ఐఏఎస్‌ రమామణి కన్నుమూత

ABN , First Publish Date - 2020-05-29T07:59:52+05:30 IST

ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల పరిరక్షణలో ఆమె శివంగి. నీతి, నిజాయితీకి మారుపేరు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబద్ధత, అంకితభావంతో

ఐఏఎస్‌ రమామణి కన్నుమూత

  • వేల కోట్ల విలువైన భూములను పరిరక్షించిన ఆదర్శ అధికారిణి
  • గుంటూరులో హఠాన్మరణం
  • శివంగిగా రెవెన్యూ వర్గాల్లో పేరు
  • హైదరాబాద్‌లో పనిచేసినప్పుడు
  • భారీగా అక్రమ కట్టడాల కూల్చివేత
  • ‘కియ’కు భూసేకరణలో కీలకం
  • ఇరు రాష్ట్రాల ఐఏఎ‌స్‌ల దిగ్ర్భాంతి

అమరావతి, గుంటూరు, హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల పరిరక్షణలో ఆమె శివంగి. నీతి, నిజాయితీకి మారుపేరు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబద్ధత, అంకితభావంతో పనిచేయడమే ఆమె శైలి. ముక్కుసూటిగా వెళ్లడమే ఆమె తత్వం. ఆమే టీకే రమామణి. హఠాత్తుగా అస్వస్థతకు గురై, గురువారం ఈ ఆదర్శ అధికారిణి కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆమె గుంటూరు పండరీపురంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఛాతీలో నొప్పిగా ఉందంటూ గురువారం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే మధ్యాహ్నం ఒంటిగంటకు తుదిశ్వాస విడిచారు. కరోనా నేపథ్యంలో రెండుసార్లు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, అన్నిసార్లూ నెగెటివే వచ్చింది.


రమామణి భర్త మురళీమోహన్‌  ‘ఏపీ స్టెప్‌’లో మేనేజరుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. వారి ఇద్దరు కుమారులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో 1964 అక్టోబర్‌ 18న రమామణి జన్మించారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా సర్వీసులోకి వచ్చారు. ఆమె వృత్తి జీవితం మాత్రం హైదరాబాద్‌లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో అకౌంట్స్‌ ఆఫీసర్‌గా మొదలయింది. అక్కడ పని చేస్తుండగానే, గ్రూప్‌-1కు ఎంపికై, డిప్యూటీ కలెక్టర్‌ అయ్యారు. సోషలిస్టు కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు విధినిర్వహణలో దారిపొడుగునా ఎదురైన అడ్డంకులు, సవాళ్లెన్నో! వాటన్నింటినీ అధిగమించి ఎంతోమంది యువ అధికారులకు ప్రేరణగా నిలిచారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌ స్థాయిలోనే భూముల పరిరక్షణలో నాటి ప్రభుత్వానికి తురుపుముక్కగా నిలిచారు. ఇందుకు కారణం ఆమె తండ్రి, మాజీ ఎమ్మెల్సీ టీకే గంగాధరశాస్త్రి ఇచ్చిన స్ఫూర్తినే. సోషలిస్టు సిద్ధాంతాలతో ఆయన పేదలకోసం పనిచేశారు. రమామణి అదే కోణంలో బాధ్యతలను కొనసాగించారు. 


అక్రమాలపై ఉక్కుపాదం

గద్వాల సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో పరాధీనమైన పలు అసైన్డ్‌, ప్రభుత్వ భూములను వెనక్కు తీసుకోవడంలో రమామణి కీలకపాత్ర పోషించారు. దీంతో గద్వాల ప్రాంతానికి చెందిన ఓ నేత.. నాటి ప్రభుత్వాధినేతను కలిసి పట్టుబట్టి ఆమెను బదిలీ చేయించారు. తర్వాత రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో బడాబాబులు, కంపెనీల భూ దందాలను బయటపెట్టారు. వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడి ల్యాండ్‌బ్యాంక్‌లో పెట్టించారు. ఈ పనితీరును చూసి హైదరాబాద్‌ జిల్లా భూ పరిరక్షణ విభాగం ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ సందర్భంగానే హైదరాబాద్‌ నగరంలోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల పరాధీనాన్ని బయటకు తీసుకొచ్చారు.


ఈ నిబద్ధత చూసి ఏపీహెచ్‌ఆర్‌డీలో భూ పరిరక్షణపై ఆమెతో ప్రత్యేకంగా క్లాసులు ఇప్పించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ కేడర్‌కు ఆమె ఎంపికయ్యారు. 2010 బ్యాచ్‌లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. అనంతపురం జిల్లా జేసీగా ‘కియ’కు భూముల సేకరణలో కీలకంగా పనిచేశారు. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌కు కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవలే ఆ పోస్టునుంచి ప్రభుత్వం రమామణిని తప్పించింది. పోస్టింగ్‌కోసం ఎదురుచూస్తున్న తరుణంలోనే ఈ విషాదం చోటుచేసుకుందని ఐఏఎస్‌ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. పేదల అధికారిణి రమామణి మరణవార్త విని రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగ వర్గాలు దిగ్ర్భాంతికి గురయ్యారు.


ఐఏఎస్‌ అధికారులు ప్రవీణ్‌ప్రకాశ్‌, ప్రవీణ్‌కుమార్‌, సునీత, గుంటూరు కలెక్టర్‌ శ్యామ్యూల్‌ ఆనందకుమార్‌, జేసీలు ప్రశాంతి, దినేశ్‌కుమార్‌, ప్రద్యుమ్న, పియూశ్‌కుమార్‌, విజయ తదితరులు జీజీహెచ్‌లో రమామణి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రమామణి ఆదర్శ భావాలు స్ఫూర్తిదాయకమని ఏపీ ఐఏఎస్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ సంతాపం తెలిపారు. సీనియర్‌ ఐఏఎస్‌ నటరాజన్‌ గుల్జార్‌ ఒక ప్రకటనలో ఆమె మృతికి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) ప్రతినిధులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2020-05-29T07:59:52+05:30 IST