సినీ పక్కీలో.. ముత్తూట్‌ దోపిడీ దొంగల వేట

ABN , First Publish Date - 2021-01-24T07:54:24+05:30 IST

తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హొసూర్‌ నగరంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడ్డ ముఠాను తెలంగాణ పోలీసులు సినీఫక్కీలో వేటాడి అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం ముత్తూట్‌ ఫైనాన్స్‌లోకి చొరబడ్డ 8 మంది దుండగులు.. తుపాకులతో బెదిరించి, సిబ్బంది చేతులు కట్టేసి, 20 నిమిషాల వ్యవధిలో 25 కిలోల బంగారాన్ని

సినీ పక్కీలో.. ముత్తూట్‌ దోపిడీ దొంగల వేట

హోసూర్‌ ముత్తూట్‌లో దోపిడీ

25 కిలోల బంగారంతో పరారీ

మూడు రాష్ట్రాల పోలీసులు అలర్ట్‌

తెలంగాణలో 100 మంది 

పోలీసుల మోహరింపు

రంగంలోకి దిగిన సీపీ సజ్జనార్‌

తొండుపల్లి వద్ద లారీ పట్టివేత

ఏడుగురు నిందితులకు బేడీలు

రూ.12.50 కోట్ల సొత్తు స్వాధీనం

వెంటాడిన తమిళ పోలీసులు

వేటాడిన తెలంగాణ కాప్స్‌


హైదరాబాద్‌ సిటీ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హొసూర్‌ నగరంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడ్డ ముఠాను తెలంగాణ పోలీసులు సినీఫక్కీలో వేటాడి అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం ముత్తూట్‌ ఫైనాన్స్‌లోకి చొరబడ్డ 8 మంది దుండగులు.. తుపాకులతో బెదిరించి, సిబ్బంది చేతులు కట్టేసి, 20 నిమిషాల వ్యవధిలో 25 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. ద్విచక్ర వాహనాలపై ఉడాయించారు. వీరిని పట్టుకునేందుకు కృష్ణగిరి జిల్లా ఎస్పీ గంగాధర్‌ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిందితులు బైక్‌లను వదిలి.. సుమోలో పరారైనట్లు తేలడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు సజ్జాపుర, వైట్‌ఫీల్డ్స్‌, చిక్‌బళ్లాపూర్‌ మీదుగా కర్ణాటక దాటడంతో శుక్రవారం రాత్రి తెలంగాణ పోలీసులు అలెర్టయ్యారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పరిధుల్లో 100 మందిని రంగంలోకి దింపారు. బెంగళూరు హైవే, టోల్‌ ప్లాజాల వద్ద నిఘా పెట్టారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్వయంగా రంగంలోకి దిగారు. నిందితుల వద్ద తుపాకులు ఉండడంతో.. పోలీసులు అందుకుతగ్గట్లే మోహరించారు.


వాహనాలు మార్చి.. పోలీసులను ఏమార్చి

నిందితుల సుమోను గుర్తించి, దాన్ని వెంబడించేందుకు కృష్ణగిరి ఎస్పీ గంగాధర్‌ వాహనంలో బయలుదేరారు. అనంతపురంలో నిందితులు మరో సుమోలోకి మారినట్లు గుర్తించారు. మరోవైపు నిందితుల వాహనాన్ని ప్రత్యామ్నాయ మార్గాలు లేని ప్రాంతంలో పట్టుకోవాలని సజ్జనార్‌ సిబ్బందిని ఆదేశించారు. రాయ్‌కల్‌ టోల్‌ప్లాజా వద్ద సుమోను గుర్తించిన పోలీసులు వారికి తెలియకుండానే వెంబడించారు. కాగా, తెల్లవారుజామున 3.30కు నిందితుల వాహనం తొండుపల్లి టోల్‌గేట్‌ వద్దకు రాగానే.. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి బృందం అదుపులోకి తీసుకుంది. తొలుత చెప్పకున్నా.. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో.. ఆయుధాలు, బంగారాన్ని కంటైనర్‌లో నాగ్‌పూర్‌ తరలిస్తున్నట్లు వెల్లడించారు.


ఆ కంటైనర్‌ మేడ్చల్‌ వైపు వెళ్తున్నట్లు తెలిసి బాలానగర్‌ జోన్‌ పోలీసులు, మాదాపూర్‌ ఎస్వోటీకి  సజ్జనార్‌ సమాచారం అందజేశారు. మేడ్చల్‌ చెక్‌పోస్టు దాటిన కంటైనర్‌ను పోలీసులు వెంబడించి, పట్టుకున్నారు. కాగా, చెక్‌పోస్టుల వద్ద పరిస్థితిని గమనించి, కంటైనర్‌ డ్రైవర్‌కు చేరవేసేందుకు.. ఓ సుమో పైలట్‌ చెకింగ్‌తో వెళ్తున్నట్లు గుర్తించారు. సుమోల్లో ఉన్న, కంటైనర్లలో ఉన్న ఏడుగురిని అరెస్టు చేశారు. దొంగల ముఠాను పట్టుకున్న క్రమాన్ని శనివారం విలేకరుల సమావేశంలో కృష్ణగిరి జిల్లా ఎస్పీ గంగాధర్‌తో కలిసి.. సజ్జనార్‌ వివరించారు. 


దోపిడీ ముఠా నేపథ్యం ఇదీ..

ముత్తూట్‌ ఫైనాన్స్‌లోని బంగారం చోరీ లక్ష్యంగా మధ్యప్రదేశ్‌కు చెందిన రూప్‌సింగ్‌ బాగల్‌, అమిత్‌ అలియాస్‌ వివేక్‌ శుక్లా, శంకర్‌ సింగ్‌ బాగల్‌, పవన్‌కుమార్‌ విశ్వకర్మ, జూలియా పాండే, ఝార్ఖండ్‌ వాసి భూపేందర్‌ మాంజీ, వివేక్‌ మండల్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఠీక్‌రామ్‌, రాజీవ్‌కుమార్‌ ముఠాగా ఏర్పడ్డారు.  అక్టోబరులో లూథియానాలో దోపిడీకి పాల్పడ్దారు. స్థానికుల ప్రతిఘటనతో తుపాకీతో కాల్పులు జరపగా ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఉద్యోగి మృతి చెందాడు. నాడు తప్పించుకున్న నిందితులు మరికొందరితో కొత్త ముఠా కట్టారు.  


హొసూర్‌ ముత్తూట్‌కు స్కెచ్‌ ఇలా

తప్పించుకునేందుకు ఎన్నో మార్గాలు ఉండడంతో.. ఈ ముఠా హొసూర్‌లోని ముత్తూట్‌లో దోపిడీకి 15 రోజుల క్రితం స్కెచ్‌ వేసింది. నాగ్‌పూర్‌లో ఉండే లారీ యజమాని కుశాల్‌కుమార్‌ను సిద్ధంగా ఉండాలని సూచించింది. అతడు ద్విచక్రవాహనాల లోడ్‌తో కంటైనర్‌ యూపీ నుంచి తమిళనాడు వెళ్తోందని ఓపిక పట్టాలని చెప్పాడు. యూపీ నుంచి 7 పిస్టళ్లు, 10 మేగజీన్‌లు, 97 బుల్లెట్లను పంపాడు. కంటైనర్‌ తమిళనాడుకు రాగానే.. ఈ ముఠా ఆయుధాలను తీసుకుంది. అందుబాటులో ఉండేలా కంటైనర్‌ను కర్ణాటక సరిహద్దుల్లో పెట్టారు. ఈ ముఠాకు 9 కేసులతో ప్రమేయం ఉన్నట్లు సజ్జనార్‌ వెల్లడించారు. కస్టడీకి తీసుకుని, మరిన్ని వివరాలు రాబడతామని కృష్ణగిరి ఎస్పీ గంగాధర్‌ తెలిపారు.

Updated Date - 2021-01-24T07:54:24+05:30 IST