లాంగ్‌ కొవిడ్‌ వేధిస్తుంటే...

ABN , First Publish Date - 2022-06-21T08:45:57+05:30 IST

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కండరాల నొప్పులు సహజం. ఆ నొప్పి ఒక ప్రదేశానికే పరిమితం కావొచ్చు లేదా పక్కలకూ విస్తరించవచ్చు.

లాంగ్‌ కొవిడ్‌ వేధిస్తుంటే...

కొవిడ్‌ వదిలినా, లాంగ్‌ కొవిడ్‌ వదలడం లేదు. కాళ్ల నొప్పులు, నిస్సత్తువ, గుండె దడ, నిద్ర లేమి.. ఇలాంటి ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలం వేధిస్తున్నాయి. అయితే వీటిని ఎంత వరకూ సీరియస్‌గా తీసుకోవాలి? ఎలా అదుపులో ఉంచుకోవాలి?


ఛాతీ నొప్పి: కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కండరాల నొప్పులు సహజం. ఆ నొప్పి ఒక ప్రదేశానికే పరిమితం కావొచ్చు లేదా పక్కలకూ విస్తరించవచ్చు. నడుము పైభాగాన్ని పక్కలకు తిప్పినప్పుడు, వంచినప్పుడు ఛాతీలో నొప్పి బాధిస్తూ ఉండవచ్చు. అయితే ‘నాన్‌ కార్డియాక్‌ చెస్ట్‌ పెయిన్‌’ అనే ఈ సమస్య సన్నగా, లేదా గుచ్చినట్టు ఉండవచ్చు. క్షణకాలం పాటు లేదా అదే పనిగా వేధిస్తూ ఉండవచ్చు. అయితే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి ఇతరత్రా లక్షణాలు  ఉన్నా, ముందు నుంచీ గుండె సమస్యలు ఉన్నా, అధిక రక్తపోటు, మధమేహం ఉన్నా ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. 


గుండె దడ: ‘పోస్టరల్‌ టాకీకార్డియా సిండ్రోమ్‌’ అనే గుండె సమస్యను తలపించే  లక్షణాలు లాంగ్‌ కొవిడ్‌లో కొందరిని వేధిస్తాయి. ఈ సమస్యలో తలతిరుగుడు, అలసట, గుండెదడ లాంటి లక్షణాలుంటాయి. కూర్చున్నవాళ్లు హఠాత్తుగా నిలబడినప్పుడు, లేదా ఏదైనా శారీరక శ్రమకు పూనుకున్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. ఇలా ఉన్నపళాన నిలబడినప్పుడు, శరీరంలోని రక్తం నడుము కింది వైపుకు పరుగులు పెడుతుంది. ఫలితంగా రక్తపోటు పడిపోకుండా ఉండడం కోసం శరీరం రక్తనాళాలను కుంచించుకు పోయేలా చేసి, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. దాంతో కొన్ని క్షణాల పాటు గుండె దడ ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ సమస్య లాంగ్‌ కొవిడ్‌ ప్రభావం కాదనీ పిటిఎస్‌ సమస్యకు మూలమనీ నిర్ధారించుకోవడం కోసం వైద్యులను కలవడం అవసరం.

 

ఇబ్బందులు అదుపులో...

పనుల చిట్టా తయారు చేసుకుని, వాటికే కట్టుబడి ఉండాలి. అవసరానికి మించి శరీరం అలసటకు లోనవకుండా చూసుకోవాలి.

కష్టతరమైన పెద్ద పనిని, విడతలవారీగా ముగించేలా శ్రమను విడగొట్టుకోవాలి. అలాగే తేలికైన, కష్టమైన పనులను మార్చి మార్చి ముగించాలి.

Updated Date - 2022-06-21T08:45:57+05:30 IST