‘బ్యాంకింగ్‌’లో ఏఐ వినియోగం పెంచాలి

ABN , First Publish Date - 2020-09-12T06:24:02+05:30 IST

భారత ఆర్థిక విజయాన్ని నిర్ణయించడంలో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సేవల రంగం కీలక పాత్ర పోషిస్తోంది.

‘బ్యాంకింగ్‌’లో ఏఐ వినియోగం పెంచాలి

మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ మహేశ్వరి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత ఆర్థిక విజయాన్ని నిర్ణయించడంలో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సేవల రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో డిజిటల్‌ మార్పులు తీసుకువచ్చి వినూత్నాలను ప్రవేశపెట్టడానికి డేటా, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని అధికం చేయాల్సి ఉందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి అన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి మళ్లీ గాడిలో పడేందుకు వ్యక్తులు, కంపెనీలు, ప్రభుత్వాలు డేటా, ఏఐలను వినియోగించడం సాధారణం గా మారిందని, కోలుకోవడానికే కాక భవిష్యత్తులో కొత్త రూపు సంతరించుకోవడానికి కూడా డేటా, ఏఐ అవసరమని మహేశ్వరి అన్నారు. బీఎ్‌ఫఎ్‌సఐ రంగం మార్పులో ఏఐ  పాత్రపై ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మైక్రోసాఫ్ట్‌ ఇండియాతో కలిసి ఐడీఆర్‌బీటీ దీన్ని రూపొందించింది. వైట్‌ పేపర్‌ను కేంద్ర ఫైనాన్షియల్‌ సేవల విభాగం సంయుక్త కార్యదర్శి సౌరభ్‌ మిశ్రా విడుదల చేశారు. రానున్న కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో కృత్రిమ మేధ వినియోగం సర్వసాధారణం అవుతుందని ఐడీఆర్‌బీటీ డైరెక్టర్‌ ఏఎస్‌ రామశాస్త్రి అన్నారు. ఏఐతో ఏం సాధించవచ్చన్న అంశంపై బ్యాంకులకు స్పష్టమైన దృక్పథం ఉండాలని, బ్యాంకులు డేటా స్టోరేజీపై భారీగా పెట్టుబడులు పెట్టాలని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. బయట నుంచి డిజిటల్‌ టెక్నాలజీ నిపుణులను నియమించుకోవడంతోపాటు సొంత సిబ్బందికి ఈ టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వాలని పేర్కొంది. 


5జీ ల్యాబ్‌ ఏర్పాటు..

బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సేవల రంగం కోసం ఐడీఆర్‌బీటీ 5జీ యూజ్‌ కేస్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర, టెలికాం, ఫైనాన్షియల్‌ సేవల విభాగాలు ఈ ప్రాజెక్టును మంజూరు చేశాయి. టెలికాం విభాగం సంయుక్త కార్యదర్శి హరిరంజన్‌ రావు దీన్ని ప్రారంభించారు. దేశంలోనే ఇది తొలి 5జీ యూజ్‌ కేస్‌ ల్యాబ్‌. దేశీయ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సేవల రంగాల్లో 5జీ వినియోగంపై ఈ ల్యాబ్‌ దృష్టి సారిస్తుంది. ఫైనాన్షియల్‌ సేవలు అందించే కంపెనీలు, విద్యా సంస్థలు, స్టార్ట్‌పలతో ఈ ల్యాబ్‌ కలిసి పనిచేస్తుంది. 

Updated Date - 2020-09-12T06:24:02+05:30 IST