చావు ఖాయమనుకున్నా.. బ్రిటన్‌లో కరోనాపై గెలిచిన భారతీయ మహిళ ఏం చెప్తోందంటే..

ABN , First Publish Date - 2020-04-10T00:50:36+05:30 IST

యూకేలో కరోనా బారిన పడి చావు అంచుల వరకు వెళ్లొచ్చిన భారత సంతతి మహిళ తన అనుభవాలను చెప్పుకొచ్చింది. చావు ఖాయమనుకున్న

చావు ఖాయమనుకున్నా.. బ్రిటన్‌లో కరోనాపై గెలిచిన భారతీయ మహిళ ఏం చెప్తోందంటే..

లండన్: యూకేలో కరోనా బారిన పడి చావు అంచుల వరకు వెళ్లొచ్చిన భారత సంతతి మహిళ తన అనుభవాలను చెప్పుకొచ్చింది. చావు ఖాయమనుకున్న తాను అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డానని భారత మహిళ చెబుతోంది. కాగా.. మహిళ లండన్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఆమె ఏడేళ్ల క్రితం యాకలేషియా అనే జబ్బు బారిన పడింది. ఈ జబ్బు కారణంగా ఆమె శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ వచ్చింది. దీంతో శ్వాస సమస్యకు సంబంధించి ఆసుపత్రికి వెళ్తూనే ఉంది. ఇటీవల సహజంగానే శ్వాస సమస్యతో మహిళ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అయితే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించారు. ఫలితాల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు.


కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెకు చికిత్స చేసిన గదినే వైద్యులు ఐసోలేషన్ వార్డుగా మార్చేశారు. వైద్యం అందిస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆమెను కొవిడ్-19 ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించారు. అక్కడ కూడా ఆమె శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతూనే వచ్చింది. పర్వతం ఎక్కడానికి ఎంత కష్టపడాలో తాను ఊపిరి తీసుకోడానికి అంత కష్టపడాల్సి వచ్చిందని ఆమె ఆవేదనను వెల్లగక్కింది. తాను ఇంక బతికే చాన్స్ లేదనే నిర్ణయానికి వచ్చేశానని, కుటుంబసభ్యులకు కూడా ఆ విధమైన సందేశాలే పంపించేదాన్ని అంటూ వివరించింది. వైద్యుల కారణంగానే తాను బతికానని, వారందరూ నిజంగా హీరోలని కొనియాడింది. శ్వాస తీసుకోవడం చాలా సహజమని, కానీ తాను శ్వాస తీసుకోవడం, వదలడం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఇప్పటికీ తన ఊపిరితిత్తుల్లో ఏదో ఒక చప్పుడు అవుతున్నట్టు అనిపిస్తుందని ఆమె తెలిపింది.

Updated Date - 2020-04-10T00:50:36+05:30 IST