కిస్తీ కట్టకుంటే.. బండి గుంజుడే!

ABN , First Publish Date - 2021-10-21T10:19:25+05:30 IST

రాష్ట్రంలో ప్రైవేటు ఆటో ఫైనాన్సర్లు, సంస్థల ఆగడాలకు అంతులేకుండా పోతోంది..

కిస్తీ కట్టకుంటే.. బండి గుంజుడే!

ప్రైవేటు ఆటో ఫైనాన్సర్లు, సంస్థల ఆగడాలు

కరోనాతో ఉపాధి కరువై డ్రైవర్ల ఇబ్బందులు 

వాయిదాల చెల్లింపునకు అష్టకష్టాలు 

వాహనాలను జప్తు చేస్తున్న ఫైనాన్సర్లు 


హైదరాబాద్‌,  అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు ఆటో ఫైనాన్సర్లు, సంస్థల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వీటిని నియంత్రించే యంత్రాంగం లేక పోవడంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. నెలసరి వాయిదాలు కట్టని డ్రైవర్లపై భౌతిక దాడులు చేస్తూ, వాహనాలను గుంజుకుపోతున్నాయి. పైగా వాటిని ఇతరులకు విక్రయించడానికీ సిద్ధపడుతున్నాయి. దీంతో ఆటో ఫైనాన్సర్లు, సంస్థల సాయంతో స్వయం ఉపాధి కింద ఆటోలు, టాక్సీలు, ట్రాలీలు, క్యాబ్‌లను కొనుగోలు చేసిన నిరుపేద డ్రైవర్లు అటు ఉపాధి కరువై, ఇటు వీటి వేధింపులు భరించలేక నిత్యం నరకం అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో 400లకు పైగా ఎలాంటి గుర్తింపు, రిజిస్ర్టేషన్‌ లేని ఆటో ఫైనాన్సర్‌లు, ఫైనాన్స్‌ సంస్థలు కొనసాగుతున్నట్టు సమాచారం. కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న ఫైనాన్సర్లు రౌడీలను, గూండాలను వినియోగిస్తూ పేద ఆటో, ట్రాలీ, క్యాబ్‌ డ్రైవర్లపై దాడులకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ప్రభుత్వపరంగా ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎలాంటి గుర్తింపు లేని ఆటో ఫైనాన్సర్లకు రవాణా శాఖ వత్తాసు పలుకుతుండడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారుతోంది. 


వాహనం లేక.. ఉపాధి కరువై..

ఇటీవల కాలంలో ఆటోమొబైల్‌ రంగంలో జాతీయ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నాయి. దీంతో స్వయం ఉపాధి పొందేందుకు డ్రైవర్లు సొంతంగా 20నుంచి 30 శాతం నిధులు సమకూర్చుకుని ఆటో ఫైనాన్సర్లు, ఫైనాన్స్‌ సంస్థల సహకారంతో ఆటోలు, టాక్సీలు, ట్రాలీలు, క్యాబ్‌లు కొనుగోలు చేస్తున్నారు. అనంతరం ఫైౖనాన్స్‌ సంస్థల నిర్వాహకులు ఆయా వాహనాలను రవాణా శాఖలో రిజిస్ట్రేషన్‌ చేయించే సందర్భంలో వారి పేరుతో తనఖా పెట్టినట్టు నమోదు చేయించుకుంటున్నారు. దీంతో డ్రైవర్లకు వాహనంపై యాజమాన్య హక్కు లేకుండా పోతోంది. ఇటీవల కరోనా, లాక్‌డౌన్‌ సుమారు రెండేళ్లుగా రవాణా రంగం కుదేలైంది. వ్యాపారాలు లేక, గిరాకీ లేక ఆటో,వ్యాన్‌, లారీ, క్యాబ్‌ డ్రైవర్లు  కుటుంబాలను పోషించుకునేందుకు నానా యాతనలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో 90 శాతం వరకు వాయిదాలు చెల్లించినా మిగిలిన మొత్తంపై వడ్డీ చెల్లించలేదనే కారణంతో ఫైనాన్సర్లు, ఫైనాన్స్‌ సంస్థలు డ్రైవర్లపై దాడులు చేస్తూ, వాహనాలు గుంజుకుపోతున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న డ్రైవ ర్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. వాహనం లేక, ఉపాధి కరువై ఆయా డ్రైవర్లు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.  


ఏమీ చేయలేం : పోలీసులు 

దోమల్‌గూడకు చెందిన ఆటో డ్రైవర్‌ నర్సింగ్‌రావు గత రెండేళ్ల క్రితం హిమాయత్‌నగర్‌లోని ప్రైవేట్‌ ఆటో ఫైనాన్స్‌ సంస్థ ఆర్ధిక సాయంతో ఆటో కొనుగోలు చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేక గత 4 నెలలుగా వాయిదాలు చెల్లించలేక పోయారు. దీంతో ఫైనాన్స్‌ సంస్థకు చెందిన వ్యక్తులు రెండురోజుల క్రితం నర్సింగ్‌రావుపై దాడి చేసి, ఆటోను తీసుకెళ్లిపోయారు. ఫైనాన్స్‌ సంస్థ నిర్వాహకులు ఆటోను ఇతరులకు విక్రయించేందుకు సిద్ధమవడంతో నర్సింగరావు ఒంటిపై పెట్రోల్‌ పోసి ఆత్మహత్యాయత్నం చేయగా సహచరులు అడ్డుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్లంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఫైనాన్స్‌ సంస్థ పేరిట ఆటో తనఖా ఉండడంతో తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు.  

Updated Date - 2021-10-21T10:19:25+05:30 IST