Abn logo
Mar 4 2021 @ 17:05PM

మొతేరా టెస్టు: తొలి రోజు ఇండియాదే

అహ్మదాబాద్: ఇంగ్లండ్-ఇండియా జట్లు మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టును టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ తమ స్పిన్ మాయతో బురిడీ కొట్టించారు. దీంతో 75.5 ఓవర్లలోనే 205 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌటైంది. ఆరంభం నుంచే భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లలో బెన్ స్టోక్స్(55) ఒక్కడే అర్థశతకంతో రాణించాడు. డాన్ లారెన్స్(46), ఓల్లీ పొప్(29), జానీ బెయిర్‌స్టో(28) పరుగులతో పర్వాలేదనిపించారు. కానీ ఓపెనర్లు క్రాలే(09), సిబ్లీ(02)తో పాటు కెప్టెన్ జో రూట్(05)లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. 

భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మరోసారి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లను వణికించాడు. నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకోని దెబ్బ తీశాడు. అలాగే మరో స్పిన్నర్ అశ్విన్ కూడా 3 వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ సిరాజ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0) త్వరగానే అవుటైనా.. రోహిత్ శర్మ(8), చతేశ్వర్ పుజారా(15) సంయమనంతో ఆడుతున్నారు.