ఇలాగైతే ఆందోళనే!

ABN , First Publish Date - 2021-12-31T08:00:10+05:30 IST

ఇలాగైతే ఆందోళనే!

ఇలాగైతే ఆందోళనే!

జనవరి 3 తర్వాత జేఏసీల భేటీ.. చర్చల పేరిట అవమానిస్తున్నారు

పీఆర్సీపై కాలయాపన.. ఆర్థిక పరిస్థితి బాలేదనడం సరికాదు

డబ్బుల్లేకుండానే 1.4 లక్షలమందిని సచివాలయాల్లోకి తీసుకున్నారా?

మాకివ్వాల్సిన బిల్లులూ పెండింగ్‌లోనే.. 

ఉద్యోగ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు ఆగ్రహం


‘‘పీఆర్సీపై చర్చలపేరిట ప్రభుత్వం ఉద్యోగులను ఎన్ని సార్లు అవమానిస్తున్నా వేచిచూస్తున్నాం. అయితే, ఇంకా ఇదే ధోరణి కొనసాగిస్తే జనవరి 3వ తేదీ తర్వాత ఇరు జేఏసీలు చర్చించుకుని తదుపరి కార్యాచరణ చేపడతాం’’ అని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం అమరావతి సచివాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆర్థికశాఖ అధికారులతో జరిగిన భేటీలో పీఆర్సీపై ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ప్రభుత్వం పదే పదే సమావే శాలు నిర్వహిస్తూ అవమానిస్తుందే తప్ప న్యాయం మాత్రం చేయడంలేదు. పీఆర్సీపై చర్చలు మళ్లీ తిరోగమనంలోకి వెళ్లాయి. గత సంప్రదాయాలను అధికారులు తుంగలోతొక్కారు. అధికారులు వాదిస్తున్నట్టు.. గడిచిన కొన్నేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడా దిగజారలేదు. ఉద్యోగులకు ఆదాయంలో 75 శాతం ఖర్చు చేస్తున్నామని చెప్పడం సత్యదూరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఏకంగా 1.40 లక్షల మంది గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులను ఎందుకు నియమించాల్సి వచ్చిందో ప్రభుత్వమే చెప్పాలి’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. చర్చలకు ఎందుకు పిలిచారు అని ప్రశ్నిస్తే ఫిట్‌మెంట్‌ అన్నారని.. అయితే చెప్పమంటే.. మళ్లీ 14.29 శాతం అంటున్నారన్నారు. దానికి ఒప్పుకునేదేలేదు అని బొప్పరాజు పునరుద్ఘాటించారు. రాష్ట్ర హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డిని ప్రభుత్వం తప్పు చేయకపోయినా కక్షతో సస్పెండ్‌ చేసిందని, ఆయన సస్పెషన్‌ ఎత్తివేయాలని ఆయ డిమాండ్‌ చేశారు. పీఆర్సీపై ఉద్యమం చేస్తున్నారని 2500 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చార్జి మెమోలు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. పాఠశాలలో వడ్డించే కోడిగుడ్లు కుళ్లాయని.. బాత్రూమ్‌లు శుభ్రంగా లేవన్న కుంటి సాకులు చెప్పి టీచర్లను సస్పెండ్‌ చేస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు టాయిలెట్లు కడగడానికి లేరని.. చదువులు చెప్పడానికి వచ్చారనేది ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని బొప్పరాజు మండిపడ్డారు. ప్రభుత్వ చర్చలతో ఎలాంటి ఉపయోగంలేదని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు అన్నారు. ‘‘ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులపైనా సమావేశంలో స్పష్టత ఇవ్వలేదు. పీఆర్పీపై తిరుపతిలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ పోయింది. అమరావతిలో సీఎస్‌ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. ప్రభుత్వమే ఉద్యోగులను పట్టించుకోవడంలేదా? అధికారులు పట్టించుకోవడంలేదా? అనే అనుమానం కలుగుతోంది. 71 డిమాండ్లపై ఏ ఒక్కదానిపైనా స్పష్టత లేదు’’ అని బండి అన్నారు. 4 నెలలుగా ప్రభుత్వం పీఆర్సీపై ఒకటే తంతు నడుపుతోందని ఏపీటీఎఫ్‌ నేత హృదయరాజు మండిపడ్డారు. 


ఉద్యోగులతో బొమ్మలాట: కేఆర్‌ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

ఉద్యోగులను తోలుబొమ్మలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ ఆగ్రహించారు. డిసెంబరు 31 తేదీ వరకు వేచి చూస్తామని తాము గతంలోనే చెప్పామనీ, జనవరి నుంచి జిల్లాలు, తాలూకాల స్థాయుల్లో చైతన్యయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. ‘‘ఐఏఎస్‌ అధికారులు శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారు. వారి నిర్లిప్తత కారణంగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడంలేదు. పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఆ శాఖ కమిషనర్‌ , కార్యదర్శి వేతనాలు ఎలా తీసుకుంటారు? జీతాలు గ్రీన్‌ చానెల్‌ ద్వారా అందుతున్నకారణంగా వారికి నొప్పి తెలియడంలేదు. చాయ్‌పే చర్చ తరహా సమావేశాల వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదు. చర్చలు విఫలం కాగానే ఆందోళనలు చేయాల్సి ఉన్నా.. ఉద్యోగ సంఘాల మధ్య అనైక్యత వల్ల అది సాధ్యం కావడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.

Updated Date - 2021-12-31T08:00:10+05:30 IST