ఇండోర్‌ను అగ్రస్థానంలో నిలిపింది మన తెలుగువాడే!

ABN , First Publish Date - 2020-08-26T19:57:41+05:30 IST

ఇండోర్.. ప్రస్తుతం దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇండోర్‌కు ఈ గుర్తింపు రావడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రభుత్వాధికారులు, ప్రజలు, రాజకీయనాయకులు ఉమ్మడిగా సాధించిన ఘనత ఇది.

ఇండోర్‌ను అగ్రస్థానంలో నిలిపింది మన తెలుగువాడే!

ఇండోర్.. ప్రస్తుతం దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇండోర్‌కు ఈ గుర్తింపు రావడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రభుత్వాధికారులు, ప్రజలు, రాజకీయనాయకులు ఉమ్మడిగా సాధించిన ఘనత ఇది. ఈ స్థితికి చేరుకునే క్రమంలో ఇండోర్ నగరం ఎన్నో సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొంది. 2016లో ఈ ప్రయాణం ప్రారంభైన తొలినాళ్లలో ఇండోర్ పరిస్థితి నిరాశాజనకంగా ఉండేది. డంపింగ్ గ్రౌండ్ల వినియోగం పెరిగి కాలుష్యానికి దారితీసింది. వ్యర్థ నిర్వహణకు ముఖ్యమైన తడి, పొడి చెత్త వేరు చేయాలన్న విధానం అమలయ్యేదే కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలన్న ఉత్సాహం రాజకీయ నాయకుల్లోనూ కొరవడిన సమయమది. అలాంటి సమయంలో ఒక తెలుగు వ్యక్తి తీసుకొచ్చిన మార్పులే నేడు ఇండోర్‌ను మొదటి స్థానంలో నిలిపింది.


ముఖ్యపాత్ర పోషించింది మన తెలుగు వాడే...

ఇంతటి సంక్లిష్ట పరిస్థితిని చక్కదిద్ది.. ఇండోర్ అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషించింది మన తెలుగు బిడ్డ పరికిపండ్ల నరహరి. అప్పటి ఇండోర్ జిల్లా కలెక్టర్‌గా ఆయన అందించిన సేవలే ఇండోర్‌ను మొదటి స్థానంలో నిలిపాయి. ఇండోర్‌ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన జిల్లా యంత్రాంగాన్ని ముందుండి నడిపించారు. నరహరి కృషి కారణంగా నగర రూపు రేఖలు మారిపోయాయి. యావత్ దేశం దృష్టి ఇండోర్‌పై నిలిచింది. వరుసగా నాలుగు సార్లు దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. తన సేవలతో ఇండోర్ ప్రజల మెప్పు పొందిన నరహరి.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జన్మించారు. పెద్దపల్లిలోని బసంత్‌నగర్‌లో టైలర్‌గా పని చేసే పరికిపండ్ల సత్యనారాయణ-సరోజ దంపతుల మూడో సంతానం నరహరి. ఆయన 2001 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. స్కూల్ స్థాయి నుంచే ఆయన చురుకైన విద్యార్థిగా గుర్తింపు పొందారు. ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు పొంది కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. హైదరాబాద్ వాసవి కళాశాలలో ఇంజినీరింగ్ పట్టా సాధించారు. 1998లో అడ్వాన్స్ రీసర్చ్ విభాగంలో సైంటిస్ట్‌గా పని చేస్తూ 1999లో సివిల్స్ రాశారు. మొదటి ప్రయత్నంలో నిరాశ ఎదురైనా ఉద్యోగం చేస్తూనే ఆయన సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. 2001లో రెండో ప్రయత్నంలో 78 ర్యాంక్ సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకొని 2002 మేలో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ పొందారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోనే ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


లాడ్లీ లక్ష్మీయోజనకు శ్రీకారం..

కలెక్టర్‌గా, ఐసీడీఎస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు పేదలు ఆడపిల్లల పెళ్లికి పడుతున్న కష్టాలను చూసి నరహరి చలించిపోయారు. కూతురు పెళ్లి కోసం ఒక కుటుంబం పడే ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన నరహరి పేదవర్గాలకు ప్రభుత్వ సాయం అందించాలనే లక్ష్యంతో లాడ్లీ లక్ష్మీయోజన పథకానికి రూపకల్పన చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఆయనే రూపొందించారు. ఏడాది పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి మహిళా సంఘాలతో చర్చించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. నరహరి రూపొందించిన పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి అమలు చేసింది. ఈ పథకం మరో పది రాష్ట్రాల్లోనూ అమలు కావడం విశేషం. ఆడపిల్లల పెళ్లి కోసం ఆసరా ఉండే మంచి పథకాన్ని మన తెలుగువాడు రూపొందించడం గర్వకారణం. బంగారుతల్లి పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయడం విశేషం. నరహరి రూపొందించిన ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనగా మార్చి దేశ వ్యాప్తంగా అమలు చేస్తోంది.


ఒక వైపు పాలన.. మరో వైపు సేవ

నరహరి ఐఏఎస్ అధికారిగా ఒకవైపు పాలనా పరమైన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో వైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మాతృభూమికి, అక్కడి ప్రజలకి, ముఖ్యంగా యువత కోసం ఏధైనా చేయాలని సంకల్పించారు. ఆ ఆలోచలనకు ప్రతిరూపం కల్పించడానికి ఆలయ ఫౌండేషన్‌ను స్థాపించారు. తనలా మరో పది మందిని ఎదిగేలా చేయాలన్నది నరహరి ఆశయం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో... తన ఫౌండేషన్‌ ద్వారా కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, జ్ఞాపకశక్తి నైపుణ్యాలు, ఇతర అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. యువత ఐఏఎస్‌, ఐపీఎస్‌ కావడానికి ఎలా చదవాలి, ఎలాంటి పుస్తకాలు చదువాలి అనే అంశాల్లో మెలకువలు నేర్పిస్తున్నారు. అంతే కాకుండా రక్తదాన శిబిరాల వంటి ఇతర సహాయ కార్యక్రమాలు కూడా చేపడుతూ తన సేవా తత్పరతను చాటుకుంటున్నారు.


స్వచ్ఛ భారత్ మిషన్!

2014లో ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పారిశుధ్యానికి సంబంధించి ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనేక లక్ష్యాలు విధించింది. జాతీయ స్థాయిలో నగరాల మధ్య అనేక పోటీలు కూడా నిర్వహించింది. ఈ క్రమంలో ఇండోర్ 2016లో జాతీయస్థాయిలో 25 స్థానం సంపాదించింది. ఇదే సమయంలో ఇండోర్ రూరల్ జిల్లా దేశంలోనే రెండో బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా గుర్తింపు పొందింది. దీంతో ఇండోర్ నగర మున్సిపల్ అధికారుల్లో ఆత్మపరిశీలన ప్రారంభమైంది. ఈ క్రమంలోనే వారు.. ఇండోర్‌ను దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందాలనే లక్ష్యంతా వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ మహా ప్రయాణంలో పాలనాధికారిగా నరహరి ప్రముఖ పాత్ర పోషించారు. నగర రూపు రేఖలు మార్చేందుకు అనేక కొత్త విధానాలను ప్రవేశ పెట్టారు. స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేస్తూ..ఇండోర్ నగర ప్రగతిని కొత్త పుంతలు తొక్కించారు. 


మార్పు ఇలా..

లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఇండోర్ అధికారులకు ముందుగా ప్రజల్లో మార్పు తీసుకురావడం అనే భారీ సవాలు ఎదురైంది. అయితే మొక్కవోని దీక్షతో వారు నిరంతరం ప్రయత్నించి ప్రజల్లో మార్పు తీసుకొచ్చారు. తడి, పొడి, ప్రమాదకరమైన చెత్తను వేరు చేసేందుకు వీలుగా ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాల్లోని ఇళ్లకు అధికారులు ఉచితంగానే డస్ట్ బిన్స్‌ను సరఫరా చేశారు. ఈ విధానం పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు మున్సిపల్ అధికారులు, స్థానిక నేతలు సంయుక్తంగా పర్యటనలు చేపట్టి ఈ పద్ధతిని పాటించాలంటూ ప్రజలను ప్రోత్సహించారు.  భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రయత్నాలన్నీ అనుకున్న ఫలితాలు ఇస్తుండటంతో ఇండోర్‌ నగరంలో మార్పు క్రమంగా స్పష్టమవసాగింది. 


తాజా పరిస్థితి..

తడి, పొడి చెత్తను వేరు చేయడం అనే విధానం ప్రస్తుతం అక్కడ 100 శాతం అమలవుతోంది. వ్యర్థాలు విడుదలయ్యే ప్రదేశంలోనే ఇదంతా పూర్తవుతోంది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటైంది. చెత్త సేకరణ నుంచి రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలించడం వరకూ అన్నిటినీ ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు వీలుగా అధికారులు ఈ మొత్తం ప్రక్రియను డిజిటలీకరణ చేశారు. మరోవైపు.. వ్యవర్థాల నిర్వహణ ద్వారా ఉత్పత్తైన బయో సీఎన్‌జీ సాయంతోనే అక్కడి ఆర్టీసీ 15 బస్సులను నిర్వహిస్తోంది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా రెడ్యూస్ (చెత్త ఉత్పత్తిని తగ్గించడం), రీయూజ్ (పునర్వినియోగం), రీసైకిల్‌ విధానానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిన్నటి కారణంగా ఇండోర్ 2017లో తొలిసారిగా దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. ఐఏఎస్ నరహరి సేవల కారణంగా ఇండోర్ నగరం దేశం దృష్టిని ఆకర్షించడంలో సఫలీకృతమైంది.  


డంపింగ్ యార్డు నుంచి గోల్ఫ్ కోర్స్ వరకూ..

తాజాగా కేంద్రం విడుదల చేసిన స్వచ్ఛత నగరాల్లో కూడా ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో అధికారులు ఇండోర్ డంపింగ్ యార్డును తొలగించి.. ఆ ప్రాంతం మొత్తాన్ని పచ్చని చెట్లతో అందమైన హరితప్రదేశంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ భూమి మార్కెట్ విలువ దాదాపు 300 కోట్ల రూపాయలని సమాచారం. డంపింగ్ యార్డును తొలగించి ఆ స్థానంలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేసే దిశగా అధికారులు యత్నిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇండోర్ ప్రథమ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేస్తున్నారు.

Updated Date - 2020-08-26T19:57:41+05:30 IST