వారి గుండెల్లో గుబులు మొదలైందా..!

ABN , First Publish Date - 2020-02-14T10:04:39+05:30 IST

భారత క్రికెట్‌ను కుదిపేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌.. మరోసారి కలకలం రేపుతోంది. 2000లో సౌతాఫ్రికా.. భారత పర్యటనలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌లో ...

వారి గుండెల్లో గుబులు మొదలైందా..!

భారత క్రికెట్‌ను అతలాకుతలం చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది.  ఫిక్సింగ్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన సంజీవ్‌ చావ్లాను ఎట్టకేలకు భారత్‌కు తీసుకురాగలిగారు. చావ్లా నోరు విప్పితే.. ఇప్పటి వరకు గొప్పగా భావిస్తున్న అనేక మంది టీమిండియా మాజీ స్టార్‌ క్రికెటర్లు ‘ఛీ’ కొట్టించుకోవచ్చు..! 


భారత్‌కు బుకీ చావ్లా

పోలీసుల కస్టడీకి మేజిస్ట్రేట్‌ అనుమతి

కొందరు మాజీ క్రికెటర్లకు కష్టాలు?


న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ను కుదిపేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌.. మరోసారి కలకలం రేపుతోంది. 2000లో సౌతాఫ్రికా.. భారత పర్యటనలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడైన బుకీ సంజీవ్‌ చావ్లా (50)ను ఎట్టకేలకు భారత్‌ తీసుకురావడంలో పోలీసులు విజయం సాధించారు. ఫిక్సింగ్‌కు సహకరించాల్సిందిగా అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్‌ హన్సీ క్రానేను సంజీవ్‌ ఒప్పించాడనే ఆరోపణలున్నాయి. విచారణలో అతడు నోరువిప్పితే.. ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. 


అతడి ఇంటికి క్రికెటర్లు: బ్రిటిష్‌ పౌరుడైన చావ్లా.. ఫిక్సింగ్‌ కేసులో తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడికి ఎంతో మంది అంతర్జాతీయ క్రికెటర్లతో సంబంధాలున్నాయని ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అందులో కొందరు మాజీల పేర్లు కూడా ఉన్నాయనడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో గతంలో స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన మాజీ క్రికెటర్ల గుండెల్లో గుబులు మొదలైందని సమాచారం. లండన్‌లోని అతడి ఇంటిని చాలా మంది క్రికెటర్లు తరచూ సందర్శించే వారని పోలీసులు చెబుతున్నారు. 2000లో జనవరి నుంచి మార్చి మధ్య అతడి కాల్‌ డేటా ఆధారంగా ఈ విష యం బయటపడిందని పేర్కొన్నారు. 


మాఫియాతో లింకులు: అండర్‌ వరల్డ్‌ మాఫియాలతో చావ్లాకు సంబంధాలున్నాయని సమాచారం. 1990ల్లో గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం సిండికేట్‌తో కలసి చావ్లా ఫిక్సింగ్‌లకు పాల్పడేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీ్‌సకు చెందిన టాప్‌ క్రికెటర్ల సాయంతో మ్యాచ్‌లు ఫిక్స్‌ చేసేవాడని పోలీసులు తెలిపారు. 


12 రోజుల కస్టడీ

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో కీలక నిందితుడైన బుకీ  చావ్లాను ఢిల్లీ పోలీసుల బృందం లండన్‌ నుంచి గురువారం ఉదయం భారత్‌కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. చావ్లాను విచారించేందుకు 12 రోజుల పోలీసు కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. సంజీవ్‌పై ఆరోపణలను కోర్టు దృష్టికి తెచ్చిన పోలీసులు.. విచారణకు 14 రోజులు కస్టడీ కోరారు. 


క్రానే సహకారంతో..

2000లో భారత్‌లో సౌతాఫ్రికా  పర్యటన సందర్భంగా భారీ ఫిక్సింగ్‌ స్కామ్‌కు చావ్లా తెరదీశాడు. సఫారీ సారథి క్రానే సహకారంతో మ్యాచ్‌లను ఫిక్స్‌ చేశాడు.  ఆ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి మార్చి 20 వరకు మ్యాచ్‌లు జరిగాయి. అయితే, అదే ఏడాది ఏప్రిల్‌లో స్కామ్‌ వెలుగుచూసింది. బ్లాక్‌లి్‌స్టలో పెట్టిన బుకీ చావ్లా, క్రానే మధ్య ఫోన్‌ సంభాషణను ఢిల్లీ పోలీసులు ట్యాపింగ్‌ చేయడంతో స్కామ్‌ సంగతి బయటపడింది. డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగా మ్యాచ్‌ల్లో ఓడడానికి క్రానే సుముఖత వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగానే.. సంజీవ్‌ యూకేకు జారుకున్నాడు. 1996లో బిజినెస్‌ వీసాపై తొలిసారి లండన్‌ సందర్శించాడు. 2000లో అతడి పాస్‌పోర్ట్‌ను భారత ప్రభుత్వం రద్దు చేయడంతో.. 2005లో బ్రిటిష్‌ పాస్‌పోర్ట్‌ను సంపాదించాడు. కాగా, ఈ కేసులో ప్రత్యక్ష సంబంధం ఉన్న క్రానే 2002లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు. 2016, జూన్‌ 14న లండన్‌లో చావ్లాను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.  

Updated Date - 2020-02-14T10:04:39+05:30 IST