పడిలేచిన కెరటం

ABN , First Publish Date - 2021-08-06T09:35:52+05:30 IST

భారత హాకీకి ఒక ప్పుడు ఒలిం పిక్స్‌లో ‘స్వర్ణ’ యుగం! ఎప్పుడో 93 ఏళ్ల కిందటే.. విశ్వక్రీడల్లో హ్యాట్రిక్‌ పసిడి పతకాలు సాధించిన ఘనత మన జట్టుది...

పడిలేచిన కెరటం

భారత హాకీకి ఒకప్పుడు ఒలిం పిక్స్‌లో ‘స్వర్ణ’ యుగం! ఎప్పుడో 93 ఏళ్ల కిందటే.. విశ్వక్రీడల్లో హ్యాట్రిక్‌ పసిడి పతకాలు సాధించిన ఘనత మన జట్టుది. టోక్యో క్రీడల ముందువరకు ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు నెగ్గడం భారత జట్టు అద్భుత ప్రతిభా పాటవాలకు నిదర్శనం. కానీ కాలక్రమంలో యూరోపియన్‌ శైలి ప్రాచుర్యంలోకి వచ్చి హాకీలో వేగం పెరగడం, ఆ స్పీడుకు తగ్గట్టు మన ఆటగాళ్లు తమ శైలిని మార్చుకోవడంలో ఆలస్యం తదితర కారణాలవల్ల అంతర్జాతీయంగా మనం వెనుకంజలో నిలిచాం. 



(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

పురుషుల హాకీ జట్టు నాలుగు దశాబ్దాలకుపైగా నిరీక్షణకు తెర దించుతూ కాంస్య పతకంతో దేశ హాకీలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇక మహిళల జట్టు కూడా శుక్రవారంనాటి మ్యాచ్‌లో విజయంతో కాంస్యం అందుకుంటే దేశ హాకీ కొత్తపుంతలు తొక్కడం ఖాయం. 


అవమానం నుంచి బయటపడి: పురుషుల జట్టు 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కాలేకపోవడం దేశ హాకీ చరిత్రలో విషాద ఘట్టం. 88 ఏళ్ల తర్వాత మనకు అలాంటి దుస్థితి ఏర్పడింది. ఆ అవమానకర పరిస్థితులను సవాలుగా తీసుకున్న భారత హాకీ దశాబ్దంలోనే అనూహ్యంగా పుంజుకుంది. టెర్రీ వాల్ష్‌, రోలంట్‌ ఓల్ట్స్‌మన్‌, ప్రస్తుతం గ్రాహం రీడ్‌ అత్యున్నత స్థాయి కోచింగ్‌లో జట్టు రాటుదేలింది. ఈ కోచ్‌లంతా జట్టు వర్కింగ్‌ స్టయిల్‌లో సమూల మార్పులు చేశారు. టాప్‌క్లాస్‌ కోచ్‌లతోపాటు సైకాలజిస్టులు, న్యూట్రిషనిస్టులు, ఫిజియోలు, ట్రెయినర్లు, వీడియో అనలిస్టుల అండదండలకు తోడు అత్యుత్తమ సౌకర్యాల కల్పన పురుషుల జట్టు ఆటను గణనీయంగా మెరుగుపరిచాయి. అంతర్జాతీయ జట్లతో తరచూ పోటీపడడం ద్వారా మన ఆటగాళ్లు రాటుదేలారు. ఫిట్‌నెస్‌ స్థాయిలు పెరగడంతో హోరాహోరీ మ్యాచ్‌ల్లో బలిష్టమైన యూరప్‌ జట్లతో భారత్‌  ఢీఅంటే ఢీ అనగలుగుతోంది. 


జట్టులో సమతూకం: పేరు ప్రతిష్ఠల ప్రాతిపదికనగాక ఫామ్‌, ఫిట్‌నెస్‌ స్థాయిని పరిగణనలోకి తీసుకొని ఆటగాళ్లను ఎంపిక చేయడం కూడా కలిసివస్తోంది. దరిమిలా యువకులు, అనుభవజ్ఞులతో జట్టులో సమతూకం ఏర్పడింది. వ్యక్తిగత ప్రయోజనాలకు తావీయకుండా సమష్టిగా రాణిస్తుండడం కూడా జట్టు చక్కటి ఫలితాలు సాధిస్తుండడానికి మరో కారణం. కొందరు ఆటగాళ్లు స్వార్థంతో వ్యవహరించడంవల్ల గతంలో హాకీ జట్టు తీవ్రంగా నష్టపోయింది. మరోవైపు సత్తా కలిగిన యువ ప్లేయర్లతో రిజర్వ్‌ బెంచ్‌  బలీయంగా ఉంది. క్రీడాకారులు మానసికంగా దృఢంగా తయారవడంతో మ్యాచ్‌ చివరి క్షణాల్లో ఏర్పడే ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోగులుగుతున్నారు. ఇలా వివిధ విభాగాల్లో పటిష్టంగా మారిన పురుషుల జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ, వరల్డ్‌ లీగ్‌ తదితర ప్రధాన టోర్నీలలో పతకాలు సొంతం చేసుకోగలుగుతోంది. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ఒలింపిక్‌  కాంస్యం కూడా దక్కడం, ఆ పతకం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రాబోయే ప్రధాన చాంపియ న్‌షి్‌పలలో విజేతగా నిలవడం, ఆపై పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం అందుకోవడం పురుషుల హాకీ జట్టు ముందున్న ప్రధాన లక్ష్యాలు. 




Updated Date - 2021-08-06T09:35:52+05:30 IST