రేపు మహాధర్నా

ABN , First Publish Date - 2021-11-24T08:42:02+05:30 IST

ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతుగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎ్‌ససీసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద గురువారం మహాధర్నా నిర్వహించనున్నారు.

రేపు మహాధర్నా

  • ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌లో.. 
  • హాజరవనున్న బీకేయూ నేత టికాయత్‌
  • ఎమ్మెస్పీకి చట్ట సాధన, విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరణలే డిమాండ్‌
  • 26న రాష్ట్రవ్యాప్త ప్రదర్శనలు: ప్రజా సంఘాలు


హైదరాబాద్‌/రాంనగర్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతుగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎ్‌ససీసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద గురువారం మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మహాధర్నాకు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ హాజరుకానున్నారని ఏఐకేఎ్‌ససీసీ నేతలు తెలిపారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) చట్ట సాధన, విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరణ, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి శాశ్వత ఉపాధి కల్పించాలని, కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ 25న ఈ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాగుచట్టాల రద్దుపై 26న రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం రైతులు సాధించిన అద్భుత విజయమని నేతలు తెలిపారు. మిగిలిన డిమాండ్ల సాధనకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపి మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కాగా, సాగు చట్టాల రద్దు రైతుల విజయమని సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న విజయదినంగా పాటించాలని రైతులకు మావోయిస్టు పార్టీ పిలుపునిస్తోందన్నారు. 


నేడు, రేపు కాంగ్రెస్‌ ప్రదర్శనలు

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సహా రైతు సమస్యలపై కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శనలు నిర్వహించనుంది. బుధవారం మండల కేంద్రాల్లో, గురువారం జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని టీపీసీసీ నిర్వహిస్తోంది. తహసీల్దార్లకు, కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనుంది. ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, రైతు సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ధాన్యం అమ్మకాల కోసం రైతులు కల్లాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, వర్షాలకు ధాన్యం తడిసిముద్దయి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  


3,942మందికి పరిహారమే భారమా:రేవంత్‌

సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందినట్లుగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అంగీకరించినందుకు ధన్యవాదాలని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతు బీమా పథకం 59 ఏళ్ల లోపు వారికే వర్తిస్తుంది కనుక.. సదరు 67 వేల పైచిలుకు చావులు సహజ మరణాలు కానట్టే కదా? అని ప్రశ్నించారు. 2014-18 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 3,942 మంది రైతుల కుటుంబాలకు పరిహారం అందలేదని, సర్కారుకు ఈ పరిహారమే భారమైందా అని నిలదీశారు. ఈమేరకు ట్వీట్‌ చేసిన రేవంత్‌రెడ్డి.. దానికి ‘ఉత్తరాది రైతులు సరే.. మనోళ్ల మాటేంటి’ అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్నిట్యాగ్‌ చేశారు. 

Updated Date - 2021-11-24T08:42:02+05:30 IST