Abn logo
May 9 2021 @ 15:42PM

భారతీయుడిపై నెట్టింట ప్రశంసల జల్లు.. హీరో అంటూ..!

సింగపూర్ సిటీ: సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను వీక్షించిన నెటిజన్లు.. ఆయన్ని హీరోగా అభివర్ణిస్తున్నారు. కొడుకుపై ప్రశంసల వర్షం కురుస్తుండటంపట్ల అతని తల్లి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..


తమిళనాడులోని శివగంగా ప్రాంతానికి చెందిన గుణశేఖరన్ మణికందన్ (26).. ల్యాండ్ సర్వే అసిస్టెంట్‌గా సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్ 18న కంటి చూపులేని ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడటాన్ని గుణశేఖరన్ గుర్తించాడు. ఈ క్రమంలో గుణశేఖరన్ సదరు దివ్యాంగుడికి ఆసన్న హస్తం అందించాడు. చేయి పట్టుకుని రోడ్డు దాటించాడు. ఈ దృశ్యాలన్నీ కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు గుణశేఖర్‌ను హీరోగా అభివర్ణిస్తూ సెల్యూట్ చేస్తున్నారు. కాగా.. గుణశేఖర్‌కు సంబంధించిన వీడియోపట్ల సింగపూర్ ప్రభుత్వం కూడా స్పందించి అభినందించింది. తాజాగా తమిళనాడులో నివసిస్తున్న గుణశేఖర్ తల్లి కూడా తాజాగా ఆ వీడియోను చూశారు. తన కొడుకు చేసిన పనికి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 


ఇదిలా ఉంటే.. దీనిపై గుణశేఖర్ స్పందించారు. తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందన్న విషయం స్నేహితుల ద్వారా తెలిసిందన్నారు. ‘అతనికి సహాయపడ్డందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసి చాలా ఆశ్చర్యపోయాను. భారతదేశంలో ఉంటున్న నా తల్లి కూడా ఆ వీడియోను చూశారు. ఆమె చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనికి నేను గర్వపడుతున్నాను’ అని పేర్కొన్నారు.