చర్మం పొడిబారుతుంటే...

ABN , First Publish Date - 2021-10-20T07:25:29+05:30 IST

కొబ్బరినూనె అన్ని రకాల చర్మాల వాళ్లకి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. చేతిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుని ముఖానికి మసాజ్‌లా చేయాలి.

చర్మం పొడిబారుతుంటే...

చలికాలంలో చర్మసమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ముఖంపై చర్మం పొడిబారే సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంది.  అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. చర్మం సంరక్షణ కోసం ఏం చేయాలంటే...


కొబ్బరినూనె అన్ని రకాల చర్మాల వాళ్లకి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. చేతిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుని ముఖానికి మసాజ్‌లా చేయాలి. పావుగంట తరువాత సబ్బుతో కడిగేసుకోవాలి. రాత్రంతా ఉంచేసుకుని ఉదయాన్నే శుభ్రం చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.


కలబంద గుజ్జును రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి జెల్‌ను ముఖానికి అప్లై చేయాలి. ఈ జెల్‌ను రాసుకున్నాక శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అసౌకర్యంగా ఉంటే కనుక శుభ్రం చేసుకోవాలి.


తేనె చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు తాజాగా ఉండేలా చేస్తుంది. చర్మ నిగారింపును పెంచుతుంది. కొద్దిగా తేనె తీసుకుని ముఖానికి రాసుకుని పదినిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఆర్గానిక్‌ తేనె ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. 


మృతకణాలను తొలగించుకోవడానికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ప్యాక్‌లా వేసుకుంటే ఫలితం బాగుంటుంది. 


పచ్చి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, లాక్టిక్‌ యాసిడ్‌ ఉంటాయి. ఇవి డార్క్‌స్పాట్స్‌ను తొలగించి ముఖవర్చస్సు పెరిగేలా చేస్తాయి. పాలలో కొద్దిగా తేనె, పసుపు, బొప్పాయి గుజ్జు వేసి ప్యాక్‌లా వేసుకుంటే చలికాలంలో చర్మానికి తగిన రక్షణ లభిస్తుంది.


ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారు ముల్తానీ మట్టి ఉపయోగించవచ్చు. చర్మం నుంచి వచ్చే అదనపు సెబమ్‌ని ఇది తొలగిస్తుంది.  ముల్తానీ మట్టితో గంధం పొడి కలిపి వాడుకోవచ్చు. వారంలో ఒకరోజు ఉపయోగించినా చాలు. 


కోడిగుడ్డు సైతం మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఎగ్‌వైట్‌లో ఆస్ట్రింజెంట్‌ గుణాలుంటాయి. ఒక బౌల్‌లో ఎగ్‌వైట్‌ తీసుకుని అందులో తేనె, ఆలివ్‌ ఆయిల్‌ లేదా పెరుగు కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తరువాత కడిగేసుకుంటే తేడా మీకే కనిపిస్తుంది.

Updated Date - 2021-10-20T07:25:29+05:30 IST