దమ్ముంటే మీ మంత్రిపైనా కేసు పెట్టండి

ABN , First Publish Date - 2021-05-09T08:36:00+05:30 IST

‘ఒక టీవీ చానల్‌ చర్చలో పాల్గొంటూ మంత్రి సీదిరి అప్పలరాజు కరోనాలో ఎన్‌ 440 కే రకాన్ని కర్నూలులో గుర్తించిన మాట వాస్తవమేనని, అది మిగిలిన వాటి కంటే తీవ్రంగా వ్యాపిస్తోందని ఒప్పుకొన్నారు

దమ్ముంటే మీ మంత్రిపైనా కేసు పెట్టండి

ఎన్‌ 440 కె వైరస్‌ కర్నూలులో గుర్తించారని ఆయన ఒప్పుకొన్నారు: పట్టాభి

చంద్రబాబుపై పెట్టినట్లు టీవీలు,  పేపర్లపై కేసులు పెట్టే దమ్ముందా?

జార్ఖండ్‌ సీఎం ట్వీట్‌ తప్ప  ఇక్కడ ప్రజల గగ్గోలు కనిపించదా?


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ‘‘ఒక టీవీ చానల్‌ చర్చలో పాల్గొంటూ మంత్రి సీదిరి అప్పలరాజు కరోనాలో ఎన్‌ 440 కే రకాన్ని కర్నూలులో గుర్తించిన మాట వాస్తవమేనని, అది మిగిలిన వాటి కంటే తీవ్రంగా వ్యాపిస్తోందని ఒప్పుకొన్నారు. అదే మాట చెబితే టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు పెట్టారు. దమ్ముంటే అదే కేసును మీ మంత్రిపై కూడా పెట్టండి’’ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం సవాల్‌ విసిరారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పిన చంద్రబాబు దాని ద్వారా కరోనాకు సంబంధించిన అనేక కోణాలను అధ్యయనం చేసి సంబంధిత సంస్థలకు అందచేస్తున్నారు. అందులో భాగంగానే కరోనాలో బాగా వ్యాపిస్తున్న ఒక రకాన్ని గురించి చెప్పారు. అదేమైనా నేరమా? ఈ కొత్త రకం గురించి జాతీయ ఆంగ్ల దిన పత్రికలు మే నెల మొదటి వారంలో పెద్ద కథనాలు ప్రచురించాయి. హైదరాబాద్‌లోని సీసీఎంబీ పరిశోధనశాలకు చెందిన ఒక శాస్త్రవేత్త ఫొటోతోపాటు ఈ వార్తను ఒక పత్రిక ప్రచురించింది. జాతీయ స్థాయిలో మొత్తం 15 దినపత్రికలు, టీవీ చానళ్లు దీని గురించి వార్తలు ఇచ్చాయి. ఆయన మీద కేసు పెట్టినట్లు ఆ పత్రికలు, టీవీలపై కూడా కేసులు పెట్టే దమ్ముందా?’’ అని పట్టాభి నిలదీశారు. ఎక్కడో ఉన్న జార్ఖండ్‌ సీఎం ట్వీట్‌ చేస్తే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి అది కనిపించిదిగాని... రాష్ట్రంలో ప్రజలు వైద్య వసతులు లేక పడుతున్న బాధలపై పత్రికలు, టీవీల్లో వస్తున్న వార్తలేవీ ఆయనకు కనిపిచంచడం లేదని పట్టాభి విమర్శించారు. 

Updated Date - 2021-05-09T08:36:00+05:30 IST