ప్రవాస భారతీయులకు Kuwait షాక్‌.. Visa ల రద్దుకు ఆదేశాలు!

ABN , First Publish Date - 2022-06-13T13:23:32+05:30 IST

మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం ప్రార్థనల తర్వాత ప్రదర్శన నిర్వహించిన ప్రవాస భారతీయులకు కువైత్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన వారిని గుర్తించి, వీసాలను రద్దు చేసి దేశం నుంచి బహిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రవాస భారతీయులకు Kuwait షాక్‌.. Visa ల రద్దుకు ఆదేశాలు!

నిరసనకారులకు దేశ బహిష్కరణ!

ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల కువైత్‌లో ప్రవాస భారతీయుల నిరసన

వారి వీసాల రద్దుకు ప్రభుత్వ ఆదేశం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం ప్రార్థనల తర్వాత ప్రదర్శన నిర్వహించిన ప్రవాస భారతీయులకు కువైత్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన వారిని గుర్తించి, వీసాలను రద్దు చేసి దేశం నుంచి బహిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఓ అరబ్‌ పత్రిక కథనం ప్రచురించింది.


నిరసన వ్యక్తం చేస్తూ గుమిగూడిన వారిని అరెస్ట్‌ చేసి, సఫర్‌ జైలు ద్వారా వారి వారి మాతృదేశాలకు పంపించాలని కువైత్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా కథనంలో పేర్కొంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఫహలీల్‌ అనే ప్రాంతంలో భారతీయులు, ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువకులు కొందరు గుమిగూడారు. ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల శాంతియుతంగా నిరసన తెలిపారు. కొందరు ఇతర దేశాల వారు కూడా వీరికి మద్దతు తెలిపారు. అయితే ఇతర గల్ఫ్‌ దేశాల్లాగానే కువైత్‌లో కూడా నిరసనలకు అనుమతి ఉండదు. ఇక్కడ ఎలాంటి ప్రదర్శనలు, నిరసనలు, ధర్నాలు లేదా అనుమతి లేని సమావేశాలను సహించరు. ఈ రకమైన చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. గత ఫిబ్రవరిలో కూడా భారతీయ ఎంబసీ ముందు కువైత్‌కు చెందిన మహిళలు కొందరు కర్ణాటకలో హిజాబ్‌ వివాదానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిబంధనలకు లోబడి నిరసన తెలపడం, స్థానికులు కావడంతో వారిపై చర్యలు తీసుకోలేదు.  


రాయబారికి నిరసన.. కానీ..బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఖతార్‌ తరహాలో కువైత్‌ కూడా భారత రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. దేశంలోని పార్లమెంటు సభ్యులు, సాధారణ ప్రజలు కూడా మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో కో ఆపరేటివ్‌ స్టోర్లలో భారతీయ ఉత్పత్తులను బహిష్కరించారు. కానీ,  నిబంధనలను అతిక్రమించిన వారిని మాత్రం కువైత్‌ సర్కారు క్షమించదు. వీసా రద్దు, దేశ బహిష్కరణ శిక్ష అమలు చేసి తీరుతుంది.

Updated Date - 2022-06-13T13:23:32+05:30 IST