టీమిండియాకు ధోనీ లాంటి ఫినిషర్ కావాలి: రవిశాస్త్రి

ABN , First Publish Date - 2022-04-09T00:57:11+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హోరాహోరీగా సాగుతోంది. కొన్ని మ్యాచ్‌లు ఉత్కంఠ కలిగిస్తుంటే

టీమిండియాకు ధోనీ లాంటి ఫినిషర్ కావాలి: రవిశాస్త్రి

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హోరాహోరీగా సాగుతోంది. కొన్ని మ్యాచ్‌లు ఉత్కంఠ కలిగిస్తుంటే మరికొన్ని తేలిపోతున్నాయి. చీల్చి చెండాడతాయనుకుంటున్న జట్లు చతికిలపడుతుంటే పెద్దగా అంచనాలు లేని జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే భారత ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ రేసులో ఉన్నవారు మరింతగా రాణించాల్సి ఉంటుంది.


36 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ ఇప్పటికైతే ఈ రేసులో లేడు కానీ, తన ఫినిషింగ్ సామర్థ్యాలతో తప్పకుండా అతడు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో కార్తీక్ 44 బంతుల్లో 204.5 స్ట్రైక్ రేట్‌తో 90 పరుగులు చేశాడు. మూడు మ్యాచుల్లో వరుసగా 14 బంతుల్లో 32, 7 బంతుల్లో 14, 23 బంతుల్లో 44 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగుతున్న కార్తీక్ అద్భుతంగా రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ 23 బంతుల్లో 7 ఫోర్లు,  సిక్సర్‌తో 44 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 


తనలో ఇంకా చేవ తగ్గలేదని, జట్టులోకి వచ్చే సత్తా ఉందని తన ఆటతీరుతో కార్తీక్ నిరూపిస్తున్నాడు. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ‘ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో’తో మాట్లాడుతూ.. భారత జట్టుకు ఎంఎస్ ధోనీ లాంటి ఫినిషర్ అవసరమని అన్నాడు. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన కార్తీక్‌కు అవకాశం ఉందని అన్నాడు. అయితే, జట్టులో ఎంతమంది వికెట్ కీపర్లు ఉన్నారన్న సంగతిని గుర్తుంచుకోవాల్సి ఉంటుందని అన్నాడు.


ధోనీ ఇప్పుడు జట్టులో లేడు కాబట్టి జట్టు ఒక మంచి ఫినిషర్ కోసం ఎదురుచూస్తోందని, అలాంటప్పుడు కార్తీక్‌ను ఎంచుకోవడం మంచిదని అన్నాడు. అయితే, అంతకంటే ముందు ఎంతమంది కీపర్లు కావాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నాడు. ఇప్పటికే ఇషాన్ కిషన్, రిషభ్ పంత్ ఉన్నారని, ఇప్పుడు కార్తీక్ కూడా ఉన్నాడని అన్నారు. వారిద్దరికీ గాయమైతే కార్తీక్ ఆటోమెటిక్‌గా జట్టులోకి వస్తాడని రవిశాస్త్రి వివరించాడు.  

Updated Date - 2022-04-09T00:57:11+05:30 IST