IDFC Bank చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక లాభం.. ఆకాశాన్నంటిన షేర్లు

ABN , First Publish Date - 2022-08-01T17:12:19+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఐడీఎఫ్‌సీ అదిరిపోయే ఆదాయాలను ప్రకటించింది.

IDFC Bank చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక లాభం.. ఆకాశాన్నంటిన షేర్లు

IDFC Bank : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఐడీఎఫ్‌సీ అదిరిపోయే ఆదాయాలను ప్రకటించింది. దీంతో సోమవారం ఇంట్రా-డేలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్(IDFC First Bank) షేర్లు 10 శాతం జూమ్ చేసి రూ.41.30కి చేరుకుంది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ చరిత్రలోనే అత్యధికంగా రూ. 474 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించాయి. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ తన అత్యధిక స్టాండ్‌లోన్ లాభాన్ని రూ. 474.33 కోట్లుగా పేర్కొంది. 


ఇది ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 630 కోట్ల నికర నష్టం నుంచి కోలుకుని మరీ లాభాల బాట పట్టడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 26 శాతం పెరిగి వార్షికంగా రూ. 2,751.1 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయం మరింత అధికంగా 20 శాతం ఎగసి రూ. 4,922 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 855 కోట్లకు చేరింది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 1,872 కోట్ల నుంచి రూ. 308 కోట్లకు భారీగా తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.61 శాతం నుంచి 3.36 శాతానికి తగ్గాయి. 


నికర ఎన్‌పీఏలు సైతం 2.32 శాతం నుంచి 1.30 శాతం వెనుకబడ్డాయి. నికర వడ్డీ మార్జిన్లు 5.5 శాతం నుంచి 5.89 శాతానికి మెరుగుపడ్డాయి. కనీస మూలధన నిష్పత్తి 15.77 శాతంగా నమోదైంది. గత ఏడు ట్రేడింగ్ వారాల్లో కనిష్ట స్థాయి రూ.28.95 నుంచి దాదాపు 43 శాతం ఎగబాకింది. జూలైలో మాత్రమే స్టాక్ 19.4 శాతం లాభపడింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో బ్యాంక్ డిపాజిట్లలో 21 శాతం పెరుగుదలతో రూ.1,02,868 కోట్లకు చేరుకుంది. 


Updated Date - 2022-08-01T17:12:19+05:30 IST