Abn logo
Jul 25 2021 @ 02:02AM

వివేకాను చంపిందెవరు?

తెరపైకి ప్రధాన అనుచరుడు గంగిరెడ్డి, డ్రైవర్లు దస్తగిరి, సునీల్‌

తాజాగా వారి పేర్లు వెల్లడించిన వాచ్‌మన్‌ రంగయ్య

తన పేరు చెబితే చంపుతానని గంగిరెడ్డి బెదిరించాడని ఆరోపణ


(కడప-ఆంధ్రజ్యోతి)

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన ఇంటి వాచ్‌మెన్‌ భడవాండ్ల రంగయ్య(65) వాంగ్మూలం కలకలం రేపుతోంది. సీబీఐకి, మేజిస్ర్టేట్‌ ఎదుట వాంగ్మూలంలోనూ వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్లు దస్తగిరి, సునీల్‌ల పేర్లను రంగయ్య వెల్లడించడం, తన పేరు చెబితే చంపేస్తానని గంగిరెడ్డి బెదిరించాడని చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తర్వాత స్థానికులు, మీడియా ప్రతినిధుల ఎదుటా ఆ విషయాలను రంగయ్య వెల్లడించిన నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.  


ఆ యప్పను నేనెందుకు సంపుతా?: గంగిరెడ్డి

‘‘ఆ యప్ప(రంగయ్య)ను నేనెందుకు సంపుతా? ఆ యప్పను నేను చూసిందే ఒక్కసారి. ఓ రోజు సారు ఇంటికాడికి పోయి ఉంటే పార్కులో పని చేస్తున్నాడు. ఎవరని అడిగితే వాచ్‌మన్‌ అన్నారు. అంతే! పరిచయం లేదు. నేను ఆఫీసుకే ఎక్కువ వెళ్లేవాడిని. నాపైన కేసులు ఉన్నాయా? నేనెవరినైనా బెదిరించానా? నేనెందుకు సంపుతా.. అంటా? నేనెప్పుడూ మా సారుకు ద్రోహం చేసే వ్యక్తిని కాదు. వివేకానందరెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లో చీమ అంత అన్యాయం చేయను. ఆ తప్పు నాకు తెలిసింది అంటే, ఏ ప్రమాణానికైనా సిద్ధం. వివేకాతో నాకు మంచి సంబంధాలు ఉండేవి. నాపైన ఆయనకు మంచి గౌరవం ఉండేది. మంచిగా చూసుకునేవాడు. సారు నాకెప్పుడూ అన్యాయం చేసినోడు కాదు. ఆయనపై చెడ్డ అభిప్రాయాలు నాకెందుకు వస్తాయి. ఆ రోజు సారుతో పాటు ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. మైదుకూరు. చాపాడు నుంచి రాత్రి 11.25 గంటలకు వచ్చాం.. మా ఇంటి దగ్గర దింపి వెళ్లాడు. రాత్రి ఇంట్లోనే పడుకున్నాను. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఆయన (వివేకా) బావమర్ది శివప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేసి మీ సారు చనిపోయాడని చెప్పినాడు. ఆ తరువాతే ఇంటికాడికెళ్లాను’’ అని ఎర్ర గంగిరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.


గంగిరెడ్డి లేనిదే వివేకా ఎక్కడి కీ పోడు: రంగయ్య

ఎర్ర గంగిరెడ్డి తాజా వ్యాఖ్యలపై రంగయ్య కూడా స్పందించారు. ‘‘ఎర్ర గంగిరెడ్డి నన్నెందుకు చూడలేదు! ఇంటికాడికి వచ్చినప్పుడు నాతో మాట్లాడాడు. ఆయన లేనిదే వివేకానందారెడ్డి ఎక్కడికీ పోడు. డ్రైవర్‌ను పంపించి ఎర్ర గంగిరెడ్డిని పిలిపించుకొని వెళ్తారు. హత్య జరిగిన రోజు అక్కడే మెట్లకాడ పడుకున్నాను. ఎప్పుడు జరిగిందో, ఏమో? తెల్లారినాక పిలిస్తే చూశాను. మేమున్నాం నీమీద ఈగ కూడా వాలదని సీబీఐ సారోళ్లు చెప్పడంతో ఎర్ర గంగిరెడ్డి నన్ను చంపుతానని బెదిరించాడని చెప్పాను’’ అని రంగయ్య ‘ఆంధ్రజ్యోతి’కి   తెలిపారు.   


ఎవరీ ఎర్ర గంగిరెడ్డి?

ఎర్ర గంగిరెడ్డి స్వగ్రామం తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లె గ్రామం. ఈయన పెళ్లి చేసుకోలేదు. యుక్త వయసు నుంచి వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. వివేకాకు అత్యంత సన్నిహితుడు. పులివెందుల పట్టణంలో బయ్యమ్మతోట వీధిలో ఉంటున్నారు. వివేకాతో కలసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు కూడా చేసేవారని స్థానికులు అంటున్నారు. వివేకాకు ప్రధాన అనుచరుడిగా ఆయన వెంటే ఉండేవాడని, ఆయన ఎక్కడ ఉంటే గంగిరెడ్డి అక్కడ ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు. హత్యకు ముందు రోజు కూడా వివేకాతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాత్రి 11.25 గంటల వరకు వివేకాతో కలసి ఉన్నారు. మరుసటి రోజు తెల్లారేసరికి వివేకా హత్యకు గురైన సంగతి తెలిసిందే. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల జాబితాలో ఎర్రగంగిరెడ్డి ఒకరు. ఈయనను సీబీఐ పలుమార్లు విచారించింది.