Abn logo
Jul 25 2021 @ 00:45AM

2047 నాటికి అమెరికా, చైనాకు దీటుగా భారత్‌

  • అసమానంగా ఆర్థిక సంస్కరణల ప్రయోజనాలు.. 
  • అట్టడుగు వర్గాల్లో సంపద సృష్టి అవసరం 
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ


న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణలు ప్రజలందరికీ సమానమైన ప్రయోజనాలందించలేకపోయాయని భారత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అన్నారు. ఆర్థిక తారతమ్యాలు ఆమోదయోగ్యమూ కాదు. సహనీయమూ కాదన్నారు.  అట్టడుగు వర్గాల్లో సంపద సృష్టిపై దృష్టి పెట్టే ఆర్ధికాభివృద్ధి విధానం అవసరమన్నారు. దేశ భవిష్యత్‌పైన మాత్రం ఆయన సానుకూల దృక్పథాన్ని వ్యక్తపరిచారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే (2047) నాటికి అమెరికా, చైనాకు దీటుగా భారత్‌ అభివృద్ధి చెందనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌ ప్రయా ణం మాత్రం అంత సులువు కాదన్నారు. ‘‘కరోనా సంక్షోభం వంటి ఊహించని, తాత్కాలిక సమస్యల కారణంగా నిరుత్సాహం చెందవద్దు. మన శక్తిని వ్యర్థం చేసే  సాధారణ  విషయాలపైకి దృష్టి సారించవద్దు. స్వతంత్ర భారతంలో వచ్చే 30 ఏళ్లను అత్యుత్తమ కాలంగా తీర్చిదిద్దేందుకు మనకు అద్భుత అవకాశంతోపాటు బాధ్యత కూడా ఉంది. ఈ లక్ష్య సాధనకు స్వయం సమృద్ధి భారత్‌, ప్రపంచంతో పరస్పర సహకారమే మార్గం’’ అని  పేర్కొన్నారు. భారత్‌లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రచించిన ప్రత్యేక వ్యాసంలో అంబానీ పేర్కొన్న మరిన్ని విషయాలు.. 


1991లో 26,600 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుతం పదింతలైంది. సాహసోపేత ఆర్థిక సంస్కరణలే ఇందుకు దోహదపడ్డాయి. 

మూడు దశాబ్దాల క్రితం దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొన్న మన ఆర్థిక వ్యవస్థ.. 2021 నాటికి సమృద్ధికరంగా మారింది. 2051 నాటికి భారత్‌ స్థిర సమృద్ధితో పాటు ప్రజలందరికీ సమాన సంపత్తి సృష్టించే దేశంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. 

1991లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ దిశ, నియంత్రణ విధానాలను మార్చే విషయంలో భారత్‌ ధైర్యంతో పాటు దూరదృష్టినీ  ప్రదర్శించింది. 

90వ దశకానికి నాలుగు దశాబ్దాల వరకు ప్రభుత రంగానిదే ఆధిపత్యం. ఆ తర్వాత చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో ప్రైవేట్‌ రంగం భారీగా అభివృద్ధి చెందింది.

ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం లైసెన్స్‌ రాజ్‌కు ముగింపు పలకడంతో పాటు వాణిజ్య, పారిశ్రామిక విధానాల సరళీకరణ, క్యాపిటల్‌  మార్కెట్లు, ఆర్థిక సేవల రంగాన్ని స్వేచ్ఛాయుతంగా మార్చింది. తత్ఫలితంగా దేశంలో పారిశ్రామికీకరణ ఊపందుకోవడంతో పాటు శరవేగ వృద్ధికి అవకాశం లభించింది. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 

గడిచిన మూడు దశాబ్దాల్లో దేశ జనాభా 88  కోట్ల నుంచి 138 కోట్లకు చేరింది. అయినప్పటికీ, పేదరిక రేటు మాత్రం సగానికి తగ్గింది. 


ఆవిష్కర్తల దేశంగా ఎదగాలి.. 

తక్కువ సాంకేతికతో కూడిన కార్యకలాపాల్లో భారత్‌ అత్యంత వినూత్న దేశమని అంబానీ పేర్కొన్నారు. శరవేగ వృద్ధికి దోహదపడేలా ఆధునిక సాంకేతిక వినియోగంలోనూ ఈ శక్తి సామర్థ్యాల్ని పదర్శించాల్సిన ఉందన్నారు. అత్యుత్తమ నాణ్యతతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో సేవలు, ఉత్పత్తులను అందించేందుకు ఆవిష్కరణలు తోడ్పడతాయన్నారు. తక్కువ ధరలో నాణ్యమైన వస్తువుల ఎగుమతుల ద్వారా అధిక ఆదాయం సమకూరుతుందన్నారు. 


అందరి సంతోషమే అసలైన సంపద 

సంపదను అర్ధం చేసుకోవడం, దాన్ని అన్వేషించే మార్గాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ముకేశ్‌ అంబానీ అన్నారు. ‘‘చాలాకాలంగా సంపదను కేవలం వ్యక్తిగతంగా, ఆర్థికంగానే లెక్కిస్తున్నాం. దేశ ప్రజలందరికీ విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన, ఇల్లు, పర్యావరణ భద్రత, క్రీడలు, కళలు, స్వయం అభివృద్ధి అవకాశాలు కల్పించడంలోనే అసలైన సంపద దాగి ఉందన్న వాస్తవాన్ని నిర్లక్ష్యం చేశాం. ఒక్కమాటలో చెప్పాలంటే, అందరి సంతోషమే అసలైన సంపద’’ అని ఆయన పేర్కొన్నారు. దీన్ని సాధించేందుకు వ్యాపారాలతో పాటు సమాజంలో సంరక్షణ, సహానుభూతిని ఇనుమడింప జేయాల్సిన అవసరం ఉందన్నారు.  


మార్కెట్‌ విస్తరణతోనే వికాసం 

తమ మార్కెట్ల విస్తరణతోనే దేశాలు వికసిస్తాయని అంబానీ అన్నారు. ‘‘ఖండం పరిమాణంలో ఉండే దేశీయ మార్కెట్టే మనకు గొప్ప అనుకూలం. మన మార్కెట్‌ ప్రస్తుత సైజు.. అమెరికా, యూరప్‌ మార్కెట్ల మొత్తంతో సమానం. దేశంలోని వంద కోట్ల మధ్య తరగతి ఆదాయాన్ని పెంచగలిగితే, ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన అభివృద్ధిని సాధించగలదు. ఇందుకోసం భారీ పరిశ్రమలతోపాటు సేవలు, వ్యవసాయం, ఎంఎ్‌సఎంఈలు, నిర్మాణం, పునరుత్పాదక ఇంధన శక్తి, నైపుణ్య రంగాల్లో టెక్నాలజీ వినియోగాన్ని వేగంగా పెంచడం ద్వారా నాలుగో తరం పారిశ్రామికీకరణ విప్లవానికి భారత్‌ నాయకత్వం వహించాల్సి ఉంటుంద’’ని అన్నారు.