భూములు కొంటే 420

ABN , First Publish Date - 2020-02-19T09:15:25+05:30 IST

ఒక వ్యక్తిని మోసం చేసి సొమ్ములు మింగేస్తే... అది చీటింగ్‌! ఐపీసీ 420 సెక్షన్‌ కింద కేసు పెడతారు! కానీ... రాజధాని అమరావతి ప్రాంతంలో

భూములు కొంటే 420

అది విశ్వాస ఘాతుకం!

ఐపీసీ 409, 420 సెక్షన్ల కింద కేసులు

అనంతపురంవాసులకు సీఐడీ నోటీసులు

రాజకీయాలకు మమ్మల్ని బలి చేయొద్దు

సెక్షన్లతో కొనుగోలుదారుల్లో ఆందోళన

అమరావతి/ధర్మవరం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఒక వ్యక్తిని మోసం చేసి సొమ్ములు మింగేస్తే... అది చీటింగ్‌! ఐపీసీ 420 సెక్షన్‌ కింద కేసు పెడతారు! కానీ... రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కొన్న వారిపై సరిగ్గా ఇదే సెక్షన్‌ కింద కేసులు పెట్టారు. నోటీసులు జారీ చేస్తున్నారు. మోసం మాత్రమే కాదు.... వారిది ‘విశ్వాస ఘాతుకం’ (బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌) అంటూ పెద్దపెద్ద అభియోగాలే మోపారు. ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేస్తే... ఐటీ శాఖ రంగంలోకి దిగాలి. మరొకరి తరఫున భూములు కొనుగోలు చేస్తే... బినామీ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు. ఇవేవీ లేకుండా... ఏకంగా భూముల కొనుగోలు దారులపై ఐపీసీ 420, 409 (బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌) సెక్షన్ల కింద కేసులు పెట్టడం విస్తుగొలుపుతోంది.


రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో జరిగిన లావాదేవీలతో సంబంధం లేకుండా... కేవలం రాజధాని గ్రామాల పరిధిలో జరిగిన కొనుగోళ్లపైనే కఠిన సెక్షన్ల కత్తి ఝళిపించడం సర్కారు వైఖరికి అద్దం పడుతోంది.  అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కేసు విచారణను సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు కూడా నివేదించారు. తాజాగా... అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామానికి చెందిన జయరాం చౌదరి, కనగానపల్లికి చెందిన బట్టా నిర్మలాదేవి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు నిర్ధారణ కావడంతో సీఐడీ సీఐ ఎస్‌ఎం.గౌస్‌, ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌లు అనంతపురం జిల్లాకు చేరుకుని వారిని విచారించారు. కనగానపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి డిప్యూటీ తహసీల్దార్‌ అనురాధ ద్వారా తొలుత రికార్డులను పరిశీలించారు. అనంతరం కొనుగోలుదారులను విచారించారు. 


సోమవారం కుందుర్పి మండలంలోని సహకార బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న జయరాంచౌదరిని కలుసుకుని భూమి కొనుగోలుపై ప్రశ్నించారు. తాను అనంతపురంలో ఉన్న భవనాన్ని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో రూ.18 లక్షలు చెల్లించి అమరావతిలో 50 సెంట్ల స్థలం కొనుగోలు చేశానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మంగళవారం  నిర్మలాదేవిని తహసీల్దార్‌ కార్యాలయానికి పిలిపించి అమరావతిలో భూమి కొనుగోలుపై విచారించారు. తెల్లరేషన్‌కార్డు కలిగి ఉండి భూమి ఎలా కొన్నారంటూ సీఐడీ అధికారులు ప్రశ్నించగా... వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో అక్కడ 50 సెంట్లు కొనుగోలు చేసినట్లు ఆమె సమాధానం చెప్పారు. దీంతో మరింత విచారణ కోసం ఈ నెల 20వ తేదీన సీఐడీ కార్యాలయానికి రావాలని ఈ ఇద్దరినీ సీఐడీ అధికారులు ఆదేశించారు.


ఈ ఇద్దరే కాదు... రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోని వారితోపాటు హైదరాబాద్‌, బెంగళూరు లాంటి చోట్ల ఉన్నవారికి కూడా ఇలా మోసం, నమ్మకద్రోహం సెక్షన్ల కింద నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 95శాతం ప్రజలకు తెల్లరేషన్‌ కార్డులున్నాయని, అంత మాత్రాన భూములు కొనుగోలు చేస్తే కఠిన శిక్షలు పడే నమ్మక ద్రోహంలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమేంటని నోటీసులు అందుకున్న వారు వాపోతున్నారు. తామెవరినీ మోసం చేయలేదని, రాజకీయాలకు తమను బలిచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల కొనుగోలు వ్యవహారాలను పట్టించుకోకుండా కేవలం అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన వారి విషయంలోనే పోలీసులు ఇలా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-02-19T09:15:25+05:30 IST