ఇలాంటి దేశం అజేయం!

ABN , First Publish Date - 2020-06-26T05:30:00+05:30 IST

మన రాజ్యాంగానికి పునాదిగా నిలిచిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర ప్రజాతంత్రం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం అనేవి బౌద్ధం నుంచి స్వీకరించినట్టు రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ డాక్టర్‌ అంబేద్కర్‌ చెప్పారు...

ఇలాంటి దేశం అజేయం!

మన రాజ్యాంగానికి పునాదిగా నిలిచిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర ప్రజాతంత్రం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం అనేవి బౌద్ధం నుంచి స్వీకరించినట్టు రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ డాక్టర్‌ అంబేద్కర్‌ చెప్పారు. అంటే... బౌద్ధం కేవలం ధ్యాన, ధార్మిక మార్గం మాత్రమే కాదు, గొప్ప సామాజిక వికాస మార్గం కూడా!


బుద్ధుని కాలంలో జంబూద్వీపంలో, అంటే మన భారతదేశంలో పదహారు రాజ్యాలు ఉండేవి. వాటిలో కోసల, మగధ పెద్ద రాజ్యాలు. ఏక కేంద్ర రాచరిక, నియంతృత్వ రాజ్యాలు. మిగిలిన పధ్నాలుగూ గణతంత్ర, ప్రజాతంత్ర రాజ్యాలు. పెద్ద రాజ్యాల పాలకులు చిన్న చిన్న గణరాజ్యాల్ని ఓడించి, ఆక్రమించుకుంటూ ఉన్న కాలంలో బుద్ధుడు పుట్టాడు. స్వేచ్ఛకూ, సౌభ్రాతృత్వానికీ, ప్రజాస్వామ్యానికీ కేంద్రాలైన గణరాజ్యాలను పెద్ద రాజ్యాలు ఆక్రమించుకోవడాన్ని ఆయన వ్యతిరేకించాడు. బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో ఈ దురాక్రమణలు దాదాపు నిలిచిపోయాయి. అయినా మగధ రాజు అజాతశత్రు ఒకసారి వైశాలి గణరాజ్యాన్ని ఆక్రమించుకోవాలని అనుకున్నాడు. కానీ, బుద్ధునికి తెలియకుండా జరగడం మంచిది కాదని అతని మంత్రులూ, సేనాపతులూ చెప్పారు. 


అప్పుడు వత్సకారుడు అనే మంత్రి ‘‘నేను వెళ్ళి ఈ విషయం బుద్ధునితో చెప్పి వస్తా’’నన్నాడు. బుద్ధుణ్ణి కలిసి సంగతి చెప్పాడు. 

విషయం విన్న బుద్ధుడు అతని వైపు నుంచీ చూపు మరల్చాడు. ఆనందుణ్ణి పిలిచి -

‘‘ఆనందా! వైశాలి ప్రజలు కలసిమెలసి ఉంటూ, ఏ నిర్ణయాన్నయినా కలిసి చర్చించుకొనే తీసుకుంటున్నారా?’’ అని అడిగాడు.

వత్సకారునికి ఏమీ అర్థం కాలేదు. అయినా వింటూ నిలబడిపోయాడు.

‘‘భగవాన్‌! ఇప్పటికీ వారు అలాగే ఉంటున్నారు’’ అన్నాడు ఆనందుడు.

‘‘ఆనందా! తీసుకున్న నిర్ణయాలను అందరూ కలిసే నిర్వహిస్తున్నారా?’’ అని ప్రశ్నించాడు బుద్ధుడు.

‘‘భగవాన్‌! నిర్వహిస్తున్నారు!’’

‘‘రాజ్య శాసనాలను పాటిస్తూ, రాజ్యం పట్ల అందరూ మనఃపూర్వకంగా విధేయులై ఉంటున్నారా?’’

‘‘భగవాన్‌! చిత్తం. అలాగే ఉంటున్నారు!’’

‘‘ఆనందా! వైశాలి ప్రజలు వృద్ధులను గౌరవిస్తున్నారా? వారు అనుభవంతో చెప్పే విషయాలను స్వీకరిస్తున్నారా? పాటిస్తున్నారా?’’

‘‘అవును భగవాన్‌! పెద్దల సుద్దులు పాటిస్తూనే ఉన్నారు!’’

‘‘ఆనందా! మరి, వైశాలి ప్రజలు స్త్రీలను గౌరవిస్తున్నారా? లేక వారిపట్ల అమర్యాదగా ప్రవరిస్తూ, అకృత్యాలకు పాల్పడుతున్నారా?’’

‘‘లేదు భగవాన్‌! వారు స్త్రీల పట్ల ఎలాంటి అత్యాచారాలూ చేయడం లేదు. తమతో సమానంగా చూస్తున్నారు!’’

‘‘అలాగే ‘మనందరం ఒక్కటే’ అనే జాతీయతా ధర్మాన్ని పాటిస్తున్నారా ఆనందా?’’

‘‘పాటిస్తున్నారు భగవాన్‌! వర్ణ, కుల, ప్రాంతీయ భేదాలు మరచి, ఒకే జాతీయతా భావంతో జీవిస్తున్నారు!’’

‘‘ఆనందా! వైశాలిలో మేధావులకూ, పండితులకూ, ధర్మ ప్రబోధకులకూ గౌరవం లభిస్తోందా?’’

‘‘లభిస్తోంది భగవాన్‌!’’

‘‘అయితే ఆనందా! ఈ ఏడు నియమాలనూ వారు పాటిస్తున్నంత కాలం వారిని ఎదిరించి, పోరాడి, విజయం సాధించేవారు ఎవ్వరూ ఉండరు. ఎంత గొప్ప చక్రవర్తి అయినా వారి పరాక్రమానికి పాదాక్రాంతులు కావలసిందే! ఘోర ఓటమిని చవి చూడాల్సిందే!’’ అని అంటూ, వత్సకారుని వైపు చూడకుండా, తిరస్కార భావంతో లేచి వెళ్ళాడు బుద్ధుడు. 

బుద్ధుని మాటలు విన్న వత్సకారునికి భయం కలిగింది. కాళ్ళ కింద నేల కదిలినట్టయింది. ఒక రాజ్యానికి ఏది బలమో, ఏది బలహీనతో అర్థమయింది. కలహాలూ, కుట్రలూ, మోసాలూ, అహంకారం, రాజ్యాల్నీ, రాజ్య భాగాలనూ ఆక్రమించుకోవాలనే ఆరాటం... ఇవేవీ విజయాన్ని చేకూర్చలేవని గ్రహించాడు. బుద్ధుని వైపు తిరిగి నమస్కరించి వెళ్ళిపోయాడు. అతని మాటతో అజాతశత్రు తన యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

‘ఒక దేశ విజయం కేవలం సైనిక శక్తిపైనే ఆధారపడదు. అది ప్రజలందరి సమష్టి కృషి మీదే ఆధారపడి ఉంటుంద’నేది బుద్ధుని సందేశానికి అర్థం.

1954లో ఆలిండియా రేడియోలో అంబేద్కర్‌ ప్రసంగిస్తూ, భారతదేశాన్ని బలమైన శక్తిగా రూపొందించడం కోసం తన రాజ్యాంగ రచనకు స్ఫూర్తిని బౌద్ధం నుంచే స్వీకరించానని చెప్పారు.

అవును... మనది భిన్నత్వంలో ఏకత్వం! అదే అజేయ భారతానికి సంకేతం!


బుద్ధుని కాలంలోని పధ్నాలుగు గణరాజ్యాలు:

అంగ, అవంతి, కాశీ, మథుర, వజ్జీ, మల్ల, ఛేతి, వత్స, కురు, పాంచాల, మత్స్య, గాంధార, కాంభోజ, అస్సక (అశ్మక లేదా ఆంధ్ర లేదా అంధక. దీని రాజధాని నేటి బోధన్‌).

-బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2020-06-26T05:30:00+05:30 IST