జైశంక‌ర్ ఆధ్వ‌ర్యంలో గృహ కార్మికుల నియామ‌కాల‌పై.. కువైట్‌తో కీల‌క ఒప్పందం!

ABN , First Publish Date - 2021-06-11T16:16:35+05:30 IST

కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్న భార‌త విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ ఆధ్వ‌ర్యంలో భారతీయ గృహ కార్మికుల నియామ‌కాల‌పై కువైట్‌తో భార‌త్‌ కీల‌క ఒప్పందం కుదుర్చుకుంది.

జైశంక‌ర్ ఆధ్వ‌ర్యంలో గృహ కార్మికుల నియామ‌కాల‌పై.. కువైట్‌తో కీల‌క ఒప్పందం!

కువైట్ సిటీ: కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్న భార‌త విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ ఆధ్వ‌ర్యంలో భారతీయ గృహ కార్మికుల నియామ‌కాల‌పై కువైట్‌తో భార‌త్‌ కీల‌క ఒప్పందం కుదుర్చుకుంది. ఇక‌పై ఇండియ‌న్ డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల నియామ‌కం చట్టపరమైన చట్రంలో జ‌ర‌గాల‌ని కువైట్‌తో భారత్‌ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై కువైట్‌లోని భారత రాయబారి సిబీ జార్జ్, కువైట్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హెచ్.ఈ. మజ్ది అహ్మద్ అల్ ధఫిరి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కువైట్‌లోని భారతీయ గృహ కార్మికులను చట్టబద్దమైన చట్రంలో తీసుకువస్తుంది. ఇది వారి నియామకాలను క్రమబద్ధీకరించ‌డంతో పాటు వారికి చట్ట రక్షణ క‌ల్పిస్తుంది. అలాగే ఇది ఒక ఉపాధి ఒప్పందాన్ని ప్రవేశపెడుతుంది. అంతేగాక యజమాని, గృహ కార్మికుల హక్కులు మరియు బాధ్యతలను నిర్ధారిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా గృహ కార్మికులకు 24 గంటల సహాయం కోసం ఓ ప్ర‌త్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఇక కువైట్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి జైశంకర్ శుక్రవారం సాయంత్రం 6:00 గంటలకు వర్చువల్ ప్లాట్‌ఫామ్ ద్వారా భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Updated Date - 2021-06-11T16:16:35+05:30 IST