భారత్‌లో కరోనా కేసులపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

ABN , First Publish Date - 2021-05-12T13:24:27+05:30 IST

భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. అంతేకాదు.. కరోనా కేసులు, మరణాలకు సంబంధించి వాస్తవ గణాంకాలను ప్రకటించేందుకు కృషి చేయాలని ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాలకూ సూచించారు.

భారత్‌లో కరోనా కేసులపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

జెనీవా: భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. అంతేకాదు.. కరోనా కేసులు, మరణాలకు సంబంధించి వాస్తవ గణాంకాలను ప్రకటించేందుకు కృషి చేయాలని ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాలకూ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కరో నా కేసులు, తీవ్రతపై మంగళవారం ఆమె ఏఎన్‌ఐ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.


భారత్‌లో ఆగస్టు నాటికి 10 లక్షల మరణాలు సంభవించే ప్రమా దం ఉన్నట్టుగా.. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్‌(ఐహెచ్‌ఎంఈ)’ అంచనా వేసినట్టు తెలిపారు. ‘‘భారతదేశంతోపాటు, ఆగ్నేయాసియా ప్రాం తంలో ప్రస్తుతం మనం చూస్తున్న రోజువారీ కేసులు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందునా ఇవన్నీ తగ్గించిన అంచనాలని మాకు తెలుసు’’ అని ఆమె పేర్కొన్నారు. నిజానికి ప్రపంచంలో ప్రతి దేశమూ వాస్తవ సంఖ్యలను తగ్గించి చూపుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. అలా చేయకుండా వాస్తవ గణాంకాలను ప్రకటించడానికి ప్రయత్నించాలని ఆమె సూచించారు. అలాగే.. భారతదేశంలో కొత్త వేరియంట్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను మరింతగా పెంచాలని ఆమె సూచించారు. దీనివల్ల దేశంలో ఏ ప్రాంతంలో ఏ వేరియంట్‌ ప్రబలుతోందో తెలుసుకోవచ్చన్నారు. దీనికి సమాంతరంగా క్లినికల్‌ ఎపిడమియలాజికల్‌ అధ్యయనాలు జరగాలన్నారు. కాగా, కరోనా ఇంకా పూర్తిగా దేశం నుంచి అంతరించకుండానే భారత్‌ సాధారణ స్థితికి వచ్చేందుకు త్వరపడిందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంథొనీ ఫౌచీ తాజాగా విశ్లేషించారు. సెనేట్‌ ఆరోగ్య, విద్య, కార్మిక, పెన్షన్ల కమిటీతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘భారత్‌ ఇప్పుడు ఎదుర్కొంటున్న తీవ్ర పరిస్థితికి రావడానికి తప్పుడు అంచనాలే కారణం. గత ఏడాది తొలి వేవ్‌ అనంతరం ఇక గండం దాటేశామని భావించారు. త్వరపడి అన్నీ తెరిచేశారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న దారుణ పరిస్థితికి దారి తీసింది’’ అని ఆయన స్పష్టం చేశారు.


60శాతం వ్యాక్సినేషన్‌.. కేసులు పైపైకి !

సీషెల్స్‌.. దాదాపు లక్ష జనాభా ఉన్న తూర్పు ఆఫ్రికా దేశం. అక్కడి జనాభాలో 60శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. అయితే మే మొదటి వారంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య దాదాపు రెట్టింపయి 2,486కు చేరింది. ఈ పరిణామంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తంచేసింది.

Updated Date - 2021-05-12T13:24:27+05:30 IST