Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 15 Jun 2022 09:45:20 IST

8ఏళ్లలో ఎన్నడూలేని విధంగా వెనక్కి తగ్గిన Modi .. BJP ప్రతినిధులే ఇందుకు కారణం

twitter-iconwatsapp-iconfb-icon
8ఏళ్లలో ఎన్నడూలేని విధంగా వెనక్కి తగ్గిన Modi .. BJP ప్రతినిధులే ఇందుకు కారణం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో గల్ఫ్, అరబ్బు, ఇస్లామిక్ దేశాలతో భారత్ సంబంధాలు మరింత సన్నిహితమయ్యాయి. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఆయన అనుసరించిన దౌత్యనీతి అసాధారణ సత్ఫలితాలనిచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు ఇరువురు ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆయన ఆ దేశాలతో దౌత్య సంకట పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రిగా తన ఎనిమిదేళ్ళ పాలనలో ఏనాడూ ఒక్కసారిగా వెనక్కి తగ్గని మోదీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా వెనక్కి తగ్గి ఆత్మరక్షణలో పడ్డారు. మత స్వేచ్ఛపై నీతులు చెప్పే అమెరికా, పాశ్చాత్య అగ్ర దేశాలపై ధ్వజమెత్తే భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలో చిన్న జిల్లా అయిన ములుగు జనాభా ఎంతో అంతే జనాభా మాత్రమే ఉన్న ఖతర్ దేశం ముందు మౌన ముద్ర వహించవల్సి వచ్చింది!


ఆసక్తికర అంతర్జాతీయ అంశాలపై విదేశీ రాయబారులు స్ధానిక ప్రభుత్వ అధికారులు, మంత్రులతో సుహృద్భావ స్ఫూర్తితో మాటా మంతీ జరపడం పరిపాటి. రాయబారులను పిలవడం అనేది అసాధారణం. అలా పిలిచి అధికారికంగా నిరసన తెలియజేయడం అనేది అవతలి దేశం ఆందోళనకు సూచిక. పైగా ఒక విదేశీ నేత తమ దేశ పర్యటనలో ఉన్నప్పుడు, ఆ విదేశానికి చెందిన రాయబారిని అసాధారణ రీతిలో పిలవడం జరగదు. ఇది దౌత్య సంప్రదాయం. ప్రవక్త మహమ్మద్‌పై బీజేపీ అధికార ప్రతినిధులు వ్యాఖ్యలు చేసిన పదిరోజుల తర్వాత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖతర్‌లో పర్యటనకు వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో ఖతర్ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురెఖీ స్వాగతం చెప్పారు. భారత రాయబారి దీపక్ మిట్టల్ కూడ అప్పుడు అక్కడ ఉన్నారు. ఇది జరిగిన కొన్ని గంటలకే అదే మంత్రి భారత రాయబారిని పిలిపించి బీజేపీ అధికార ప్రతినిధుల వ్యాఖ్యలపై తమ నిరసనను తెలిపారు. ఘాటైన పదజాలంతో కూడిన ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేసారు. 


8ఏళ్లలో ఎన్నడూలేని విధంగా వెనక్కి తగ్గిన Modi .. BJP ప్రతినిధులే ఇందుకు కారణం

వెంకయ్యనాయుడు పర్యటనకు ఏ మాత్రం ప్రాధాన్యమివ్వని ఖతర్ పత్రికలు తమ మంత్రి నిరసనను మాత్రం ప్రముఖంగా ప్రచురించాయి. ఖతర్ కేంద్రంగా ప్రసారమయ్యే అల్ జజీరా టీవీ ఛానల్ అయితే దీన్ని ప్రముఖంగా ప్రసారం చేసింది. భారత ఉప రాష్ట్రపతి తమ గడ్డపై ఉండగా, ఖతర్ ఉద్దేశపూర్వకంగానే న్యూఢిల్లీతో కయ్యానికి దిగుతుందని గ్రహించిన భారతీయ దౌత్యవేత్తలు అప్రమత్తమయ్యారు. వెంటనే న్యూఢిల్లీలో ప్రభుత్వ పెద్దలకు పరిస్ధితిని నివేదించారు. ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధులపై పార్టీ పరంగా క్రమ శిక్షణా చర్యలు చేపట్టారు. తద్వారా ఇస్లామిక్ దేశాలతో దౌత్య సంబంధాలలో అవాంఛనీయమైన పరిస్థితులు తలెత్తకుండా నివారించే దిద్దుబాటు చర్యలకు ప్రధాని మోదీ ఉపక్రమించారు. సాధారణంగా విదేశీ అతిధులతో ఖతర్ అమీర్ (రాజు) సమావేశమవుతారు. అయితే వెంకయ్యనాయుడుతో ఆయన సమావేశం కాలేదు. అదే విధంగా నాయబ్ అమీర్ (ఉప రాజు) విందు ఇవ్వల్సి ఉన్నా దాన్ని రద్దు చేసారు.


కువైత్, ఒమాన్ దేశాలు కూడ ఖతర్‌ను అనుసరించి భారత రాయబారులను పిలిపించాయి. మరో నాలుగు రోజులలో భారత పర్యటనకు వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలవాల్సి ఉన్నా ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా  భారత రాయబారిని పిలిచి తమ ప్రభుత్వ నిరసన తెలిపారు. ఈజిప్టు రాజధాని కైరోలోని అల్ అజహార్ ఇస్లామిక్ విశ్వవిద్యాలయం, ఒమాన్ అత్యున్నత మత పెద్ద, మక్కా మస్జీదు ఇమాంలతో పాటు కీలకమైన గల్ఫ్ దేశాల సభ్య మండలి జి.సి.సి. కూడ నిరసన తెలియజేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ నిరసనలతో ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ లేకున్నా మోదీ ప్రతిష్ఠ మసకబారింది.

ఇస్లామిక్ ప్రపంచంలో తన ప్రాబల్యం కొరకు ఖతర్ తన చేతిలో ఉన్న అల్ జజీరా ఛానల్ తోడ్పాటుతో కొన్ని దూకుడు చర్యలకు పాల్పడడం జరుగుతోంది. మిగిలిన గల్ఫ్ దేశాలతో పోల్చితే ఖతర్ విదేశాంగ నీతి వేరుగా ఉంది. ఒక వైపు అమెరికా సైనిక దళాల కమాండింగ్ కేంద్రానికి, మరో వైపు తాలిబాన్లకు కూడ కేంద్రంగా ఉన్న ఖతర్ వద్ద అపార ధనరాశులు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి. ఎరువులు, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సహజ వాయువును భారత్‌కు ఖతర్ సరఫరా చేస్తోంది. భారతదేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని దశల వారీగా నిలిపివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, పర్యావరణ కారణాలతో బొగ్గు స్థానంలో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లకు ప్రణాళికలు రచిస్తుండగా, ఖతర్ నుంచి అదానీ, అంబానీలు మాత్రమే భారీ ఎత్తున గ్యాస్ దిగుమతి చేసుకొనేలా చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


అదానీ సంస్థలలో ఖతర్ ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడుల ఆసరాతోనే పౌర విమానయాన రంగంలో జి.యం.ఆర్. సంస్థను అదానీ ప్రక్కకు తోసింది. అంబానీకి కూడ ఖతర్ చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఆఫ్ఘానిస్తాన్ మీదుగా మధ్య అసియా దేశాలకు విస్తరించాలనే భారత ఆశయానికి ఖతర్ మద్దతు అవసరం. ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధుల వ్యాఖ్యల విషయంలో ఖతర్‌తో ఢీకొంటే, అన్ని ఇస్లామిక్ దేశాలతో సంబంధాలు వేడెక్కుతాయి. పైగా ఆయా దేశాలలో ఇస్లామిక్ అతివాద శక్తులకు ఊతమిచ్చినట్లవుతుంది. మొత్తానికి ఈ వివాదంతో న్యూఢిల్లీలోని ప్రస్తుత పాలకులు గుణపాఠం నెర్చుకున్నారని ఇప్పటికిప్పుడే చెప్పడం ఆమాయకత్వం తప్ప మరేమీకాదు.

మొహమ్మద్ ఇర్ఫాన్


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.