Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 19 2021 @ 03:06AM

అన్నికులాలకూ చేయూత

  • దళితబంధు మాదిరిగా కొత్త పథకాలు.. సంపద పెరిగే కొద్దీ పేదలకు పంచుతాం
  • ఓట్లు, ఎన్నికల కోసం ఈ పథకం తేలేదు
  • దళిత జాతి ఉద్ధరణ.. సామాజిక బాధ్యత
  • అనుమానం లేదు.. వచ్చే టర్మ్‌ టీఆర్‌ఎస్‌దే
  • ప్రజా సేవలో నర్సన్నకు అపార అనుభవం
  • రాష్ట్ర స్థాయిలో సేవలు వాడుకుంటాం
  • టీఆర్‌ఎస్‌లో మోత్కుపల్లి చేరిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ధాన్యం కొంటాం.. ఆందోళన వద్దు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా


హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు తీసుకొచ్చినట్టుగానే మిగతా కులాలకూ ఆర్థిక చేయూత అందించేందుకు పథకాలు తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్ర సంపద పెరిగితే ప్రభుత్వం తప్పనిసరిగా పేదలకు పంచుతుందని, అయితే అది ఒక క్రమపద్ధతిలో జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే యాదవులు, మత్స్య, గీత వృత్తిదారులకు పలు పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. దళితబంధు ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక కారణం ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఇంట్లో బక్కగున్న కొడుకును డాక్టర్‌కు చూపించి మందులు ఇప్పించినట్టుగానే.. ఆర్థికంగా బలహీనులైన వారికి పథకాల ద్వారా ప్రభుత్వం చేయూతనిస్తుంది’’ అని పేర్కొన్నారు. దళిత జాతి ఉద్ధరణ సామాజిక బాధ్యత అని, వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సోమవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎ్‌సలో చేరారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మోత్కుపల్లికి స్వయంగా కేసీఆరే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అ నంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ దళితబంధు సమావేశానికి మొదటి ఆహ్వానం, సమాచారం మోత్కుపల్లికే అందించినట్టు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు నచ్చి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఒకరు తమ ప్రాంతాన్ని భౌగోళికంగా తెలంగాణలో కలపాలని అడుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో? గమనించాలని సూచించారు. అనుమానాలు అక్కర్లేదని, వచ్చే టర్మ్‌ కూడా టీఆర్‌ఎ్‌సదే అధికారం అని స్పష్టం చేశారు.


దళితబంధుకు అడ్డు తగలొద్దు

దళితబంధు వంటి పథకం పెట్టాలన్న ఆలోచన గత పాలకులకు ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు. రాజకీయాల కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అడ్డు తగలొద్దని విపక్ష పార్టీలకు సూచించారు. ఇతర పార్టీలకు రాజకీయాలంటే ఒక క్రీడ అని... కానీ, టీఆర్‌ఎ్‌సకు మాత్రం ఓ టాస్క్‌ అని కేసీఆర్‌ అభివర్ణించారు. అందుకే, రూ. 1.7 లక్షల కోట్లను దళితబంధుకు ఖర్చు పెట్టబోతున్నామని వివరించారు. అంత డబ్బు ఎలా తెస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని చెబుతూ.. దానికి దమ్ము కావాలని వ్యాఖ్యానించారు. ఏడేళ్లలో తెలంగాణ బడ్జెట్‌ రూ.23లక్షల కోట్లని, ఇందులో దళిత బంధుకు పెట్టే రూ.1.7లక్షల కోట్లు ఒక లెక్కనా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశంలోని దళితులందరికీ దారి చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, అదే దమ్ముతో దళితబంధును విజయవంతం చేస్తామని వివరించారు. తెలంగాణ సమాజానికి ఎంతో ఓర్పు ఉందని, నాడు యాదవులకు గొర్రెలు కొనిస్తే.. మిగతా వర్గాలెవ్వరూ అడ్డం తిరగలేదని గుర్తు చేశారు. అదే తరహాలో దళితబంధుకు ఇతర వర్గాల వారు అభ్యంతరం వ్యక్తం చేయబోరని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 100మందికి దళితబంధు ఇస్తామని స్పష్టంచేశారు. ఈ పథకం ఓట్ల కోసం తీసుకొచ్చిందని కాదని, పార్టీలతో సంబంధంతో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వివరించారు.


విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

తెలంగాణకు జరిగే అన్యాయంపై మాట్లాడితే పెట్టుబడులే రావని గత పాలకులు అపోహలు సృష్టించారని కేసీఆర్‌ గుర్తు చేశారు. రాష్ట్రం వస్తే ప్రజలు ఏకే-47లు పట్టుకొని తిరుగుతారని అప్పటి సీఎం ఒక సమావేశంలో కూడా చెప్పారని కేసీఆర్‌ వాపోయారు. తెలంగా ణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కొందరు మిత్రులు తనను చంపేస్తారని కూడా హెచ్చరించినా భయపడకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చినంక తాను పక్కకు జరుగుదామనుకున్నానని, కానీ.. కొత్త రాష్ట్రం వేరే ఎవరి చేతిలోనే పెడితే ఆగమైతదని పలువురు సూచిస్తే నాయకత్వ బాధ్యతలు చేపట్టానని వివరించారు. ఈ ఏడేళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. రైతు బంధు, రైతుబీమాతో వ్యవసాయాన్ని నిలబెట్టామని పేర్కొన్నారు. గతంలో రైతులు, చేనేతలు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునే వారని, రాష్ట్రంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌.. ఇలా తాము అమలు చేస్తున్న ఒక్కో పథకం.. ఒక్కో కథ, వ్యథల నుంచే పుట్టాయ ని చెప్పారు. ఉమ్మడి ఏపీలో మన దేవుళ్లు కూడా వివక్ష ఎదుర్కొన్నారని, అందుకే యాదాద్రిని అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

 

మోత్కుపల్లి సన్నిహితుడు

దళిత బంధు పథకం గురించి తెలుసుకున్న తర్వాత తనతో కలిసి నడుస్తానని మోత్కుపల్లి చెప్పారని, అందుకే పార్టీలో చేరమన్నానని కేసీఆర్‌ వివరించారు. అట్టడుగు వర్గాలకు సేవ చేయాలని తపించే వ్యక్తి అని కొనియాడారు. ప్రజాసేవలో ఆయనకు అపార అనుభవం ఉందని అన్నారు. తనకు చాలా సన్నిహితుడని.. తాను ఎమ్మెల్యేగా ఉండగా మోత్కుపల్లి విద్యుత్తు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. టీఆర్‌ఎ్‌సలో ఆయన చేరికను ఓ రాజకీయ చర్యగా చూడొద్దన్నారు. మోత్కుపల్లి సేవలను కేవలం ఆలేరుకే పరిమితం చేయబోమని, రాష్ట్ర స్థాయిలో ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌కు వచ్చేక్రమంలో అంబేడ్కర్‌, జగ్జీవన్‌రాం విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపానికి మోత్కుపల్లి నివాళులర్పించారు. కాగా, సమావేశంలో అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఓ వ్యక్తి కోరగా.. ఆ బాధ్యతను మంత్రి జగదీశ్‌రెడ్డికి కేసీఆర్‌ అప్పగించారు.


ధాన్యం కొంటాం.. ఆందోళన వద్దు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ప్రగతి భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, పౌరసరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌, సీఎంవో అధికారులు నర్సింగ రావు, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్‌ తదితరులతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎంవో నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా ధాన్యం సేకరణ చేపడతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement