అడుగుకో అసమ్మతిరాగం... వైసీపీలో గందరగోళం

ABN , First Publish Date - 2022-06-17T01:31:40+05:30 IST

వైసీపీలో చిచ్చు రాజుకుంటోంది. నిన్న మొన్నటిదాకా మౌనంగా నెట్టుకొచ్చిన నేతలు ప్రస్తుతం గళం విప్పుతున్నారు. తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు..

అడుగుకో అసమ్మతిరాగం... వైసీపీలో గందరగోళం

విశాఖపట్నం: వైసీపీలో చిచ్చు రాజుకుంటోంది. నిన్న మొన్నటిదాకా మౌనంగా నెట్టుకొచ్చిన నేతలు ప్రస్తుతం గళం విప్పుతున్నారు. తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులు తయారవుతున్నాయి. ఈ గ్రూపులను సముదాయించలేక, ఎమ్మెల్యేలకు వత్తాసు పలకలేక వైసీపీ హైకమాండ్‌ ఇబ్బందులు పడుతోంది.


గ్రూపుల గొడవ తారాస్థాయికి చేరిన నియోజకవర్గాలలో మొదటి చెప్పుకోవాల్సింది నరసాపురాన్నే... ఇక్కడ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజుతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి విభేదాలు ముదిరాయి. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌ విషయంలో కొత్తపల్లి చాలా చురుకుగా వ్యవహరించారు. ప్రసాదరాజును గెలిపించి తప్పుచేశానంటూ చెప్పుతో కొట్టుకోవడం సంచలనమైంది. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల కాలంలో సుబ్బారాయుడు పార్టీతో అంటీముట్టనట్టు ఉన్నారు. పైగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినా గెలవగలనంటూ సవాలు విసిరారు. దీంతో వైసీపీ సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.


ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ది మరో కథ. ఈయన టీడీపీ తరపున గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొన్నా మధ్య పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. అయితే జగన్‌ బుజ్జగించడంతో రాజీనామాను వెనక్కి తీసుకున్నారని చెపుతున్నారు. ఈయనకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌తో విభేదాలు ఉన్నాయి. తనకున్న ఇబ్బందులను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా వారు లైట్‌ తీసుకుంటున్నారని గణేష్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతంరాజు సుధాకర్‌కు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మద్దతు ఉంది. దీంతో వాసుపల్లి వ్యవహారాన్ని తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.


తాజాగా ఈ రెండు నియోజకవర్గాల జాబితాలో బందరు కూడా చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్‌ నానీకి, ఎంపీ బాలశౌరికి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తానేంటో చూపిస్తానంటూ బాలశౌరి సవాలు చేశారు. వీరిద్దరూ ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితులుగా పేరొందారు. వీరిద్దరూ బాహాటంగా బూతులు తిట్టుకునే స్థాయికి చేరారు. పరిస్థితి ఇంతగా దిగజారుతుందని వైసీపీ అధిష్ఠానం గుర్తించలేకపోయింది. పరిస్థితి సద్దుమణిగేలా కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే పనిలో పడిందంటున్నారు. తమ వద్దకు వచ్చి చర్చలు జరిగేదాక మౌనం దాల్చాలని, నిందారోపణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దంటూ ఇద్దరినీ తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశించిందిట.


ఇక  నెల్లూరు జిల్లాలోనూ వైసీపీ గొడవలు మామూలుగా లేవు. ఇక్కడ మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి మధ్య పరిస్థితులు రచ్చరచ్చగా ఉన్నాయి. కాకాణికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానంటూ అనిల్‌ కామెంట్స్‌ చేయడం, కాకాణి మంత్రి కాగానే ఆయన కోసం వెలసిన అభినందనల ఫ్లెక్సీలను చింపించడం నుంచి అనిల్‌ రచ్చ చేస్తూనే ఉన్నారు. కాకాణినేకాక, ఆయనను కలవడానికి వెళుతున్నవారినీ అనిల్‌ వదలడం లేదు.  మరోపక్క ఆనం రామనారాయణరెడ్డితోనూ అనిల్‌కు విభేదాలు ఉన్నాయి. అయితే కాకాణి, అనిల్‌ పంచాయతీ జగన్‌ వరకూ చేరిందికానీ పరిష్కారం లభించలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి చల్లబడినట్టు కనిపించిన ఈ విభేదాలు నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయని అవెప్పుడైనా రగలొచ్చని అంటున్నారు.


తాజాగా గన్నవరం గలాటా సంగతి సరేసరి. వైసీపీలో ఇప్పుడిదే హాట్‌టాపిక్‌గా మారింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సాంకేతికంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే. అందుకే వైసీపీ అధిష్ఠానం ఆయనను నేరుగా వెనకేసుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. పైగా ఇప్పుడు సమర్థిస్తే రేపు భవిష్యత్తులో వంశీ ఎదురుతిరగరనే గ్యారంటీ కూడా అధిష్టానానికి లేదట. అందుకే ఇక్కడ వంశీపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావును గానీ, దుట్టా రామచంద్రరావు వర్గాన్ని గానీ కంట్రోల్‌ చేయడం లేదని చెబుతున్నారు. పార్టీని తొలినుంచి మోస్తున్న వెంకట్రావును ఊరుకోమని చెపితే.. వైసీపీ తన గొయ్యి తానే తీసుకున్నట్టవుతుందని అంటున్నారు. దీంతో ఎలాగైనా.. వంశీని వదిలించుకుంటేనే మంచిదని హైకమాండ్‌ ఇక్కడ గ్రూపుల గొడవలను కట్టడి చేయడంలేదంటున్నారు.


ఇవే కాదు, ప్రతి నియోజవర్గంలోనూ వైసీపీకి ఇలాంటి తలనొప్పులు ఎక్కువే ఉన్నాయి. ఇటీవల గడపగడపలో ఎదురవుతున్న చేదు అనుభవాలు.. ఆ పార్టీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. పులిమీద పుట్రలా ఈ అసమ్మతి స్వరాలు రేపటి ఎన్నికల నాటికి గుదిబండలా మారతాయేమోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Updated Date - 2022-06-17T01:31:40+05:30 IST