న్యూయార్క్‌లో గాంధీ విగ్రహం ధ్వంసంపై భారతీయ అమెరికన్ల మండిపాటు

ABN , First Publish Date - 2022-02-08T20:40:41+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్‌లో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని శనివారం కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

న్యూయార్క్‌లో గాంధీ విగ్రహం ధ్వంసంపై భారతీయ అమెరికన్ల మండిపాటు

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని శనివారం కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ నాయకులు సోమవారం తీవ్రంగా ఖండించారు. ఇది ద్వేషాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించిన ఇద్దరు నాయకులైన గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌లకు అగౌరవం అని కమ్యూనిటీ లీడర్లు పేర్కొన్నారు. దీనికి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా భారత కమ్యూనిటీ నాయకులు డిమాండ్​ చేశారు. అటు భారత కాన్సులేట్ కూడా ఈ ఘటనపై మండిపడింది. ఇలాంటివి పునరవృతం కాకుండా చూడాలని అమెరికా అధికారులను కోరింది. 


కాగా, గాంధీ 117వ జయంతిని పురస్కరించుకుని గాంధీ స్మారక అంతర్జాతీయ ఫౌండేషన్​ దీనిని బహుకరించింది. ఈ విగ్రహాన్ని 1986 అక్టోబరు 2న మాన్‌హట్టన్ యూనియన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహాన్ని శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని న్యూయార్క్‌లోని కాన్సులేట్ తెలిపింది. కాగా, ఈ విగ్రహాన్ని కొన్ని కారణాల వల్ల 2001లో తొలగించడం జరిగింది. ఆ తర్వాత 2002లో మళ్లీ పునరుద్ధరించారు. ఇక అగ్రరాజ్యంలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇదే తొలిసారేమి కాదని, గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయని హిందూపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్సవ్ చక్రబర్తి పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మహాత్మా గాంధీ విగ్రహాలను రాడికల్ ఇస్లామిస్ట్‌లతో జతకట్టిన సమూహాలతో పాటు దక్షిణాసియా సమాజాలలో వారి సానుభూతిపరులు ధ్వంసం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-02-08T20:40:41+05:30 IST