రిషి సునాక్ కీలక వ్యాఖ్య.. ఆ వ్యక్తిని నేనే అంటూ..

ABN , First Publish Date - 2022-07-24T05:19:23+05:30 IST

బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న భారత సంతతి మాజీ మంత్రి రిషి సునాక్(Rishi sunak) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

రిషి సునాక్ కీలక వ్యాఖ్య.. ఆ వ్యక్తిని నేనే అంటూ..

ఎన్నారై డెస్క్: బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న భారత సంతతి మాజీ మంత్రి రిషి సునాక్(Rishi sunak) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పోటీలో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్న అభ్యర్థి తానేనని కామెంట్ చేశారు. ప్రధాన ప్రత్యర్థి లిజ్ ట్రస్‌‌కు పార్టీలో మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


అధికార కన్సర్వేటివ్ పార్టీ నేతల మద్దతు కోల్పోవడంతో బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో.. పార్టీని దేశాన్ని ముందుండి నడిపించే మరో నాయకుడిని ఎన్నుకునేందుకు కన్సర్వేటివ్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి నుంచి పోటీ ప్రధానంగా రిషి, ట్రస్‌ల మధ్యనే నెలకొంది. ఇప్పటివరకూ విడతల వారీగా జరిగిన పార్టీ ఎన్నికల్లో అనేక మంది పార్టీ సభ్యులు రిషికే ఓటు వేశారు. 


అయితే.. కీలకమైన ప్రస్తుత తరుణంలో మాత్రం ట్రస్‌కు మద్దతు పెరుగుతోంది. ఈ పరిణామం వెనుక బోరిస్ జాన్సన్ మద్దతుదారులు ఉన్నారనేది మొదటి నుంచి బ్రిటన్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ వాదనలకు బలాన్నిస్తూ రిషి సునాక్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రాంథమ్ అనే టౌన్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. తన ప్రత్యర్థికే సింహాసనం దక్కాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని కామెంట్ చేశారు. ‘‘అయితే.. తమకు ప్రత్యామ్నాయం కావాలని పార్టీ సభ్యులు కోరుకుంటున్నారు. నా వాదన వినేందుకు వారు సిద్ధంగానే ఉన్నారు’’ అని రిషి అన్నారు. ఇక కన్సర్వేటివ్ పార్టీ.. లిజ్ ట్రస్‌నే ప్రధానిగా ఎన్నుకొన్న పక్షంలో బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన మూడో మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తారు. అంతకుమునుపు.. మార్గరేట్ థాచర్, థెరిసా మే బ్రిటన్‌కు ప్రధానులుగా సేవలందించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-07-24T05:19:23+05:30 IST