర్‌ స్టో, మోర్గాన్‌ను మించిన ధర పలికినా ఆశ్చర్యంలేదు.  


యువ చాంపియన్లలో అదృష్టం ఎవరికో..?

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత యువ జట్టులో ఆల్‌రౌండర్‌ రాజ్‌ బవా, కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ వేలంలో స్టార్‌ అట్రాక్షన్‌ కానున్నారు. అయితే గత అండర్‌-19 జట్టు స్టార్లు కమలేష్‌ నాగర్‌ కోటి, మనోజ్‌ కర్లా, శివం మావి అనుభవాల దృష్ట్యా ఈసారి యువ జట్టు ఆటగాళ్లలో యశ్‌ ధుల్‌ ఒక్కడికే మంచి ధర లభించే చాన్సుంది. 


ఈ వేలంలో కనిపించని స్టార్‌ ఆటగాళ్లు..

వివిధ కారణాలరీత్యా ఈసారి వేలానికి క్రిస్‌ గేల్‌, స్టోక్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, జేమిసన్‌, సామ్‌ కర్రాన్‌, డాన్‌ క్రిస్టియన్‌, జో రూట్‌, బాన్‌టన్‌, మ్యాట్‌ హెన్రీ, క్రిస్‌ వోక్స్‌ తదితర స్టార్‌ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు.


ఏ జట్టు 

దగ్గర ఎన్ని కోట్లు ?

పంజాబ్‌ 72

హైదరాబాద్‌ 68

రాజస్థాన్‌ 62

లఖ్‌నవూ 58

బెంగళూరు 57

అహ్మదాబాద్‌ 52

చెన్నై 48

కోల్‌కతా 48

ముంబై 48

ఢిల్లీ 47.5

Updated Date - 2022-02-12T09:45:32+05:30 IST