నేనూ వలస కార్మికుడినే!

ABN , First Publish Date - 2020-05-31T05:30:00+05:30 IST

సోనూసూద్‌... తెరపై పవర్‌ఫుల్‌ విలన్‌. నిజజీవితంలో మాత్రం సూపర్‌ హీరో, ఇన్‌స్ఫైరింగ్‌ హీరో అని కితాబు అందుకుంటున్నారు. ‘కొవిడ్‌-19’ కారణంగా లాక్‌ డౌన్‌తో సతమతమవుతున్న పేదలకు...

నేనూ వలస కార్మికుడినే!

  • సోనూసూద్‌... తెరపై పవర్‌ఫుల్‌ విలన్‌. నిజజీవితంలో మాత్రం సూపర్‌ హీరో, ఇన్‌స్ఫైరింగ్‌ హీరో అని కితాబు అందుకుంటున్నారు. ‘కొవిడ్‌-19’ కారణంగా  లాక్‌ డౌన్‌తో సతమతమవుతున్న పేదలకు, వలస కార్మికులకు ఆయన అండగా నిలిచారు. ‘అన్నమో రామచంద్రా’  అని అలమటించే  వేలాది మంది కడుపు నింపుతున్నారు. పొట్టకూటి కోసం వలస వచ్చిన కార్మికులను బస్సుల్లోనే  కాదు.. ప్రత్యేక విమానంలో వారి  సొంత గూటికి చేర్చి రియల్‌ హీరో అనిపించుకున్నారు. కొందరైతే ‘సోనూ సూద్‌ మనిషి రూపంలో ఉన్న దేవుడు,  భగత్‌సింగ్‌’ అని కొనియాడుతున్నారు. వలస కార్మికులను వారి  ఇళ్లకు చేర్చే బాధ్యతను తన భుజాలపై వేసుకుని రోజుకు  20 గంటలపాటు కష్టపడుతున్న సోనూతో ‘నవ్య’ మాటామంతీ...


ఒకప్పుడు నేనూ పొట్ట చేత పట్టుకుని ముంబయ్‌ వచ్చినవాడినే! ట్రైన్‌లో... కిక్కిరిసిన జనరల్‌ బోగీలో బాత్‌రూమ్‌ పక్కన తలుపు పట్టుకు వేలాడుతూ ఎన్నోసార్లు ప్రయాణం చేశా. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి తిండి లేక, సొంత ఊరు చేరుకునే మార్గం తెలియక ఇబ్బంది పడుతున్న లక్షలాది వలస కార్మికుల కష్టాలను కళ్లారా చూశా. తినడానికి తిండి లేక తమ బిడ్డల్ని వెంటేసుకుని వందల కిలోమీటర్లు అలా నడిచి వెళుతున్న వారి ఫొటోలు, కథనాలు చూసి చలించిపోయా. వెంటనే నాకు కెరీర్‌ బిగినింగ్‌లో నేను పడ్డ కష్టాలన్నీ కళ్లముందు మెదిలాయి. నేనూ వలస కార్మికుడినే. విపత్తులు ఎదురైనప్పుడు కార్మికుల కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. జీవితం ఓ సర్కిల్‌ లాంటిది. ఓ చోట ప్రారంభమై ఎంత స్థాయికి చేరినా ఆ సర్కిల్‌ చుట్టూనే తిరగాలి. అందుకే లాక్‌డౌన్‌ వల్ల కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నా. 


ఆ చిన్నారులను చూసి గుండె బరువెక్కింది..

సహాయక కార్యక్రమాల్లో మొదటి అడుగుగా జూహులోని నా హోటల్‌ను ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనాతో పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి ఇచ్చాను. ముంబయ్‌ పరిసర ప్రాంతాల్లో పట్టెడు అన్నం లేక అలమటిస్తున్న దాదాపు 40 వేల మందికి నాన్న శక్తి సూద్‌ పేరిట అన్నదానం మొదలుపెట్టా. ఆ తర్వాత ముంబయ్‌కు కాస్త దూరంలో మరో 25 వేల మంది ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లాను. ఆ ప్రాంత అధికారుల అనుమతితో వంట గదులు ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన భోజనం తయారు చేసి వడ్డించాం. రంజాన్‌ మాసంలో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులకు కావలసిన ఆహారాన్ని అందించాం. ఆకలి తీరినా వారి కళ్లల్లో ఏదో బాధ ఉండడం గమనించా. ఆరా తీస్తే వలస కార్మికులంతా తమ స్వగ్రామాలకు చేరుకోవాలనుకుంటున్నారని తెలిసింది. కొందరు నేరుగా నన్నే అడిగారు. దాంతో రెండు రోజులు అదే పనిగా ఆలోచించా.  కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండల్లో తల్లిదండ్రులతోపాటు కలిసి అడుగులేస్తున్న చిన్నారులు నాకు పదేపదే గుర్తుకు వచ్చారు. ఎంత ఖర్చయినా సరే వలస కార్మికులను వాళ్ల ప్రాంతాలకు చేర్చాలని గట్టిగా తీర్మానించుకొన్నా. దాని కోసం ఓ ప్రణాళిక సిద్ధం చేశాను. మొదట వాలంటీర్స్‌తో రంగంలోకి దిగి ఎవరెవరు ఏయే ప్రాంతాలకు వెళ్లాలో డేటా సేకరించాం. ‘కష్టాల్లో ఉన్నవారు మమ్మల్ని సంప్రతించండి’ అని సోషల్‌ మీడియాలో ప్రకటన ఇచ్చాం. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మమ్మల్ని అప్రోచ్‌ అయిన వారందరినీ తరలించడానికి ఆయా ప్రాంతాల అధికారులతో మాట్లాడి అనుమతులు పొందాం. వారికి కరోనా పరీక్షలు చేయించి తగిన జాగ్రత్తలతో బస్సులను ఏర్పాటు చేసి కర్ణాటక, రాజస్థాన్‌, ఒడిశా, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ తదితర ప్రాంతాలకు పంపించాం. ప్రయాణంలో తినడానికి ఆహారం, పళ్లు, మంచినీరుతో ఓ కిట్‌ రూపొందించి వారికి అందజేశాం. వలస కార్మికుల్లో ఒక గర్భిణి ఇంటికి చేరుకున్నాక ప్రసవించారు. తన బిడ్డకు ‘సోనూసూద్‌ శ్రీవాత్సవ’ అని నా పేరు పెట్టుకోవడం ఆనందాన్ని కలిగించింది. 




నాకు అవకాశం ఇవ్వమని కోరాను!

కొంతమంది భవన కార్మికులను, ఇతరత్రా పనులకు వచ్చిన వారినీ కలసి  ‘ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఇంటికి చేరుకుందామనుకుంటున్నారు?’ అని అడిగాను. ‘ఏముంది సారూ.. కష్టం మాకేమీ కొత్త కాదు. సైట్‌లో పనికి పెట్టే కష్టాన్ని 10 రోజులపాటు వందల కిలోమీటర్లు నడవడానికి పెడతాం. ఇంటికి చేరుకోవడంలో ఉన్న ఆనందం ముందు మండుటెండల్లో నడవడం పెద్ట కష్టమేమీ కాదు’ అని సమాధానమిచ్చారు. అది విని ఒక నిమిషం నేను ఏమీ మాట్లాడలేకపోయా. అమాయకంగా చూసే ఆ చిన్నారులను చూశాక నా కళ్లల్లో నీళ్లు ఆగలేదు. ‘మిమ్మల్ని మీ ఇళ్లకు చేర్చే అవకాశం నాకివ్వండి’ అని వారిని కోరాను. వారు సరేనన్న తర్వాత రోడ్డు మార్గం ద్వారా వందలాది మందిని పదిహేను రోజులుగా వాళ్ల సొంత గూటికి చేరుస్తూనే ఉన్నాం. ఇప్పటివరకూ  12 వేలకు పైగా వలస కార్మికులు వారి ఇళ్లకు చేరుకున్నారు. వలస కార్మికులు బయలుదేరేటప్పుడు చెమర్చిన కళ్లతో చూసిన చూపులు నేను ఎప్పటికీ మర్చిపోలేను.  వారు నాపై చూపించిన ప్రేమ, చేసిన సెల్యూట్‌లు, వారి కళ్లల్లో ఆనందం నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఇలాంటి అనుభూతి నాకు ఎప్పుడూ కలగలేదు. ఇంకా ఏదో చేయాలనే తపన! ఫోన్‌ ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా అందరికీ అందుబాటులో లేనేమో అన్న అనుమానంతో... వలస కార్మికుల కోసం ఓ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశా. వచ్చిన కాల్స్‌ ఆధారంగా నా భార్య, వాలంటీర్స్‌ డేటా తయారు చేస్తే నా బిడ్డలిద్దరూ వారిని సంప్రతించి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. 




‘అన్నా!.. నువ్వే దిక్కు’ అన్నాడు

‘సోనూ అన్నా... నేను చదువు కోసం థానేకు వచ్చి లాక్‌డౌన్‌ వల్ల ఇరుక్కుపోయాను. ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఇక్కడ నా ఇబ్బందిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న మాఅమ్మ నా గురించి బాధపడుతోంది.  దయ చేసి నన్ను ఆమె దగ్గరకు చేర్చండి’ అని ఓ సోదరుడు చేసిన ట్వీట్‌ చూసి నా కళ్లు చెమర్చాయి. . ‘బ్రదర్‌ అమ్మకు చెప్పు.. త్వరలోనే నిన్ను కలవబోతున్నా అని’ ట్వీట్‌ చేసి ఆ కుర్రాడిని వాళ్ల తల్లి దగ్గరకు చేర్చాను. అలాగే బీహార్‌లో ఇరుక్కుపోయిన మరో బిడ్డ కోసం తల్లి రోదిస్తోందని తెలిసి తల్లీబిడ్డల్ని ఓ చోట చేర్చాం. ఇలా నా దృష్టికి వచ్చి సాయం అని అర్థించిన ప్రతి ఒక్కరికీ సాయపడతా. చివరి వలస కార్మికుడు ఇంటికి చేరేవరకూ ఈ మిషన్‌ కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారా అని అర్ధరాత్రి కూడా మెసేజ్‌లు చెక్‌ చేసుకుంటున్నా. ఇబ్బందుల్లో ఉన్న వలస కార్మికులు ఏ మూలన ఉన్నా వారిని స్వగ్రామాలకు చేర్చే వరకూ నిద్రపోను. 


అమ్మ మాటే స్ఫూర్తి... 

‘కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయపడే స్థాయిలో ఉన్నప్పుడే నువ్వు నిజంగా సక్సెస్‌ అయినట్లు’ అని అమ్మ తరచూ చెబుతుండేది. ఆ స్ఫూర్తితోనే ఈ మిషన్‌ నడిపించగలుగుతున్నా. ఇప్పుడు జనం కోసం నేను ఏదైతే చేస్తున్నానో అదంతా నా పేరెంట్స్‌ నాకిచ్చిన శక్తే. ‘ సోనూ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? పేరు కోసమా, గొప్ప కోసమా? ఏదన్నా ఆశించా’ అని కొందరు అనుకోవడం నా దృష్టికి వచ్చింది. ఇవాళ నాకు కొత్తగా రావాల్సిన పేరు ఏమీలేదు. నటుడిగా నేను ప్రేక్షకుల హృదయాలను ఎప్పుడో గెలుచుకున్నా. కాకపోతే మనిషిగా పుట్టినందుకు సాటివారికి సాయపడాలనే ఆలోచనని, శక్తిని ఆ భగవంతుడు నాకు కలిగించాడు. అందుకే నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. నేను చేసే పనికి మద్దతు పలికే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.  ఈ సేవా కార్యక్రమానికి  నా భార్య సోనాలి, నా ఇద్దరు బిడ్డలు ఇషాన్‌, అయాన్‌ సహా నా వాలంటీర్స్‌ అందిస్తున్న సహకారం మరువలేనిది. అలాగే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, మునిసిపాలిటీ సిబ్బంది సహకారం మరువలేనిది. అలాగే మిత్రులు రోహిత్‌శెట్టి, టబు, ఫరాఖాన్‌ ప్రతిక్షణం నాతో టచ్‌లో ఉంటున్నారు.


ఇది నా బాధ్యత 

సమాజంలో ఓ పౌరుడిగా ఈ సేవాకార్యక్రమాలు చేస్తున్నానంతే!  వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు చేయని సాహసం మీరు చేశారంటూ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. సాటి మనిషి కష్టంలో ఉంటే ఆదుకోవాలనే బాధ్యతతోనే ఇదంతా చేస్తున్నాను. ‘ ఒకరు చేశారు.. మరొకరు చేయలేదు.. ప్రభుత్వాలు ఆలస్యంగా స్పందించాయి..’ ఇవన్నీ నాకు అనవసరం. ఒకరిని విమర్శించే సమయం కాదిది. ఆ భగవంతుడు నాకు అప్పగించిన పనిని నేను నిజాయతీగా చేసుకుంటూ వెళుతున్నా. నా బాగోగుల గురించి ఆయనే చూసుకుంటాడు.  నేను వేసిన ప్రతి అడుగుకు ప్రభుత్వాలు, పోలీస్‌ సిబ్బంది ఎంతో సహకరిస్తున్నాయి. 




ఆ మహిళల కోసం ప్రత్యేక విమానం

కేరళలోని ఎర్నాకుళంలోని ఓ టెక్స్‌టైల్‌ కంపెనీలో ఒడిశాకు చెందిన 170 మంది మహిళలు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఒడిశా తిరిగి వెళ్లడానికి ప్రత్యేక రైలు అందుబాటులో లేకపోవడం, చేతిలో డబ్బు అయిపోవడంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న సోనూ సూద్‌ ఆ మహిళల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ‘‘కేరళలోని నా స్నేహితురాలు నీతీ గోయల్‌ కేరళ, ఒడిశా ప్రభుత్వాలతో మాట్లాడి కొచ్చి, భువనేశ్వర్‌ విమానాశ్రయాల్లో విమానం ఎక్కి, దిగే ఏర్పాట్లు చేశారు’’ అన్నారు సోనూ.




పరిశ్రమ కోలుకోవాలి...

లాక్‌డౌన్‌కి ముందు చిరంజీవిగారు నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో ఉన్నా. కరోనా విజృంభిస్తున్న తరుణంలో చిరంజీవిగారు కొద్ది రోజులు షూటింగ్‌ ఆపు చేస్తే మంచిది అనడంతో అందరం ఓకే అన్నాం. ఈ చిత్రంలో నా పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌, సంతోశ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా, హిందీలో అక్షయ్‌కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నా. త్వరలో షూటింగ్‌లు మొదలవ్వాలని కోరుకుంటున్నా. 

-ఆలపాటి మధు 



Updated Date - 2020-05-31T05:30:00+05:30 IST