భారత్‌కు తిరిగి రావాలన్న కోరిక తీరకుండానే Dubai లో ప్రముఖ నిర్మాత మృతి.. గల్ఫ్ దేశంలో మూడేళ్ల జైలు జీవితం వెనుక..

ABN , First Publish Date - 2022-10-05T16:45:14+05:30 IST

ఎన్నారై వ్యాపారవేత్త, ప్రముఖ నిర్మాత ఏంఏం రామచంద్రన్ (అట్లాస్ రామచంద్రన్) దుబాయ్‌లో కన్నుమూశారు.

భారత్‌కు తిరిగి రావాలన్న కోరిక తీరకుండానే Dubai లో ప్రముఖ నిర్మాత మృతి.. గల్ఫ్ దేశంలో మూడేళ్ల జైలు జీవితం వెనుక..

దుబాయ్: ఎన్నారై వ్యాపారవేత్త, ప్రముఖ నిర్మాత ఏంఏం రామచంద్రన్ (అట్లాస్ రామచంద్రన్) దుబాయ్‌లో కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సినిమా నిర్మాత, దర్శకుడు, నటుడు, వ్యాపారవేత్త అయిన రామచంద్రన్ కొన్ని రోజుల క్రితం దుబాయ్‌లోని అస్టర్ ఆస్పత్రిలో వయోభార సమస్యలతో చేరారు. అక్కడే ఆదివారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు. భార్య ఇందిరా రామచంద్రన్, కూతురు మంజూ రామచంద్రన్ ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్నారు. బూర్ దుబాయ్‌లో నివాసం ఉండే రామచంద్రన్ యూఏఈలో అట్లాస్ జ్యూవెలరీని నెలకొల్పి అనతికాలంలోనే మంచి లాభాలు గడించారు. అనంతరం జ్యూవెలరీ బ్రాంచీలను జీసీసీ దేశాలన్నింటికీ విస్తరించారు. జీసీసీ దేశాల్లో అట్లాస్ గ్రూపుకు 42 షోరూంలు ఉండేవి. అలాగే భారత్‌లో కూడా మూడు షోరూమ్స్ తెరిచారు. 


2014 వరకు ఇలా జ్యూవెలరీ బిజినెస్‌లో రామచంద్రన్‌కు ఎదురులేకుండా పోయింది. అయితే, 2015లో ఆయనపై నమోదైన చీటింగ్ కేసులతో ఒక్కసారిగా అంతా తలకిందులైపోయింది. ప్రధానంగా బ్యాంకులకు సంబంధించి చెక్ బౌన్స్ కేసుల కారణంగా ఆయన మూడేళ్లు దుబాయ్ జైలులో కూడా ఉన్నారు. 2018లో జైలు నుంచి విడుదలైన ఆయన బూర్ దుబాయ్‌లోని ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల వయోభార సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఛాతీలో నొప్పిగా ఉందనడంతో భార్య, కూతురు దుబాయ్‌లోని అస్టర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుతున్న ఆయన గుండెపోటు రావడంతో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు భార్య ఇందిరా రామచంద్రన్ తెలిపారు. 


1963లో కెనరా బ్యాంకులో ఉద్యోగిగా రామచంద్రన్ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 1966లో ఎస్‌బీఐలో పీఓగా చేరారు. అనంతరం 1974లో కువైత్ కమర్షియల్ బ్యాంకులో చేరిన ఆయన 1987 వరకు అందులోనే పనిచేశారు. అయితే,  1981లోనే కువైత్‌లో బంగారం బిజినెస్ అడుగుపెట్టారు. తొలి అట్లాస్ జ్యూవెలరీ బ్రాంచీని కువైత్‌లోనే నెలకొల్పారు. ఆ తర్వాత జీసీసీ అంతటా 42 బ్రాంచీలు ఏర్పాటు చేశారు. ఇటు స్వదేశంలో కూడా మూడు శాఖలు తెరిచారు. అటు వ్యాపారంతో పాటు ఇటు సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. పలు మలయాళీ చిత్రాలను నిర్మించిన రామచంద్రన్ 2010లో ఓ మూవీకి దర్శకత్వం వహించారు. 


అలాగే అట్లాస్ జ్యూవెలరీకి సంబంధించిన టీవీ ప్రకటనల్లో కూడా స్వయంగా ఆయనే నటించారు. అలా కేరళ మీడియా సెక్టార్‌లో రామచంద్రన్ బాగా ఫేమస్ అయ్యారు. అందుకే ఆయనకు 'అట్లాస్' రామచంద్రన్ అనే పేరు వచ్చింది. అయితే, కొంతకాలంగా ఆయన స్వదేశానికి తిరిగి రావాలని అనుకుంటున్నారు. ఇప్పుడు హఠాన్మరణంతో భారత్‌కు తిరిగి రావాలన్న కోరిక తీరకుండానే రామచంద్రన్ కన్నుమూశారు.  

Updated Date - 2022-10-05T16:45:14+05:30 IST