ప్రశ్నిస్తే.. చంపేస్తారా..!

ABN , First Publish Date - 2021-09-18T08:14:23+05:30 IST

ప్రశ్నిస్తే.. చంపేస్తారా..!

ప్రశ్నిస్తే.. చంపేస్తారా..!

ప్రధాని, కేంద్ర హోం మంత్రికీ ఫిర్యాదు చేస్తాం

దాడిని ఖండించిన ‘దేశం’ నేతలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి ఎమ్మెల్యే జోగి రమేశ్‌ దాడి చేయడంపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. పలు పార్టీల నేతలు దాడిని తీవ్రంగా ఖండించారు. ‘‘ఫ్యాక్షన్‌ రాజకీయాలకు అలవాటుపడిన జగన్‌రెడ్డి ఏపీని అఫ్ఘానిస్తాన్‌గా మార్చేశారు. వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారు. ప్రతిపక్షంగా మాట్లాటం తప్పా? ప్రజా సమస్యలపై నిలదీస్తే గూండాగిరీ చేస్తారా? జోగి రమేశ్‌ ఎమ్మెల్యేనా? గూండానా? మాజీ ముఖ్యమంత్రి, జెడ్‌ ప్లస్‌ క్యాటగిరిలో ఉన్న చంద్రబాబు ఇంటిపై రౌడీ మూకను వేసుకొచ్చి, రాళ్ల దాడి చేయడం ఏంటీ?’’ అని టీడీపీ నేతలు మండిపడ్డారు. అధికారాన్ని, పోలీసుల్ని గుప్పిట్లో పెట్టుకుని, జగన్‌రెడ్డే దాడులకు ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యం మంటగలిసిందని, జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా మార్చేశాడని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు మండిపడ్డారు. జోగిని అరెస్టు చేసి, కేసు నమోదు చేయాలని లేదంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అవినీతిని ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతం చేసేందుకు జగన్‌ కుట్ర పన్నారని టీడీపీ పోలిట్‌బ్యూరో యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఇది వైసీపీ బరితెగింపు చర్యలకు నిదర్శనమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఇంటిని ముట్టడించడం, రాళ్లతో దాడికి పాల్పడటం వెనుక ముఖ్యమంత్రే వెనుక నుంచి చేయిస్తున్నారని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి జోగి అనుచరులు, పోలీసుల అలుసుతోనే దుస్సాహసానికి ఒడిగట్టారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రమేశ్‌పై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఇది పోలీసులు వైఫల్యమని మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర ఆరోపించారు. తక్షణమే జోగి రమేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చే యాలని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిపై ప్రధాని, కేంద్ర హోం మంత్రికీ ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ నేతలు తాలిబన్లలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.


సీఎం ఆపాల్సింది: మధు, సీపీఎం

‘‘ముఖ్యమంత్రి దీన్ని జరగకుండా చేయాల్సింది. జోగి రమేశ్‌ను అక్కడికి వెళ్లకుండా చేయాల్సింది. ఇలాంటి చిల్లర వ్యవహారం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం.’’ 


ఖండిస్తున్నాం: రామకృష్ణ, సీపీఐ

‘‘చంద్రబాబు ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నాం. పోలీసుల వైఫల్యానికి ఇది నిదర్శనం’’ 


ఆటవిక చర్య: ముప్పాళ్ల,ఏపీసీఎల్‌ఏ

‘‘చంద్రబాబుపై వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేయడం దారుణం. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. శాంతిభద్రతలను కాపాడవలసిన పోలీసులు దౌర్జన్యకారులకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు’’ 

Updated Date - 2021-09-18T08:14:23+05:30 IST