పండగల వేళ ఆంక్షలు విధించండి

ABN , First Publish Date - 2021-12-24T08:10:01+05:30 IST

వరుసగా వస్తున్న క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, సంక్రాంతి పండగల సందర్భంగా ఒకేచోట వేల మంది గుమిగూడే పరిస్థితి ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పండగల వేళ ఆంక్షలు విధించండి

  • క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, సంక్రాంతికి గుంపుల్లేకుండా చూడండి
  • విమానాశ్రయాల్లో కొవిడ్‌ టెస్టులు జరపండి
  • కేంద్రం మార్గదర్శకాలు పాటించాల్సిందే
  • వాటి అమలుపై స్టేటస్‌ రిపోర్టు ఇవ్వండి
  • తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ చర్యలను స్వయంగా 
  • పర్యవేక్షించాలని ధర్మాసనం నిర్ణయం


హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వరుసగా వస్తున్న క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, సంక్రాంతి పండగల సందర్భంగా ఒకేచోట వేల మంది గుమిగూడే పరిస్థితి ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ఆ మూడు రోజులు ఆంక్షలు విధించాలని చెప్పింది. ఒమైక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్ననందున రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొవిడ్‌ 19 నేపథ్యంలో బాధితులకు చికిత్స, టీకాలు, మౌలిక సదుపాయాలు, ప్రైవేటు హాస్పిటల్స్‌పై నియంత్రణ తదితర అంశాలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీల ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. విదేశాల్లో కొత్త వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశించింది. 


విమానాశ్రయాల్లో కోవిడ్‌ టెస్టులు జరపాలని, ఇతర జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. పండుగలకు పెద్ద ఎత్తున జనం గ్రామాలకు వెళ్లే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించింది. గ్రామాలకు వెళ్లేవారు జగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలను వందశాతం అమలు చేయాలని చెప్పింది. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి ఆంక్షలు విధించాయని ధర్మాసనం గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.


ఒమైక్రాన్‌ వ్యాప్తిలో మూడో స్థానం

ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తిలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది రవిచందర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, వాక్సినేషన్‌ వివరాలు వెల్లడించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మరో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ, పండుగల వేల నిర్వహించే సంబరాలపై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించని వారిపై జరిమానాలు విధించాలని విజ్ఞప్తి చేశారు. ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. కోవిడ్‌ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించిందని, అన్ని రాష్ట్రాలతో ఆ బృందాలు చర్చలు జరుపుతున్నాయని ప్రస్తావించింది. తెలంగాణ ప్రభుత్వం సైతం కేంద్ర మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది. కోవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న  చర్యలను తాము స్వయంగా పర్యవేక్షిస్తామని ధర్మాసనం తెలిపింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. 


48 మందికి ఒమైక్రాన్‌ నెగెటివ్‌

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, సిరిసిల్ల: ముప్పు జాబితాలోని దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి కొవిడ్‌ నిర్ధారణ అయిన 48 మంది నమూనాలకు గాంధీ ఆస్పత్రిలో చేసిన జన్యు విశ్లేషణలో ఒమైక్రాన్‌ నెగెటివ్‌ వచ్చింది. వీరందరికీ సోకింది డెల్టా వేరియంట్‌గా నిర్ధారణ అయింది. సోమవారం నుంచి గాంధీలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ జన్యు విశ్లేషణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా కిట్లు పంపించింది. దీంతో ముప్పు దేశాల నుంచి తిరిగొచ్చిన వారి నమూనాలను పంపుతున్నారు. తొలిగా ఇక్కడ పరీక్ష చేశాక.. మరింత  స్పష్టత కోసం మహారాష్ట్ర పుణెలోని సెంట్రల్‌ ల్యాబ్‌కు పంపారు. అక్కడ కూడా నిర్ధారణ పూర్తయిన తర్వాత గురువారం ఫలితాలను  వెల్లడించారు. కాగా, ముప్పు దేశాల నుంచి గురువారం 648 మంది రాగా.. ఆరుగురికి విమానాశ్రయంలో కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. వీరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపారు.


 మరోవైపు కొత్తగా రాష్ట్రంలో 38,219 మందికి పరీక్షలు చేయగా 177మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఒకరు మృతిచెందారు. 3,596 యాక్టివ్‌ కేసులున్నాయి. గురువారం ఎవరికీ ఒమైక్రాన్‌ నిర్ధారణ కాలేదు. కాగా, కేన్సర్‌ చికిత్సకు వచ్చి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన సోమాలియా వృద్ధుడి (66) పరిస్థితి విషమంగా ఉంది. ఇతడికి సోకిన వేరియంట్‌ నిర్ధారణ కావాల్సి ఉంది. గ్రామానికి చెందిన యువకుడికి ఒమైక్రాన్‌ పాజిటివ్‌ రావడం, అతడి తల్లి, భార్యకు కొవిడ్‌ సోకడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామస్థులు లాక్‌డౌన్‌ విధించుకున్నారు. పది రోజుల పాటు దీనిని అమలుచేయనున్నారు. ఉదయం, సాయంత్రం గంట పాటు మాత్రమే దుకాణాలు తెరచి ఉంచాలని తీర్మానించారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి రావద్దని, అప్పటికీ మాస్క్‌లు ధరించాలని లేదంటే రూ.వెయ్యి జరిమానా వేస్తామని ప్రకటించారు.

Updated Date - 2021-12-24T08:10:01+05:30 IST