Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Space X Crew 3 mission: తెలుగోడి అరుదైన ఘనత.. 48 ఏళ్లలో ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి!

twitter-iconwatsapp-iconfb-icon
Space X Crew 3 mission: తెలుగోడి అరుదైన ఘనత.. 48 ఏళ్లలో ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి!

మహబూబ్‌నగర్‌ మూలాలున్న రాజాచారి నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం ఐఎస్‌ఎస్‌కు!

రోదసిలోకి వెళ్లిన తొలిసారే కమాండర్‌ ఘనత

కేప్‌కెనవరాల్‌, నవంబరు 11: అది.. అంతరిక్షంలో పరిశోధనల కోసం ఎప్పుడో 1998లో ఆకాశంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. అక్కడ పరిశోధనల కోసం తరచుగా వ్యోమగాములు భూమి నుంచి వెళ్తుంటారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం కూడా అలాంటి ఒక బృందం ఈలన్‌మ్‌స్కకు చెందిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌లో ఐఎస్‌ఎస్‌కు పయనమైంది. గడిచిన 60 ఏళ్లలో అంతరిక్షానికి వెళ్లినవారి సంఖ్య ఈ నలుగురితో కలిపి 600 దాటింది. 1961లో యూరీగగారిన్‌ రోదసిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ ఈ 60 ఏళ్లలో సగటున 10 మంది రోదసిలోకి వెళ్లినట్టు.


కాగా, ప్రస్తుతం ఐఎ్‌సఎ్‌స వెళ్తున్న బృందానికి నేతృత్వం వహిస్తున్నది.. మహబూబ్‌నగర్‌ మూలాలున్న రాజాచారి (44) అనే తెలుగు వ్యక్తి. ‘‘ఈ ప్రయాణం మేం ఊహించిన దానికన్నా చాలా గొప్పగా ఉంది’’ అని కక్ష్యలోకి ప్రవేశించాక రాజాచారి వ్యాఖ్యానించారు. ఈ నలుగురూ ఆరు నెలలపాటు ఐఎ్‌సఎ్‌సలోనే గడపనున్నారు.  అమెరికా వాయుసేనలో కల్నల్‌గా వ్యవహరించిన రాజాచారికి గతంలో రోదసిలోకి వెళ్లిన అనుభవమే లేదు. గడచిన 48 ఏళ్లలో ఇలా ఒక అనుభవం లేని వ్యక్తి నాసా మిషన్‌కు నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి. రాజాచారికి ఫైటర్‌ జెట్‌ విమానాలను నడపడంలో 2500 గంటల అనుభవం ఉంది. రాజాచారి బృందంలోని మిగతా ముగ్గురిలో జర్మనీకి చెందిన మథియాస్‌ మారర్‌ (51).. రోదసిలోకి వెళ్లిన 600వ వ్యక్తిగా గుర్తింపు పొందారు.  డాక్టర్‌ థామస్‌ మార్ష్‌బర్న్‌ (61) ఈ ట్రిప్‌లో స్పేస్‌వాక్‌ చేయనున్నారు. ఫ్లైట్‌ సర్జన్‌ అయిన మార్ష్‌బర్న్‌.. అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఇది మూడోసారి. ఇక, నాలుగో వ్యక్తి కేలా బారన్‌ (35) నేవీ లెఫ్టినెంట్‌ కమాండర్‌. 


ఇదీ నేపథ్యం..

రాజాచారి తాతముత్తాతలు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారు. ఆయన తాతగారి హయాంలో వారి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో రాజాచారి తాత గణిత ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాసాచారి ఓయూ నుంచి ఇంజనీరింగ్‌ చదివి 1970ల్లో.. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. తనకు పరిచయమైన పెగ్గీ ఎగ్బర్ట్‌ను పెళ్లి చేసుకున్నారు. 1977 జూన్‌ 25న రాజాచారి వారికి జన్మించాడు. రాజాచారి సెడర్‌ ఫాల్స్‌లో పెరిగారు. 1995లో పట్టభద్రుడైన రాజాచారి.. కొఒలరాడోలోని ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ’లో ‘బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఆస్ట్రొనాటికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌’, కేంబ్రిడ్జిలోని ప్రతిష్ఠాత్మక మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 2001లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఒక్లహోమాలో అండర్‌గ్రాడ్యుయేట్‌ పైలట్‌ ట్రైనింగ్‌ పూర్తి చేశారు. పలు సంస్థల్లో శిక్షణ పొంది.. అమెరికా వాయుసేనలో చేరారు. అనంతరకాలంలో రోదసియానంపై ఆసక్తి పెంచుకున్న రాజాచారి 2017లో ‘నాసా ఆస్ట్రొనాట్‌ గ్రూప్‌ 22’ మిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

Space X Crew 3 mission: తెలుగోడి అరుదైన ఘనత.. 48 ఏళ్లలో ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి!

దానికి మొత్తం 18,300 దరఖాస్తులు రాగా కేవలం 12 మందిని నాసా ఎంపిక చేసింది. వారిలో రాజాచారి ఒకరు. 2017 ఆగస్టు నుంచి నాసా ఆ పన్నెండు మందికీ రోదసియానంలో రెండేళ్లపాటు శిక్షణనిచ్చింది. శిక్షణ ముగిశాక ఆయన ‘నాసా కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌’లో జాయింట్‌ టెస్ట్‌ టీమ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. తర్వాత.. ఐఎ్‌సఎ్‌సకు వెళ్లే ‘నాసా స్పేస్‌ ఎక్స్‌ క్రూ3 మిషన్‌’ కమాండర్‌గా ఎంపికయ్యారు. కాగా.. గత ఏడాది డిసెంబరులోనాసా రాజాచారిని ‘ఆర్టెమిస్‌’ బృందంలోకి ఎంపిక చేసింది. ఎప్పుడో అపోలోతో ఆపేసిన చంద్రయానాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు చేపట్టిన మిషనే ఈ ఆర్టెమిస్‌. బృందంలోని 18 మందిలో ఇద్దరు 2024లో చంద్రుడిపై అడుగుపెట్టనున్నారు. ఆర్టెమిస్‌ టీమ్‌లోని ఒకరికి కుజుడిపైకీ వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ మిషన్లలో రాజాచారి దేనికి ఎంపికైనా అది చరిత్రే. తెలుగువారికి గర్వకారణమే.


భారత్‌కు రావడమంటే తీర్థయాత్రే!

అమెరికాలో పుట్టిపెరిగిన రాజాచారి భారత్‌కు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. 2005లో.. బెంగళూరులో జరిగిన ఒక ఎయిర్‌షోలో పాల్గొనేందుకు అమెరికా నుంచి వాయుసేన పైలట్‌గా వచ్చారాయన. ఆ సమయంలో తనకు నాయనమ్మ వరుసయ్యే అంబుజాదేవిని కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చారాయన. మరికొన్నిసార్లు  హైదరాబాద్‌కు వచ్చానని.. అలా రావడం తనకొక తీర్థయాత్రలాగా ఉండేదని అమెరికన్‌ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాజాచారి పేర్కొన్నారు. రాజాచారి భార్య హాలీషాఫ్టర్‌ అమెరికావాసే. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. అమెరికా వాయుసేనలో సేవలందించినప్పుడు రాజాచారి పలు పురస్కారాలు అందుకున్నారు.


సంగీతం.. సైన్స్‌

రాజాచారికి సైన్స్‌, ఇంజనీరింగ్‌తోపాటు సంగీతమన్నా ఇష్టం. చిన్నప్పుడే ఆయన వయొలిన్‌, పియానో, ఫ్రెంచ్‌హార్న్‌ నేర్చుకున్నారు. హైస్కూల్‌లో చదువుకునేటప్పుడే.. ఆల్‌స్టేట్‌ ఆర్కెస్ట్రాలో ఫ్రెంచ్‌ హార్న్‌ వాయించారు. సైన్సా, సంగీతమా అని తేల్చుకునే దశ వచ్చినప్పుడు.. సైన్స్‌వైపునకే మొగ్గు చూపారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.