ప్రైవేటులో.. డోసు రూ. 150

ABN , First Publish Date - 2021-02-28T06:47:44+05:30 IST

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ ధర ఖరారైంది. ఒక్కో డోసును రూ.250కి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రైవేటులో.. డోసు రూ. 150

  • సర్వీసు చార్జీ  రూ.100  అదనం
  • కరోనా టీకా ధర ఖరారు..
  •  రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రం స్పష్టత
  • తొలి రోజు కొన్ని కేంద్రాల్లోనే వ్యాక్సినేషన్‌.. 
  • సిద్ధమవుతున్న రాష్ట్ర వైద్య శాఖ
  • గ్రామీణుల సౌకర్యార్ధం పీహెచ్‌సీల్లో కో-మార్బిడిటీస్‌ ధ్రువపత్రాలు 
  • తెలంగాణలోని 17 సీజీహెచ్‌ఎస్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ టీకా


హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ ధర ఖరారైంది. ఒక్కో డోసును రూ.250కి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య మిషన్‌ డైరెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ,  కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌లు దీనిపై స్పష్టతనిచ్చారు. టీకా ధర రూ.150 కాగా, ప్రైవేటు ఆస్పత్రులు సర్వీసు చార్జీగా మరో రూ.100 వసూలు చేయనున్నాయి. దీంతో డోసు ధర రూ.250 అవుతుంది. అయితే రెండో డోసుకు సేవా రుసుము ఉంటుందా ? ఉండదా ? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రెండో విడత వ్యాక్సినేషన్‌ కోసం టీకా కంపెనీల నుంచి ఒక్కో డోసును రూ.167కి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ ధరలో కొంత రాయితీ ఇచ్చి రూ.150కే ప్రైవేటు ఆస్పత్రులకు డోసులను సమకూర్చనుంది. 60 ఏళ్లకు పైబడినవారు, 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్‌ చేయనున్న నేపథ్యంలో రాష్ట్రాల కార్యాచరణ, టీకా ధరపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కొవిడ్‌ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కట్టడి ప్రాంతాలు, సర్వైలెన్స్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాజీవ్‌గౌబ సూచించారు. కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని ఆయన కోరారు. మార్చి 1న ఉదయం 10 నుంచి 11.30 గంటల మధ్య దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కానుంది. 


తెలంగాణలోనూ అదే సమయంలో ప్రారంభిస్తామని, అయితే తొలి రోజున కొన్ని కేంద్రాల్లోనే టీకాలు వేస్తారని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మార్చి 1న ఎక్కడెక్కడ టీకా కేంద్రాలు ఉంటాయో ఆదివారం (ఫిబ్రవరి 28న) నిర్ణయిస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు వెల్లడించారు. తొలుత కొద్ది కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి, దశలవారీగా వాటి సంఖ్య పెంచనున్నారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న గ్రామీణులు కో-మార్బిడిటీస్‌ ధ్రువపత్రాలు తీసుకోవాలంటే ఇబ్బందిపడాల్సి వస్తుందని భావిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ వాటిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ఇవ్వాలని నిర్ణయించింది.  దేశవ్యాప్తంగా ఆయుష్మాన్‌ భారత్‌, కేంద్ర ఆరోగ్య పథకాల(సీజీహెచ్‌ఎ్‌స)లో ఎంప్యానెల్‌ అయిన ప్రైవేటు ఆస్పత్రుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఈ పథకాల్లో ఎంప్యానెల్‌ అయిన దాదాపు 10,600 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ధర చెల్లించి కొవిడ్‌ టీకా తీసుకోవచ్చు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు కాకపోవడంతో, ఒక్కటి కూడా ఆ విభాగపు ఆస్పత్రి లేదు. ఇక సీజీహెచ్‌ఎస్‌ కింద రాష్ట్రంలో 17 ఆస్పత్రులు ఉన్నాయి.  


కో-మార్బిడిటీస్‌ ఇవీ.. 

45 నుంచి 59 ఏళ్లలోపు వారు 20 రకాల కో-మార్బిడిటీ్‌సలో ఏదో ఒకటి ఉంటేనే టీకా వేసుకునేందుకు అర్హులని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అవి.. గుండెపోటుతో గత ఏడాది వ్యవధిలో ఆస్పత్రిలో చేరినవారు, పోస్ట్‌ కార్డియాక్‌ ట్రాన్స్‌ప్లాంట్‌/ఎల్‌వీఏడీ, ఎల్‌వీఈఎఫ్‌, గుండె వాల్వ్‌లలో మోస్తరు నుంచి తీవ్ర సమస్యలు, తీవ్ర పీఏహెచ్‌తో కంజెనిటల్‌ గుండె జబ్బు, సీటీ/ఎంఆర్‌ఐ స్కాన్‌లతో ధ్రువీకృతమైన బ్రెయిన్‌ స్ట్రోక్‌, అధిక రక్తపోటు, మధుమేహం.. పల్మనరీ ఆర్టరీ హైపర్‌ టెన్షన్‌.. పదేళ్లకుపైగా డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్నవారు.. కిడ్నీ/కాలేయం/హెమటోపొయిటిక్‌ మూలకణ మార్పిడి చేసుకున్నవారితో పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నవారు.. తుది దశలోని కిడ్నీ వ్యాధితో హెమోడయాలసి్‌స చేసుకుంటున్నవారు, కార్టికో స్టెరాయిడ్స్‌/ ఇమ్యునో సప్రెసెంట్‌ ఔషధాలను దీర్ఘకాలంగా వాడుతున్నవారు.. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో గత రెండేళ్లలో ఆస్పత్రిలో చేరినవారు, లింఫోమా/ల్యుకేమియా/మైలోమా బాధితులు, 2020 జూలై 1 తర్వాత కేన్సర్‌ నిర్ధారణ అయినవారు/ప్రస్తుతం కేన్సర్‌ చికిత్సపొందుతున్న వారు, తలసేమియా మేజర్‌ బాధితులు.. హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌.. మతి తప్పినవారు, మస్క్యులర్‌ డిస్ట్రఫీ, చెవుడు వంటి వైకల్యాలు కలిగినవారు. 

Updated Date - 2021-02-28T06:47:44+05:30 IST