పెన్షన్‌ భర్తకు వస్తే.. భార్యకు రావట్లేదు

ABN , First Publish Date - 2022-09-26T08:51:58+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్లు.. భర్తకు వస్తే భార్యకు..

పెన్షన్‌ భర్తకు వస్తే.. భార్యకు రావట్లేదు

  • వృద్ధులైన భార్యాభర్తలిద్దరికీ ఇవ్వండి.. పెన్షన్‌ను రూ. 3,016కు పెంచండి
  • ఆధార్‌లో వయసు నమోదులో తప్పుల వల్ల అర్హులకూ వృద్ధాప్య పెన్షన్‌ అందట్లేదు 
  • తప్పులు సరి చేసి అర్హులందరికీ పెన్షన్‌ ఇవ్వండి.. సీఎం కేసీఆర్‌ను కోరిన జగ్గారెడ్డి 

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్లు.. భర్తకు వస్తే భార్యకు.. భార్యకు వస్తే భర్తకు రావట్లేదని, అలా కాకుండా భార్యాభర్తలిద్దరికీ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కోరారు. వృద్ధాప్య పెన్షన్లను అందరికీ రూ. 3,016కు పెంచుతామంటూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ రూ. 2016 చొప్పునే ఇస్తున్నారని గుర్తు చేశారు. వృద్ధాప్య పెన్షన్‌ను రూ.3016కు పెంచాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో 57 సంవత్సరాల వయసు వారికీ రూ.3016 చొప్పున పెన్షన్‌ను అమలు చేయాలని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన విన్నవించారు. అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాల్లోనూ వృద్ధాప్య పెన్షన్లకు అర్హులైన కొందరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వాస్తవ వయస్సు 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఉంటే.. ఆధార్‌ కార్డులో మాత్రం 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నట్లుగా నమోదైందన్నారు. 


ఈ వృద్ధుల దగ్గర జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్‌ పొందేందుకు అర్హులై ఉండి కూడా ఆధార్‌ కార్డులో తప్పుగా వయసు నమోదు కావడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది వృద్ధులు పెన్షన్‌ను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలను ఇంటింటికీ పంపించి.. ఆయా ఇళ్లలో ఉంటున్న వృద్ధుల వయసు ఎంతో తెలుసుకుని ఆధార్‌ కార్డుల్లో పుట్టిన తేదీలు సరిచేయాలని కోరారు. ఇలా చేసిన పక్షంలో వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న చాలా మందికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి మునిసిపల్‌ వార్డులో, గ్రామంలో సభలు పెట్టి వృద్ధుల వయస్సుకు సంబంధించి ఆధార్‌ కార్డుల్లో దొర్లిన తప్పులను సవరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూ.కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు కడుతున్న ప్రభుత్వం.. ముసలితనం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న భార్యా భర్తలిద్దరికీ పెన్షన్‌ ఇస్తే.. వారు ఇంకొకళ్లపై ఆధారపడకుండా జీవించే అవకాశం ఉంటుందన్నారు. తన సూచనలను అమలు చేయాలంటూ సీఎం కేసీఆర్‌ను జగ్గారెడ్డి కోరారు. 

Updated Date - 2022-09-26T08:51:58+05:30 IST