ఎంసెట్‌ రాయలేకపోతే.. మరో అవకాశం!

ABN , First Publish Date - 2022-07-19T10:16:18+05:30 IST

తమకు కేటాయించిన రోజు లేదా సెషన్‌లో ఎంసెట్‌ రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.

ఎంసెట్‌ రాయలేకపోతే.. మరో అవకాశం!

  • కేటాయించిన రోజు 
  • రాయలేకపోతే మరోసారి చాన్స్‌
  • ఉదయం వెళ్లకపోతే మధ్యాహ్నం సెషన్‌లో..
  • వెసులుబాటు కల్పించిన అధికారులు
  • తొలి రోజు పరీక్షకు 91 శాతం పైగా హాజరు
  • నేడు అగ్రి-ఎంసెట్‌ తేదీల ప్రకటన!


హైదరాబాద్‌ / వరంగల్‌ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తమకు కేటాయించిన రోజు లేదా సెషన్‌లో ఎంసెట్‌ రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఏ కారణంగానైనా ఎంసెట్‌కు హాజరు కాలేకపోయిన విద్యార్థులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే... ఈ అవకాశాన్ని పరీక్షలు జరిగే రోజుల్లోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. సోమవారం పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థులు మంగళవారం లేదా బుధవారం పరీక్షకు హాజరుకావచ్చు. బుధవారం ఉదయం హాజరు కాలేని విద్యార్థులు అదే రోజు మధ్యాహ్నం సెషన్‌లో పరీక్ష రాసే వెసులుబాటును కల్పించనున్నారు.


 ఈ అవకాశాన్నివినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఎంసెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థన పెట్టుకోవాలి. అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. కాగా... రాష్ట్రంలో సోమవారం నుంచి ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు... అంటే మూడు రోజులపాటు ఎంసెట్‌ను నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం.. రోజుకు రెండు సెషన్‌ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. సోమవారం నిర్వహించిన పరీక్షకు 91.4 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో 94.8 శాతం మంది, ఏపీలో 78 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు సెషన్‌లలో మొత్తం 58,548 మంది హాజరు కావాల్సి ఉండగా, 53,509 మందివిద్యార్థులు పరీక్ష రాశారు. కాగా, వాయిదాపడిన అగ్రి-ఎంసెట్‌ తేదీలను మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌ ఎంసెట్‌ను నిర్వహించాల్సి ఉండగా.... వర్షాల కారణంగా పరీక్షలను వాయిదా వేశారు. వీటిని ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాల్సి ఉంది. వారం రోజుల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలావుండగా... వరంగల్‌ జిల్లా కేంద్రంలోని గణపతి ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో ఎంసెట్‌ విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పరీక్ష మధ్యలో అనేకసార్లు కరెంట్‌ పోయింది. దీంతో 12 గంటలకు పూర్తవాల్సిన పరీక్ష 2 గంటల వరకు కొనసాగింది. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. 

Updated Date - 2022-07-19T10:16:18+05:30 IST