Abn logo
Jul 27 2021 @ 11:57AM

యూఏఈలోని భారత ప్రవాసులకు.. కాన్సులేట్ జారీ చేసిన 17 మార్గదర్శకాలు

దుబాయ్: యూఏఈలోని భారత ప్రవాసులకు దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ 17 మార్గదర్శకాలను జారీ చేసింది. అక్కడ ఉన్నప్పుడు ప్రవాసులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను వివరించింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్ర(పీబీఎస్‌కే) పబ్లిష్ చేసిన ఈ జాబితాలోని 17 అంశాలను కాన్సులేట్ ప్రధానంగా ప్రస్తావించింది. యూఏఈలో భారత ప్రవాసులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారం దిశగా కాన్సులేట్ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. 


ప్రవాసులు ప్రధానంగా తెలుసుకుని ఉండాల్సిన అంశాలు..

1. యూఏఈ చట్టాలు, ప్రధానంగా కార్మిక చట్టాలను తెలుసుకుని ఉండాలి. అప్పుడే హక్కులు, ఒప్పందాలపై అవగాహన ఉంటుంది.

2. పోలీస్, ఫైర్, అంబులేన్స్, ఆస్పత్రి, భారత ఎంబసీ, కాన్సులేట్, భారత సంస్థల కాంటాక్ట్ నెంబర్స్ కలిగి ఉండాలి. 

3. శారీరక వేధింపులు, గృహాహింస వంటివి ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

4. పని సంబంధిత ఫిర్యాదులు ఏవైనా ఉంటే వర్క్ పర్మిట్ రద్దు తేదీ నుండి ఒక సంవత్సరంలోపు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖలో తెలియజేయాలి. యూఏఈ కార్మిక చట్ట ప్రకారం వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోరు. 

5. మెడికల్ రిపోర్ట్స్, లేటెస్ట్ పాస్‌పోర్ట్ ఫొటో కాపీ, వీసా కాపీ, వర్క్ కాంట్రాక్ట్ పత్రాలు, ఆర్థిక లావాదేవీలా రిపోర్టు, పని చేస్తున్న కంపెనీ సమాచారం, నివాసం ఉంటున్న రెసిడెన్సీ అడ్రస్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. అలాగే వీటన్నింటినీ కుటుంబ సభ్యులకు కూడా పంపిస్తే, అవసరమైన సమయంలో వారి దగ్గర నుంచి తీసుకోవడానికి ఉంటుంది. 

6. ఆర్థిక లావాదేవీలా విషయంలో చట్టబద్ధమైన చెల్లింపుల పథకాలను మాత్రమే వినియోగించాలి. 

7. పని చేయడం మొదలు పెట్టినప్పటి నుంచే పెన్షన్ స్కీంను ప్రారంభించాలి. 

8. డబ్బులు పెట్టుబడిగా పెట్టేముందు వస్తువు, ఏజెంట్ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.

9. యూఏఈతో పాటు స్వదేశంలో కూడా సరియైన లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ కలిగి ఉంటే తీవ్ర అనారోగ్య సమయంలో హెల్ప్ అవుతుంది.

10. ఉద్యోగ ప్రొఫైల్ ప్రకారం తగిన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం ముఖ్యం. 

11. యూఏఈ కోర్టులో వీలునామాను ఆమోదయోగ్యంగా ఉంచుకోవాలి.

12. వ్యక్తిగత సమాచారం దొంగతనం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సిమ్ కార్డు, పాస్‌పోర్ట్, ఎమిరేట్స్ ఐడీ, ఈ-మెయిల్ అకౌంట్‌లను గోప్యంగా నిర్వహించుకోవాలి.


యూఏఈలో ప్రవాసులు చేయకూడనివి..

1. ఇతరులను కించపరిచే విధంగా మతపరమైన విషయాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టకూడదు. ఆచరణలో ఉన్న సంప్రదాయాలు, సమావేశాలు, వారసత్వాన్ని ఏ రూపంలోనైనా ఉల్లంఘించరాదు. 

2. నిషేధిత ప్రదేశాల ఫొటోలు తీసుకోరాదు. అలాగే ఇతరుల ఫొటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పెట్టకూడదు.

3. ఓటీపీ, పాస్‌వర్డ్, ఏటీఎం పిన్ వంటి వాటిని ఇతరులకు చెప్పకూడదు. అలాగే ఇతరుల బ్యాంక్ సంబంధిత వివరాలను అడగరాదు. 

4. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదు. తగిన లైసెన్స్‌తో నిర్దిష్ట ప్రదేశాల్లో మాత్రమే మద్యం సేవించడం అనుమతించబడుతుంది.

5. పనిచేస్తున్న యజమానికి తెలియకుండా పారిపోకూడదు. స్పాన్సర్‌తో సమస్య ఉంటే భారత ఎంబసీ/కాన్సులేట్‌కు, MOHRE(80060) తెలియజేయాలి. 

 తాజా వార్తలుమరిన్ని...