తరుగు తీస్తే బ్లాక్‌ లిస్టులో పెడతాం!

ABN , First Publish Date - 2022-05-18T09:06:31+05:30 IST

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన తర్వాత రైస్‌మిల్లర్లు తరుగు తీయడం చట్టవిరుద్ధమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

తరుగు తీస్తే బ్లాక్‌ లిస్టులో పెడతాం!

  • కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన 
  • ధాన్యంలో కోత వేస్తే కఠిన చర్యలే
  • రైస్‌ మిల్లర్లకు మంత్రి గంగుల హెచ్చరిక
  • రైతులు నష్టపోకుండా చూడాలని  అధికారులకు ఆదేశం


హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన తర్వాత రైస్‌మిల్లర్లు తరుగు తీయడం చట్టవిరుద్ధమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎవరైనా రైస్‌మిల్లర్లు తరుగు పేరుతో కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే మిల్లులను బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఏ మాత్రం నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని పౌరసరఫరాల భవన్‌లో ఆ శాఖ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌తో కలిసి ధాన్యం సేకరణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. ధాన్యం కొనుగోలు, మద్దతు ధర, తరుగు తదితర అంశాలపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని గంగుల చెప్పారు. ప్రతిపక్షాలు, మీడియా మాత్రం ఏదో జరుగుతుందన్నట్లు రైతాంగాన్ని భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 


ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరిచండం లేదని గంగుల ఆరోపించారు. కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా కొత్తగా ఒక గోనె సంచిని కూడా రాష్ట్రానికి పంపించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటివరకు 9.97 కోట్ల గోనె సంచులను సమకూర్చుకుందని, 5.06 కోట్ల సంచులు వినియోగించామని, 4.91 కోట్ల సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సేకరణ ప్రక్రియను వేగవంతం చేశామని, రోజుకు దాదాపు రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇప్పటివరకు 6,542 సెంటర్లు ప్రారంభించినట్లు తెలిపారు. 3.18 లక్షల మంది రైతుల నుంచి రూ. 3,961 కోట్ల విలువ చేసే 20.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇందులో 19.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు తెలిపారు. అకాల వర్షాలపై జిల్లాస్థాయి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. సెంటర్లలో ధాన్యం నిల్వలు పేరుకు పోకుండా చూడాలని, ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలించాలని, జాప్యం చేయకుండా మిల్లర్లు అన్‌లోడింగ్‌ చేసుకోవాలని, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-05-18T09:06:31+05:30 IST