నేనొస్తే వెలుగులు నింపుతా!

ABN , First Publish Date - 2022-07-30T09:01:33+05:30 IST

నేనొస్తే వెలుగులు నింపుతా!

నేనొస్తే వెలుగులు నింపుతా!

భూమికి భూమి.. గ్రామాల రక్షణ

కొత్త వారికి కూడా ప్యాకేజీ

ముంపు మండలాలన్నీ కలిపి పోలవరం జిల్లాగా చేస్తా

చింతూరు ఐటీడీఏ, ఎటపాక డివిజన్‌ కొనసాగిస్తా

జగన్‌ బురదలో ముంచేశాడు

ఇంట్లో ఒక్కరుంటే వెయ్యి.. ఆపై ఎందరున్నా 2 వేలేనట!

అల్లూరి జిల్లా వరద ప్రాంతాల్లో బాధితులకు చంద్రబాబు పరామర్శ

విలీన మండలాల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం, పునరావాసం

వైసీపీ ఎంపీలతోపాటు జగన్‌నూ రాజీనామా చేయమనండి

కేంద్రం ఎందుకు నిధులివ్వదో చూద్దాం: బాబు


ఎటపాక/చింతూరు/కూనవరం/వరరామచంద్రపురం, జూలై 29: టీడీపీ అధికారంలోకి వస్తే ముంపు మండలాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్క నిర్వాసితుడికీ పరిహారం, పునరావాసం కల్పించడమే కాదు.. భూమికి భూమి ఇస్తామని.. వారి గ్రామాలను సురక్షితంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్తవారికి కూడా ప్యాకేజీ ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. వరదతో సర్వస్వం కోల్పోయిన వారికి నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళాదుంపలు.. అవి కూడా పాడైపోయినవి ఇచ్చి చేతిలో రూ.రెండు వేలు పెడితే సరిపోతుందా అని నిలదీశారు. ‘ఇంట్లో ఒక్కరే ఉంటే వెయ్యి రూపాయలు, ఆపై ఎంతమంది ఉన్నా రెండు వేలంట. ఆ రెండు వేలూ బురద కడగడానికీ సరిపోవు’ అని ఆక్షేపించారు. శుక్రవారం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంపు మండలాలు ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్వాసితులకు పరిహారం చెల్లించలేక చేతులెత్తేసి.. కేంద్రం ఇస్తేనే ఇస్తానన్న చేతగాని దద్దమ్మ సీఎం జగన్‌ అని విమర్శించారు. ‘తన పార్టీకి చెందిన ఎంపీలతోపాటు ఆయన్ను కూడా రాజీనామా చేయమనండి.. కేంద్రం ఎందుకు నిధులు కేటాయించదో చూద్దాం. జగన్‌కు ఒక వ్యూహమంటూ లేదని, ప్రణాళికా లేదని, దీంతోనే పోలవరం నిధులు కేటాయించలేకపోతున్నామని కేంద్ర మంత్రులు అనడాన్ని బట్టే ఈయన పనితనం అర్థమవుతోంది’ అని అన్నారు. జగన్‌కు పాలన చేతకాదని, మొండెద్దులాంటి వ్యక్తి అని విమర్శించారు. మొండెద్దు తీరుపై విసిగి వేసారిన రైతు చివరకు ఎక్కడకు తరలిస్తాడో.. ఈయన్ను కూడా ప్రజలు అక్కడికే తరలిస్తారని అన్నారు. డ్రైవింగ్‌ రాని వ్యక్తికి బస్సు ఇస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు రాష్ట్రంలో కూడా అదే జరుగుతోందని చెప్పారు. అమరావతిలో బయల్దేరి కుక్కునూరు, వేలేరుపాడు చేరుకుని గురువారం రాత్రి భద్రాచలంలో బస చేశానని.. జగన్‌ రోడ్డుపై ప్రయాణించేసరికి రాత్రంతా ఒకటే నడుం నొప్పి అని చమత్కరించడంతో ప్రజలు గొల్లున నవ్వారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


మీలో పాడేరును ఎంత మంది చూశారు?

టీడీపీ అధికారంలోకి రాగానే ముంపు మండలాలన్నింటినీ కలపి పోలవరం జిల్లాగా ఏర్పాటు చేస్తా. విలీన మండలాలకు, అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు నడుమ 380 కిలోమీటర్ల దూరం ఉంది. వాటిని ఆ జిల్లాలో కలపడం హాస్యాస్పదం. రహదారి సౌకర్యం సక్రమంగా లేని ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడమేంటి? అసలు మీలో (బాధితులు) ఎంత మంది పాడేరును చూశారు? విలీన మండలాలకు దాని కంటే హైదరాబాద్‌, అమరావతే దగ్గర. టీడీపీ రాగానే చింతూరు ఐటీడీఏ, ఎటపాక డివిజన్‌ కొనసాగిస్తాం.


వెలుగులు కనిపించేవరకు..

త్యాగం చేస్తున్న విలీన మండలాల ప్రజలను ఎంతగానో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పరిహారం, పునరావాసం ఇచ్చి ఊరుకోవడం కాదు.. వారి జీవితాల్లో వెలుగులు కనిపించే వరకు కృషి చేస్తా. నేను కట్టిన పునరావాస కాలనీలే నేటి వరదకు పునరావాస కేంద్రాలుగా మారాయి. అంతకుమించి ఈ సీఎం ఒక్క కాలనీ కూడా కట్టలేదు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు వెయ్యిరోజులుగా రోడ్డున పడ్డారు. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మిమ్మల్ని జగన్‌ బురదలో ముంచాడు. ఆయన కలెక్టర్‌కు వంద మార్కులు వేస్తారేమో గానీ.. ఆయనకు ప్రజలు సున్నా మార్కులు వేయడానికి సిద్ధంగా ఉన్నా రు. అవసరమైతే మైనస్‌ మార్కులు కూడా వేస్తారు. గోదావరి వివరాలు తెలియని వ్యక్తులు మంత్రులు, ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే ముంపు మండలాల్లో ఇంతటి భారీ నష్టం జరిగింది. ముందస్తు ప్రణాళిక లేదు. ఎటపాకలోని ఐదు గ్రామాల ప్రజలు పడే కష్టాలు తాత్కాలికం. మేం అధికారంలోకి రాగానే ఎటువంటి సమస్యా లేకుండా చేస్తాం.


నటించేవారిని నమ్మొద్దు..

కోడికత్తి కమలహాసన్‌ మళ్లీ వస్తున్నాడు. చిన్నపిల్లలను ఎత్తుకోవడం, ఆడబిడ్డల తల నిమరడం, ముద్దులు పెట్టుకోవడం మళ్లీ మొదలుపెట్టాడు. ఇలా నటించేవారిని నమ్మకూడదు. ప్రజల్లో చైతన్యం పెరగాలి. పోలవరం నష్టపరిహారం ఎందుకివ్వరని వైసీపీ నాయకులను నిలదీయండి. దొంగ చేతికే మీరు తాళాలిచ్చారు. ముఖ్యమంత్రి ఇక్కడకు వచ్చాడా? మొన్న ఓ మండలంలో పర్యటించి.. పది కిలోమీటర్ల దూరంలో రెండు హెలిప్యాడ్‌లు పెట్టి గాల్లో తిరిగి భూమిపై దిగకుండానే వెళ్లిపోయాడు. ఈ నియోజకవర్గం (రంపచోడవరం)లో ఎంత అరాచకమంటే.. ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్‌ను హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించడం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు కొందరు అనంతబాబుకు సహకరించేందుకు యత్నించారు. పోలీసు అధికారులు గుర్తుపెట్టుకోవాలి. రేపంటూ ఒక రోజు ఉంటుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని వదిలే సమస్యే లేదు. జగన్‌ బాబాయిని చంపి నాపై పెట్టాడు. ముందు ముందు ఇంకెవరిని చంపుతారో?

Updated Date - 2022-07-30T09:01:33+05:30 IST