America: అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణ ఘటన.. అందరూ చూస్తుండగానే భారతీయ వ్యక్తిని కత్తితో పొడిచి పరారైన అమెరికన్..

ABN , First Publish Date - 2022-09-29T18:23:48+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణం జరిగింది. భారతీయ వ్యక్తిపై అందరూ చూస్తుండగానే ఓ అమెరికన్ కత్తితో దాడికి పాల్పడ్డాడు.

America: అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణ ఘటన.. అందరూ చూస్తుండగానే భారతీయ వ్యక్తిని కత్తితో పొడిచి పరారైన అమెరికన్..

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణం జరిగింది. భారతీయ వ్యక్తిపై అందరూ చూస్తుండగానే ఓ అమెరికన్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు కత్తితో పొడిచి భారతీయుడి బైక్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మంగళవారం న్యూయార్క్‌లోని లోయర్ ఈస్ట్ సైడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఉన్మాది చేతిలో గాయపడిన భారత వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


న్యూయార్క్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉబేర్ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేసే భారత్‌భాయ్ పటేల్‌ (36) అనే భారత వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి క్వీన్స్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తన ఇ-బైక్‌పై ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. లోయర్ ఈస్ట్ సైడ్ ప్రాంతంలో డెలివరీకి వెళ్లిన భారత్‌భాయ్‌ను ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. అనంతరం తనతో పాటు తెచ్చుకున్న కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన భారత్‌భాయ్ కిందపడిపోగానే సదరు వ్యక్తి బైక్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యడు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. తనను కాపాడాలని భారత్‌భాయ్ సహాయం కోసం అరిచిన ఎవరూ పట్టించుకోలేదు. 


కొద్దిసేపటి తర్వాత ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు భారతీయుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే నిందితుడి కోసం గాలించారు. ఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని 47ఏళ్ల కూపర్‌గా గుర్తించిన పోలీసులు కొన్ని గంటల్లోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కూపర్‌పై ఇప్పటికే పలు నేరాల కింద పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, భారత్‌భాయ్ పటేల్ ఘటన మాత్రం జాతి విద్వేషానికి సంబంధించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు కూపర్‌ను ప్రశ్నిస్తున్నట్లు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు.    

Updated Date - 2022-09-29T18:23:48+05:30 IST