108, 104కు ఫోన్‌ చేస్తే ఒక్కరూ రాలేదు

ABN , First Publish Date - 2021-05-16T09:14:25+05:30 IST

ఎవరైనా 108, 104కు ఫోన్‌ చేస్తే నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకోవాలి.. వేగంగా వైద్య సేవలు అందించాలి.. ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట ఇది. కానీ సీఎం జగన్‌ సొంత జిల్లాలోనే స్పందించేవారు కరువయ్యారు

108, 104కు ఫోన్‌ చేస్తే ఒక్కరూ రాలేదు

3 గంటలు కొట్టుమిట్టాడిన యువకుడు 

వైద్యం అందక ఇంట్లోనే తుదిశ్వాస


మైదుకూరు, మే 15: ఎవరైనా 108, 104కు ఫోన్‌ చేస్తే నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకోవాలి.. వేగంగా వైద్య సేవలు అందించాలి.. ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట ఇది. కానీ సీఎం జగన్‌ సొంత జిల్లాలోనే స్పందించేవారు కరువయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని స్థానికులు గమనించి 108, 104తో పాటు మున్సిపల్‌ కొవిడ్‌ సెంటర్‌కు ఫోన్‌ చేశారు. అక్కడికి ఎవరూ వెళ్లలేదు. మూడు గంటల పాటు ఆ యువకుడు కొట్టుమిట్టాడి మృతిచెందాడు. కడప జిల్లా మైదుకూరులో ఈ దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయిబాబా ఆలయం వీధిలో ఉంటున్న అరిగెల సురేశ్‌ బాబు (39) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంవత్సరం క్రితం తండ్రి, ఆరునెలల క్రితం తల్లి అనారోగ్యంతో మృతిచెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స చేయించుకుని కోలుకున్నారు. శనివారం ఉదయం 9 గంటలయినా బయటకు రాలేదు. మంచంపై లేవలేకుండా పడి ఉన్నారు. 


స్థానికులు చూసి అంబులెన్స్‌లకు, మున్సిపల్‌ కొవిడ్‌ కాల్‌ సెంటర్‌కు ఫోను చేసి సమాచారం ఇచ్చారు. వలంటీరు వెంకటయ్య అక్కడికి చేరుకొని ఆరోగ్య కార్యకర్తకు, మున్సిపల్‌ కమిషనర్‌కు సమాచారం అందించారు. సమయానికి ఎవరూ రాలేదు. దూరపు బంఽఽధువులు కూడా దగ్గరకు పోలేదు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కమిషనర్‌ రామక్రిష్ణ, ఆరోగ్య కార్యకర్త యశోద అక్కడికి  చేరుకున్నారు. వాళ్లు వచ్చేప్పటికే అతనిలో చలనం లేదు. ఆరోగ్య కార్యకర్త పరిశీలించి సురేశ్‌కు పల్స్‌ ఆడలేదని, మృతి చెందినట్లు తాను నిర్ధారించలేనని, వైద్యులు చూడాలని అన్నారు. ఆసుపత్రికి మాత్రం తరలించలేదు. 104తో పాటు వైద్యులకు సమాచారం ఇచ్చినా రాలేదని తానేమి చేయగలనని మున్సిపల్‌ కమిషనర్‌ అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో వైద్యం అందక సురేశ్‌ మరణించారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు, బంధువులు.. కూలీలను మాట్లాడి మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2021-05-16T09:14:25+05:30 IST